Tahawwur Rana: ఎన్ఐఏ కస్టడీకు ముంబై ఉగ్రదాడి సూత్రదారి తహవ్వుర్ రాణా
ఎన్ఐఏ కస్టడీకు ముంబై ఉగ్రదాడి సూత్రదారి తహవ్వుర్ రాణా
Tahawwur Rana : ముంబై ఉగ్రదాడి కేసులో ప్రధాన సూత్రధారి తహవ్వుర్ హుస్సేన్ రాణాను 18 రోజుల ఎన్‌ఐఏ కస్టడీకి పాటియాలా హౌస్ కోర్టు అనుమతించింది. అమెరికాలోని లాస్ ఏంజెలెస్ నుంచి తహవ్వుర్ రాణాను(Tahawwur Rana) అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ ప్రత్యేక విమానంలో గురువారం దిల్లీకి తీసుకొచ్చారు. అనంతరం రాణాను గురువారం అర్ధరాత్రి ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు ప్రత్యేక ఎన్‌ఐఏ(NIA) కోర్టు న్యాయమూర్తి చందర్ జిత్ సింగ్ ఎదుట ఎన్‌ఐఏ అధికారులు హాజరుపర్చారు. ఎన్‌ఐఏ తరఫున సీనియర్ అడ్వొకేట్లు నరేందర్ మాన్, దయాన్ కృష్ణన్, రాణా తరఫున ఢిల్లీ లీగల్ సర్వీసెస్ అథారిటీ అడ్వొకేట్ పీయూష్ సచ్‌దేవా వాదనలు వినిపించారు.
Tahawwur Rana to NIA
పోలీసులు కోర్టు గదిలోకి ఇతరులను అనుమతించలేదు. మీడియా ప్రతినిధులను సైతం బయటకు పంపించారు. ముంబై దాడుల కేసులో విచారణ నిమిత్తం రాణాను 20 రోజులపాటు ఎన్‌ఐఏ కస్టడీకి అప్పగించాలని దయాన్ కృష్ణన్ కోరగా, 18 రోజుల ఎన్‌ఐఏ కస్టడీకి కోర్టు అనుమతించింది. అర్ధరాత్రి వరకూ కోర్టులో వాదనలు కొనసాగాయి. ఉగ్రవాద దాడుల్లో రాణా పాత్రకు సంబంధించి కొన్ని సాక్ష్యాధారాలను కోర్టుకు కృష్ణన్ సమర్పించారు. ఈ సందర్భంగా ఎన్‌ఐఏ(NIA) కార్యాలయం, పటియాలా హౌస్ కోర్టు ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు.
ముంబై ఉగ్రవాద దాడుల సూత్రధారుల్లో ఒకడైన తహవ్వుర్ హుస్సేన్ రాణా(Tahawwur Rana)ను ఎట్టకేలకు ఇండియాకు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. భారత దర్యాప్తు అధికారులు అమెరికా నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తరలించారు. బుధవారం సాయంత్రం అమెరికాలోని లాస్‌ఏంజెలెస్ నుంచి బయలుదేరిన విమానం గురువారం సాయంత్రం 6.30 గంటలకు ఢిల్లీ పాలం ఎయిర్ పోర్టులో ల్యాండయ్యింది. విమానం నుంచి బయటకు రాగానే రాణాను ఎన్‌ఏఐ బృందం అధికారికంగా అరెస్టు చేసింది. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో పటియాలా హౌస్ ఎన్‌ఐఏ కోర్టుకు తరలించారు.
దీనితో 2008 నాటి ఉగ్రవాద దాడుల కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) ప్రత్యేక కోర్టులో రాణాపై ఇక విచారణ ప్రారంభం కానుంది. నేరపూరిత కుట్ర, భారతదేశంపై యుద్ధం ప్రకటించడం, హత్యతోపాటు చట్టవ్యతిరేక కార్యకలాపాల (నిరోధక) చట్టం కింద రాణాపై అభియోగాలు నమోదయ్యాయి. అతడిని అమెరికా నుంచి భారత్‌కు రప్పించడం అతిపెద్ద దౌత్య, న్యాయపరమైన విజయంగా భావిస్తున్నారు. 26/11 దాడుల్లో మృతిచెందినవారికి, బాధితులకు న్యాయం చేకూర్చడంలో రాణా అప్పగింత ఒక కీలకమైన ముందుడుగు అని అమెరికా న్యాయ శాఖ గురువారం వెల్లడించింది.
ముంబైలో ఆ రోజు ఏం జరిగింది ?
