Electoral Bonds: ‘ఎలక్టోరల్ బాండ్లు’ స్కీమ్ పై సుప్రీం సంచలన తీర్పు !

‘ఎలక్టోరల్ బాండ్లు’ స్కీమ్ పై సుప్రీం సంచలన తీర్పు !

Electoral Bonds: ‘ఎలక్టోరల్ బాండ్లు’ స్కీమ్ చెల్లుబాటుపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ‘ఎలక్టోరల్ బాండ్లు(Electoral Bonds)’ రాజ్యాంగ విరుద్దమని స్పష్టం చేసింది. నల్లధనాన్ని అరికట్టేందుకు ఇదొక్కటే మార్గం కాదని… ఆ కారణంతో సమాచార హక్కు చట్టాన్ని ఉల్లంఘించడం సమంజసం కాదని ధర్మాసనం అభిప్రాయపడింది. విరాళాలు ఇచ్చిన పేర్లు రహస్యంగా ఉంచడం తగదని… ఇది ఆదాయపు పన్ను చట్టాన్ని ఉల్లంఘించడంతో పాటు క్రిడ్ ప్రోకు దారితీసే అవకాశం ఉందని తెలిపింది. ఎటువంటి వివరాలు తెలియని ఎన్నికల బాండ్లను స్వీకరించడం అంటే సమాచార హక్కును ఉల్లంఘించడమేనని ధర్మాసనం స్పష్టం చేసింది.

అంతేకాదు ఎలక్టోరల్ బాండ్ల జారీని బ్యాంకులు తక్షణమే నిలిపివేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ మేరకు సీజేఐ జస్టిస్‌ డి.వై. చంద్రచూడ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం గతేడాది అక్టోబరులో విచారణ జరిపి తీర్పును రిజర్వ్‌ చేసింది. తాజాగా నేడు తీర్పును వెలువరించింది. దీనితో ఎలక్టోరల్ బాండ్ల(Electoral Bonds) స్కీమ్ ను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పు… రాజకీయ వర్గాల్లో కలవరం సృష్టిస్తోంది.

Electoral Bonds – ‘ఎలక్టోరల్ బాండ్లు’ స్కీమ్ అంటే ఏమిటి ?

ఎన్నికల బాండ్లు అంటే ఒక ప్రామిసరీ నోట్‌ లాంటివి. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో లభ్యం అయ్యే ఈ ఎన్నికల బాండ్లను… ఎవరైనా వ్యక్తులు, కంపెనీలు కొనుగోలు చేయవచ్చు. అలా కొనుగోలు చేసిన ఎన్నికల బాండ్లను వారికి నచ్చిన రాజకీయ పార్టీలకు విరాళంగా ఇవ్వొచ్చు. ఆ తరువాత రాజకీయ పార్టీలు తమకు వచ్చిన బాండ్లను నగదుగా మార్చుకొని పార్టీ కార్యక్రమాల కోసం వినియోగించుకుంటాయి. రాజకీయ పార్టీల విరాళాల విషయంలో పారదర్శకత తీసుకురావాలనే ఉద్దేశంతో కేంద్రంలోని అధికార భాజపా ప్రభుత్వం 2018లో ఈ ఎన్నికల బాండ్ల పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. అయితే రాజకీయ పార్టీలు తాము స్వీకరించిన విరాళాల గురించి బహిర్గతం చేయాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం ఆర్థిక చట్టం-2017 సవరణ చేసింది. దీనితో ఎన్నికల బాండ్ల విధానంలో పారదర్శకత లోపించిందని పలువురు విమర్శించారు. ఈ క్రమంలో ఈ పథకాన్ని సవాల్‌ చేస్తూ ఏడీఆర్‌, కాంగ్రెస్‌ నాయకురాలు జయా ఠాకుర్‌, సీపీఎం, మరో పిటిషనర్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

