National Comment : స్వేచ్ఛ తోనే డెమోక్రసీ మనుగడ
సుప్రీంకోర్టు ధర్మానసం సంచలన కామెంట్స్
National Comment : భారత దేశ సర్వోన్నత న్యాయస్థానం ఇటీవల జూలు విదులుస్తోంది. ఈ దేశంలో ఇంకా న్యాయం బతికే ఉందన్న వాస్తవాన్ని తెలియ చేస్తోంది.
న్యాయం అందమైన భవంతుల్లో ఉన్న వాళ్లకు కాదని పామరులకు సైతం అది అండగా నిలుస్తుందని ఆచరణలో చేసి చూపిస్తోంది. ప్రధానంగా ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది ధర్మాసనం.
వ్యక్తులను ఆరోపణలు ఆధారంగా అదుపులోకి తీసుకోవడం, కేసులు బనాయించడం, అరెస్ట్ లు చేయడం, అక్రమ కేసులు బనాయించడం పూర్తిగా చట్ట విరుద్దమని స్పష్టం చేసింది.
ఇది ఆహ్వానించ దగిన పరిణామం అని చెప్పక తప్పదు. కేవలం ఎవరో వ్యక్తిగతంగానో లేదా కావాలనో చేసిన ఆరోపణలను ఆధారంగా చేసుకుని అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా తప్పుపట్టింది.
ఇది పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్లేనని భావించవచ్చని హెచ్చరించింది. ఈ దేశంలో పుట్టిన ప్రతి వ్యక్తికి మాట్లాడే, తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేసే హక్కు ఉందన్న విషయం మరిచి పోతే ఎలా అని నిలదీసింది.
ఒక రకంగా తామే సుప్రీం అంటూ విర్రవీగుతూ వ్యక్తిగత కక్షలతో వ్యక్తులను హింసించడం, కేసుల పేరుతో వేధింపులకు గురి చేయడం ముమ్మాటికీ నేరమేనని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు(National Comment).
ఫ్యాక్ట్ చెకర్ మహ్మద్ జుబైర్ కేసు విషయంపై జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ బోపన్న తో కూడిన ధర్మాసనం చేసిన ఈ వ్యాఖ్యలు ప్రజాస్వామ్యంపై మరింత నమ్మకాన్ని పెంచేలా చేశాయి.
ఒక రకంగా ఈ దేశంలో పోలీసు వ్యవస్థపై న్యాయ వ్యవస్థ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం కలకలం రేపాయి. ఇది ఒక రకంగా ఖాకీల క్రౌర్యానికి చెంప పెట్టుగా భావించక తప్పదు.
Also Read : ధరల పెరుగుదలపై చర్చకు సిద్దం