Supreme Court: నోట్ల కట్టల కేసులో జస్టిస్ వర్మ ఇంటికి త్రిసభ్య కమిటీ
నోట్ల కట్టల కేసులో జస్టిస్ వర్మ ఇంటికి త్రిసభ్య కమిటీ
Supreme Court : ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగిన సందర్భంలో బయట పడ్డ నోట్ల కట్టలు కేసులో సుప్రీంకోర్టు దర్యాప్తు ముమ్మరం చేస్తుంది. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టేందుకు సుప్రీం కోర్టు(Supreme Court) ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా నియమించిన ముగ్గురు ప్రధాన న్యాయమూర్తుల కమిటీ మంగళవారం జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంటికి వెళ్లింది. కమిటీ సభ్యులు జస్టిస్ శీల్ నాగు (పంజాబ్, హరియాణా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి), జస్టిస్ జి.ఎస్.సంధావాలియా (హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి), జస్టిస్ అను శివరామన్ (కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి) మంగళవారం జస్టిస్ వర్మ ఇంటిని సందర్శించారు. అక్కడ 30-35 నిమిషాలపాటు ఉండి జస్టిస్ వర్మ ఇంటి ప్రాంగణాన్ని, అక్కడ అగ్నిప్రమాదం జరిగిన స్టోర్ రూమ్‌ను నిశితంగా పరిశీలించారు. మధ్యాహ్నం సమయానికి అక్కడనుండి వెళ్లిపోయారు. ఆ సమయంలో జస్టిస్ వర్మ ఇంట్లో ఉన్నారా లేరా అనే విషయం ఇంకా తెలియరాలేదు.
Supreme Court Comment about Justice Varma Case
మరోవైపు… అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ వర్మ(Justice Yeshwanth Varma)ను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలన్న సుప్రీం సిఫారసును వ్యతిరేకిస్తూ అలహాబాద్ హైకోర్టు న్యాయవాదులు మంగళవారం నిరవధిక సమ్మెకు దిగారు. తమ నిరసన ఏ న్యాయస్థానానికీ, న్యాయమూర్తికీ వ్యతిరేకం కాదని… న్యాయవ్యవస్థను వంచించినవారికి వ్యతిరేకంగానే తాము సమ్మె చేస్తున్నామని అలహాబాద్ హైకోర్ట్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అనిల్ తివారీ తెలిపారు. అవినీతికి పాల్పడ్డవారిపై, పారదర్శకత లేని వ్యవస్థపై తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ‘‘(జస్టిస్ వర్మ) బదిలీ ఉత్తర్వును పునఃపరిశీలించి, ఉపసంహరించుకోవాలన్నదే మా ప్రధాన డిమాండ్’’ అని ఆయన పేర్కొన్నారు.
జస్టిస్ వర్మ చేపట్టిన న్యాయ నియామకాలపై ఏంచేద్దాం !
జస్టిస్ యశ్వంత్ వర్మ(Justice Yeshwanth Varma) ఇంటి ప్రాంగణంలో నోట్ల కట్టల వ్యవహారం రాజకీయంగా పెద్ద చర్చకు దారి తీసింది. దీనితో ఈ నోట్ల కట్టల వ్యవహారంపై… రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖడ్ మంగళవారం తన చాంబర్‌లో అఖిలపక్ష భేటీ జరిపారు. న్యాయ నియామకాల అంశంపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించేందుకు ఆయన ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ధన్ ఖడ్ మాట్లాడుతూ… జాతీయ న్యాయ నియామకాల కమిషన్ (ఎన్‌జేఏసీ) బిల్లును సుప్రీంకోర్టు(Supreme Court) 2015లో కొట్టివేయడంపై తన అభిప్రాయాలను మరోమారు ఘాటుగా వ్యక్తపరిచినట్లు సమాచారం. ఎన్‌జేఏసీ బిల్లు కొట్టివేతను అప్పట్నుంచీ ఆయన పలుమార్లు బాహాటంగానే వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. తాజా పరిణామాల నేపథ్యంలో ఈ అంశంపై ఎలా ముందుకు వెళ్లాలో సూచించాలని అఖిలపక్ష భేటీకి హాజరైన నేతలను కోరినట్లు తెలిసింది. అయితే, న్యాయనియామకాలపై ప్రభుత్వం తన ప్రతిపాదనలను స్పష్టంగా తెలియజేయాలని.. అప్పుడే తమ వైఖరిని తెలియజేస్తామని ప్రతిపక్షాలు తెలిపాయి.