2008 నవంబర్ 26న పాకిస్తాన్(Pakistan) కు చెందిన 10 మంది లష్కరే తోయిబా ఉగ్రవాదులు దేశ ఆర్థిక రాజధాని ముంబైలో మారణహోమం సృష్టించారు. నవంబర్ 26 నుంచి 29 దాకా… నాలుగు రోజులపాటు వేర్వేరు చోట్ల తుపాకులు, గ్రెనేడ్లతో చెలరేగిపోతూ నెత్తుటేర్లు పారించారు. ఛత్రపతి శివాజీ టెర్మినల్, ఒబెరియ్ ట్రిడెంట్ హోటల్, తాజ్‌మహల్ ప్యాలెస్ హోటల్, లియోపోల్డ్ కేఫ్, కామా హాస్పిటల్, నారిమన్ హౌస్, మెట్రో సినిమా హాల్ తదితర ప్రాంతాల్లో విచక్షణారహితంగా దాడులకు పాల్పడ్డారు. ఈ ఉగ్రదాడుల్లో ఆరుగురు అమెరికా పౌరులు సహా 166 మంది మృతిచెందారు. 300 మంది క్షతగాత్రులుగా మారారు. భద్రతా సిబ్బంది కాల్పుల్లో 9 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అజ్మల్ కసబ్ ఒక్కడే సజీవంగా దొరికిపోయాడు. సుదీర్ఘ విచారణ అనంతరం అతడికి ఉరిశిక్ష అమలు చేశారు.
అయితే ముంబైలో ఉగ్రవాద దాడులకు తహవ్వుర్ హుస్సేన్ రాణా సహాయ సహకారాలు అందించినట్లు ఎన్‌ఏఐ చెబుతోంది. 2009లో ఎఫ్‌బీఐ రాణాను అరెస్టు చేసింది. లాస్‌ఏంజెలెస్‌లోని మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్‌లో నిర్బంధించింది. భారత్ కు తనను అప్పగించవద్దని, అక్కడ తనకు రక్షణ ఉండదని మొండికేస్తూ అమెరికా కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేస్తూ 15 ఏళ్లు కాలక్షేపం చేసిన తహవ్వుర్ రాణా ఆశలు నెరవేరలేదు. అతడి అప్పగింత ప్రక్రియ సుదీర్ఘంగా కొనసాగించింది. కొన్ని రోజులు క్రితం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సమావేశమైన భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆ తర్వాత రాణా అప్పగింత ప్రక్రియ చకచకా పూర్తయ్యింది.
ఎవరీ తహవ్వుర్ హుస్సేన్ రాణా ?
పాకిస్తాన్ లో ధనవంతుల కుటుంబంలో 1961 జనవరి 12న జన్మించిన తహవ్వుర్ హుస్సేన్ రాణా చివరకు ఉగ్రబాట పట్టాడు. ఇస్లామాబాద్‌లో పెరిగిన రాణా హసన్ అబ్దల్ కేడెట్ కాలేజీలో చదువుకున్నాడు. అక్కడే డేవిడ్ కోలోమన్ హెడ్లీ అలియాస్ దావూద్ గిలానీతో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ సన్నిహిత మిత్రులయ్యారు. వైద్య విద్య అభ్యసించిన రాణా పాకిస్తాన్ సైన్యంలో డాక్టర్ గా పనిచేశాడు. 1997లో మేజర్ హోదాలో పదవీ విరమణ పొందాడు. తర్వాత కెనడాకు చేరుకున్నాడు. ఇమ్మిగ్రేషన్ సేవలు అందించే కంపెనీ స్థాపించాడు. కెనడా పౌరసత్వం సంపాదించాడు.
అనంతరం అమెరికాలోని షికాగోకు మకాం మార్చాడు. ఇమ్మిగ్రేషన్, వీసా ఏజెన్సీ ప్రారంభించాడు. హలాల్ మాంసం విక్రయించే వ్యాపారం చేశాడు. రాణా సాయంతో హెడ్లీ ముంబైలో ‘ఫస్ట్ వరల్డ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్’ పేరిట ఏజెన్సీని ఏర్పాటు చేశాడు. లష్కరేతాయిబా, ఐఏస్ఐల సూచనల మేరకు… ముంబైలో తాజ్ హోటల్, ఒబెరాయ్ హోటల్, నారీమన్ పాయింట్ వద్ద రెక్కీ చేసి, మ్యాపులు రూపొందించాడు. అమెరికా మీదుగా పాక్ వెళ్లి వివరాలన్నీ లష్కరేతాయిబా, ఐఏస్ఐ బాసులకు అందజేసి.. ఉగ్రదాడులకు రూపకల్పన చేశారు. ఈ క్రమంలో రాణా, హెడ్లీ 231 సార్లు మాట్లాడుకున్నట్టు ఎన్‌ఐఏ గుర్తించింది. మరోవైపు రాణా కూడా దాడులకు ముందు సెప్టెంబర్ 13 నుంచి 21 వరకు వైద్యురాలైన తన భార్యతో కలిసి భారత్ లో పర్యటించాడు. తాజ్‌మహల్ వద్ద, ముంబైలో, కేరళలోని కోచిలో రెక్కీ చేసి వెళ్లాడు. తర్వాత ఐదు రోజులకే ముంబైలో ఉగ్రదాడి జరిగింది. 26/11 దాడులకు రాణా ఆఫీసును ఉగ్రవాదులు ఒక అడ్డాగా వాడుకున్నారు. ఆరుగురు ప్రధాన కుట్రదారుల్లో రాణా కూడా ఉన్నాడు. అయితే, హెడ్లీ అప్రూవర్‌గా మారిపోయాడు. ప్రస్తుతం అమెరికాలో కస్టడీలో ఉన్నాడు.
Also Read : Tahawwur Rana: భారత్ కు తహవ్వుర్ రాణా ! సిద్ధంగా బుల్లెట్‌ప్రూఫ్ వాహనం, కమాండోలు !