Telangana Floods Comment : కుండ పోత గుండె కోత
భారీ వర్షం బతుకు దుర్భరం
Telangana Floods Comment : ప్రకృతి ప్రకోపం ముందు ఎవరైనా తల వంచి తీరాల్సిందే. ఎన్ని విజయాలు సాధించినా ఇంకెంతగా పేరు పొందినా చివరకు కొట్టుకు పోవాల్సిందే. చిగురుటాకుల్లా రాలి పోవాల్సిందే. అందుకే ప్రకృతి కన్నెర్ర చేస్తే యావత్ర ప్రపంచం బుగ్గి పాలవుతుంది. అల్లకల్లోలం అవుతుంది. మానవ సమాజం ఎన్నో మార్పులకు లోనైంది. కానీ విపత్కర పరిస్థితుల నుంచి , వరదల నుంచి , భారీ వర్షాల నుంచి ఎలా గట్టెక్కాలనేది ఇంకా ప్రయత్నం చేయాల్సింది చాలా ఉంది. అసలే వర్షా కాలం. ఎక్కడ చూసినా వానలే. కుండ పోతగా కురుస్తున్న చినుకులే. వర్షపు ఉధృతికి జన జీవనం స్తంభించి పోయింది. ఒక రకంగా చెప్పాలంటే లక్షలాది మందికి కంటి మీద కునుకే లేకుండా చేసింది. నిన్నటి దాకా వానలు పలకరించ లేదని వాపోయారు. కానీ ఉన్నట్టుండి బంగాళా ఖాతంలో చోటు చేసుకున్న అల్ప పీడనం వాయుగుండంగా మారింది. అంతులేని శోకాన్ని మిగిల్చింది. కళ్ల ముందే కొందరు కొట్టుకు పోయారు. మరికొందరు నిరాశ్రులయ్యారు. ఇంకొందరు శిబిరాల్లో తలదాచు కుంటున్నారు.
Telangana Floods Comments
ఇలాంటి విపత్కర పరిస్థితుల నుంచి గట్టెక్కేందుకు శత విధాలుగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నా ఇవేవీ సరి పోవడం లేదు. ఇరు తెలుగు రాష్ట్రాలను వానలు(Rains) చుట్టు ముట్టాయి. ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల(Rains) ధాటికి వాగులు, వంకలు, చెరువులు, కుంటలు, నదులు జల కళ ను సంతరించుకున్నాయి. ఇక జలాశయాలు పూర్తిగా నిండి పోయాయి. మరికొన్ని అలుగు పారుతున్నాయి. ఇంకొన్ని మత్తడి దుంకుతున్నాయి. తెలంగాణాలోని 70 శాతానికి పైగా ప్రాంతాలు నీళ్లలో తడిసి ముద్దవుతున్నాయి.
ఇక ఏపీలో సైతం ఇదే పరిస్థితి నెలకొంది. మొన్నటికి మొన్న హిమాచల్ ప్రదేశ్ , రాజస్థాన్ , గుజరాత్ , ఒడిశా, హర్యాను చూశాం. ఇప్పుడు తెలంగాణ(Telangana Floods Comment), ఏపీ రాష్ట్రాలు వణుకుతున్నాయి. ఆసరా కోసం ఎదురు చూస్తున్నాయి. ప్రధాన ప్రాజెక్టులన్నీ నిండి పోయాయి. మరికొన్ని ప్రమాద స్థాయి దాటి ప్రవహిస్తున్నాయి.
గోదావరి ఉగ్ర రూపం దాల్చుతోంది. ప్రకాశం బ్యారేజ్ కి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. తుంగ భద్ర ఎగసి పడుతోంది. జూరాల జల కళతో అలరారుతోంది. శ్రీశైలం నీటి ప్రవాహంతో ఉరకలు వేస్తోంది. కాళేశ్వరం, ధవళేశ్వరం, మానేరు, నాగార్జునా సాగర్, ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని జలాశయాలు నీటి కుండల్ని తలపింప చేస్తున్నాయి. ఊళ్లకు ఊళ్లు జలదిగ్భంధంలో చిక్కుకు పోయాయి.
ఎక్కడ చూసినా నీళ్లే..మరో వైపు కన్నీళ్లు కారుస్తున్న బాధితులు మరో వైపు. ప్రకృతి ప్రకోపానికి ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తున్నాయి ఏపీ..తెలంగాణ. హెలికాప్టర్లు, అగ్ని మాపక , ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది చేసిన ప్రయత్నం ఓ ఊరిని కాపాడేలా చేసింది. ఇందుకు సీఎం కేసీఆర్ ను అభినందించక తప్పదు. మరో వైపు రాజధాని హైదరాబాద్ చిన్న చినుకులకే విల విల లాడుతోంది. ఒక రకంగా ఊపిరి ఆడక తల్లడిల్లుతోంది. ఇప్పటికైనా డల్లాస్ మాటేమిటో కానీ ముందస్తు సాయం ఎలా చేయాలనే దానిపై ఏలిన పాలకులు ఆలోచించాలి. పర్యావరణ హితంగా ఉండేలా ప్రయత్నించాలి. కొంత మేరకు ఆస్తి, ప్రాణ నష్టం నుంచి కాపాడుకోవచ్చు. బాధితుల కన్నీళ్లు తుడవక పోయినా కనీసం ప్రాణాలను రక్షించిన వాళ్లవుతారు.
Also Read : Rahul Gandhi : ముమ్మాటికీ మోదీదే తప్పు – రాహుల్