ప్రస్తుతానికైతే న్యాయ నియామకాలు పారదర్శకంగా జరగడం లేదని, ఇందుకు ప్రత్యామ్నాయం అవసరమని కాంగ్రెస్ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. ఉన్నత న్యాయవ్యవస్థలో అన్ని వర్గాలకూ ప్రాతినిధ్యం లభించడం లేదని, రిజర్వేషన్ పద్ధతే లేదని ఆయన అన్నారు. ప్రత్యామ్నాయ వ్యవస్థపై ప్రభుత్వం ప్రతిపాదనలతో ముందుకు వచ్చినప్పుడే తాము తమ అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పగలమని ఆయన అన్నారు. అదే సమయంలో న్యాయవ్యవస్థకు ఉన్న స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడాలని ఆయన అభిప్రాయపడ్డారు. తృణమూల్ కాంగ్రెస్ నేత సుఖేందు శేఖర్ రాయ్ కూడా… ఎన్‌జేఏసీ వంటి యంత్రాంగంపై ప్రభుత్వ వైఖరి చెప్పినప్పుడే తాము స్పందిస్తామని స్పష్టం చేశారు. ఇక.. న్యాయనియామకాల విషయంపై ఎన్డీఏ సహచరులతో చర్చించి తాము ఒక నిర్ణయానికి వస్తామని సభా పక్ష నేత, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డా చెప్పారు. ఈలోపు ఆయా పార్టీలు తమ నాయకత్వంతో చర్చించి స్పష్టతకు రావాలని ఆయన సూచించారు. మరోవైపు… ఎలాంటి ఏకాభిప్రాయమూ లేకుండానే ఈ భేటీ ముగిసిందని శివసేన (ఉద్ధవ్‌ఠాక్రే వర్గం) ఎంపీ ప్రియాంక చతుర్వేది ఆరోపించారు.
రాజ్యసభలో నోటీసు తిరస్కరణ
అఖిల పక్ష భేటీకి ముందు… జస్టిస్ వర్మ(Justice Yeshwanth Varma) ఇంటి ప్రాంగణంలో నోట్ల కట్టల ఉదంతంపై చర్చకు రాజ్యసభ సభ్యుడు, ఐఏయూఎంఎల్ నేత హరీస్ బీరన్ 267 నిబంధన కింద సభలో ఇచ్చిన నోటీసును జగ్‌దీప్ ధన్‌ఖడ్ తిరస్కరించారు. జరిగిన ఉదంతం తనకు ఆందోళన కలిగించిందని… న్యాయవ్యవస్థలో ఉన్న లొసుగులను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుని ఉంటే ఈ పరిస్థితి తలెత్తేది కాదని ఆయన పేర్కొన్నారు. న్యాయనియమకాల విషయంలో ప్రక్షాళనకు రూపొందించిన ఎన్‌జేఏసీ చట్టాన్ని కోర్టు కొట్టివేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఆ చరిత్రాత్మక చట్టానికి అసాధారణ రీతిలో ఏకాభిప్రాయం లభించిందని.. అదే అమలులోకి వస్తే పరిస్థితులు వేరేగా ఉండేవని ఆయన వ్యాఖ్యానించారు. అసలు ఒక రాజ్యాంగ సవరణను న్యాయపరంగా సమీక్షించే అధికారం ఎవరికీ లేదని అభిప్రాయపడ్డారు.
Also Read : Bhupesh Baghel: మద్యం కుంభకోణం కేసులో ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం ఇంట్లో సీబీఐ సోదాలు