‘ఎలక్టోరల్ బాండ్లు(Electoral Bonds)’ స్కీమ్ పై విచారణ చేపట్టిన సీజేఐ జస్టిస్‌ డి.వై. చంద్రచూడ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం… సంస్థల నుంచి అపరిమిత రాజకీయ విరాళాలను అనుమతించే ‘కంపెనీల చట్టం’లో చేసిన సవరణలు ఏకపక్షంగా, రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని పేర్కొంది. కంపెనీలు ఇచ్చే విరాళాలు పూర్తిగా క్విడ్‌ ప్రోకో ప్రయోజనాలకు అనుకూలంగా ఉండటంతో పారదర్శకత లోపించిందని… అందువల్ల ఎన్నికల బాండ్ల ద్వారా వచ్చే విరాళాలను తప్పనిసరిగా బహిర్గతం చేయాల్సిందేనని స్పష్టం చేసింది. 2019 ఏప్రిల్‌ 12 నుంచి ఇప్పటివరకు రాజకీయ పార్టీలకు వచ్చిన ఎన్నికల బాండ్ల వివరాలను మార్చి 6వ తేదీలోగా కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించాలని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. మార్చి 13 లోగా ఆ వివరాలను వెబ్‌సైట్‌ లో ప్రచురించాలని ఈసీని ఆదేశించింది.

సుప్రీంతీర్పు బీజేపీకు ఎదురుదెబ్బ ?

మరికొన్ని నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న వేళ ‘ఎలక్టోరల్ బాండ్లు(Electoral Bonds)’ స్కీమ్ పై సుప్రీంకోర్టు తీర్పు ప్రధాన రాజకీయ పార్టీలపై పెను ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా ఎల‌క్టోర‌ల్ బాండ్స్‌ పథకాన్ని స‌ర్వోన్న‌త న్యాయ‌స్ధానం రద్దు చేయ‌డం బీజేపీకి గట్టి దెబ్బే అనే వాదన బలంగా వినిపిస్తోంది. ఎందుకంటే 2016 నుంచి 2022 మ‌ధ్య ఈ స్కీమ్ కింద పార్టీలకు స‌మ‌కూరిన విరాళాల్లో 60 శాతం పైగా బీజేపీకే ల‌భించాయి. ఎన్నికల కమిషన్ డేటా ప్రకారం… 2016 నుంచి 2022 మధ్య రూ. 16,437 కోట్ల విలువైన 28,030 ఎలక్టోరల్ బాండ్‌లు ఎస్‌బీఐ విక్రయించింది. మొత్తం విరాళాల్లో బీజేపీకి 60 శాతం పైగా అంటే రూ. 10,122 కోట్లు విరాళాలుగా స‌మ‌కూరాయి.

ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం కాంగ్రెస్ మొత్తం విరాళాల్లో 10 శాతం రూ. 1547 కోట్ల విరాళాల‌ను స్వీక‌రించింది. ప‌శ్చిమ బెంగాల్ అధికార తృణ‌మూల్ కాంగ్రెస్ 8 శాతంతో రూ. 823 కోట్ల విరాళాల‌ను స్వీక‌రించింది. ఈ జాబితాలో 30 పార్టీల‌కు అందిన విరాళాల‌తో పోలిస్తే బీజేపీ ఎన్నిక‌ల బాండ్ల ద్వారా స‌మ‌కూరిన మొత్తం మూడు రెట్లు అధికం కావ‌డం గ‌మ‌నార్హం. ఇంకా ఈ జాబితాను ప‌రిశీలిస్తే సీపీఎం రూ. 367 కోట్లు, ఎన్సీపీ రూ. 231 కోట్లు, బీఎస్పీ రూ. 85 కోట్లు, సీపీఐ రూ 13 కోట్లు ఎన్నిక‌ల బాండ్ల ద్వారా స‌మీక‌రించాయి.

Also Read : TDP Nakka Anand Babu : కలెక్టర్ల ప్రమేయంతోనే వైసీపీ నేతల ఇసుక దందా – మాజీ మంత్రి

Leave A Reply

Your Email Id will not be published!