Telangana Police Hats Off Comment : మాన‌వ‌త్వ‌మా వ‌ర్ధిల్లుమా

హ్యాట్సాఫ్ తెలంగాణ పోలీస్

Telangana Police Hats Off Comment : ప్రార్థించే పెద‌వుల కంటే సాయం చేసే చేతులే మిన్న అన్న మ‌ద‌ర్ థెరిసాను మ‌రో సారి గుర్తుకు తీసుకు వ‌చ్చేలా చేశారు పోలీసులు. ప్ర‌స్తుత స‌మాజంలో తోటి వారు ఇబ్బంది ప‌డుతుంటే చూసి న‌వ్వుకునే రోజుల్లో ఏకంగా క‌ష్టాల్లో ఉన్న వారిని, వ‌ర‌ద‌ల్లో చిక్కుకు పోయిన వారికి, గ‌ల్లంతైన మృత దేహాల‌ను వెతికి తీసుకు రావ‌డం అంటే మామూలు మాట‌లు కాదు. దీనికి ధైర్యం ఉండాలి. అంత‌కు మించి సాటి మ‌నుషుల ప‌ట్ల క‌రుణ‌, ప్రేమ‌, ద‌య , జాలి క‌లిగి ఉంటేనే స‌హాయం చేసేందుకు, ఆదుకునేందుకు ముందుకు వ‌స్తారు. వాయుగుండం గండంగా మారింది.

ఇరు తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల పాలిట గుదిబండ‌గా మారేలా చేశాయి ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వ‌ర్షాలు. వీటి దెబ్బ‌కు వాగులు, వంక‌లు, కుంట‌లు, చెరువులు, ప్రాజెక్టులు పొంగి ప్ర‌వ‌హిస్తున్నాయి. చాలా ఊళ్లు చిక్కుకు పోయాయి. కాల‌నీలు నీట మునిగాయి. ప‌లువురు వ‌ర‌ద ఉధృతికి త‌ట్టుకోలేక కొట్టుకు పోయారు..ప్రాణాలు కోల్పోయారు. మ‌రికొంద‌రు గ‌ల్లంత‌య్యారు. ఇంకొంద‌రు లెక్క‌ల్లోకి రాకుండా నీళ్ల ధాటికి క‌నుమ‌రుగై పోయారు. ఈ స‌మ‌యంలో ఎవ‌రైనా , ఎంత‌టి వారైనా, ఏ స్థాయిలో ఉన్నా సామాన్యంగా బ‌తికి ఉన్న‌ప్పుడే ప‌ల‌క‌రించేందుకు క‌ష్టాల్లో ఉన్నామంటే ద‌రికి రారు.

Telangana Police Hats Off Comment Public

కానీ గ‌ల్లంతై వ‌ర‌ద ఉధృతికి కొట్టుకు పోయిన మృత దేహాల‌ను వెతికి ప‌ట్టుకోవ‌డం అంటే మాట‌లా. చ‌ని పోతే త‌న వారైనా , ప‌క్క వారైనా ప‌రాయి వారుగా చూసే వింత లోకం ఇది. కానీ తెలంగాణ‌కు చెందిన భూపాల‌ప‌ల్లి పోలీసులు మాత్రం మాన‌వ‌త్వాన్ని చాటుకున్నారు. తాము ఖాకీలం కామ‌ని తామూ మ‌నుషుల‌మేన‌ని, మాన‌వ‌త్వం ఇంకా మాలో మిగిలి ఉంద‌ని చాటి చెప్పారు. చేత‌ల్లో చేసి చూపించారు. వారు చేసిన ప‌నికి యావ‌త్ తెలంగాణ స‌మాజం త‌ల వంచి న‌మ‌స్క‌రిస్తోంది.

ఈ ఘ‌ట‌న భూపాల‌ప‌ల్లి జిల్లాలో చోటు చేసుకుంది. మోరంచ‌ప‌ల్లి వాగు వ‌ర‌ద ఉధృతికి న‌లుగురు కొట్టుకు పోయారు. వారిలో ఇద్ద‌రి మృత దేహాలు ల‌భించాయి. కుళ్లి పోయిన మృత దేహాల‌ను ముట్టు కునేందుకు, వారి వ‌ద్ద‌కు వెళ్లేందుకు స్థానికులు సైతం ఒప్పుకోలేదు. ముందుకు రాలేదు. దీనిని గ‌మ‌నించిన అక్క‌డి పోలీసులు తామే ముందుకు వెళ్లారు. భూపాప‌ల్లి సీఐ(CI) రాం న‌ర్శింహారెడ్డి, చిట్యాల ఎస్ఐ(SI) ర‌మేష్ , కొంత మంది స్థానికుల‌తో క‌లిసి మృత దేహాల‌ను మోసుకు వ‌చ్చారు.

ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు యావ‌త్ ప్ర‌పంచం తెలిసేలా చేసింది సోష‌ల్ మీడియా. ఇలాంటి వాళ్లే ఈ దేశానికి, ఈ స‌మాజానికి కావాల్సింది అంటూ జేజేలు ప‌లుకుతున్నారు(Telangana Police Hats Off). విధులు నిర్వ‌హించ‌డం అంటే జీతాలు తీసుకోవ‌డం కాదు..సాటి వారి ప‌ట్ల ప్రేమ క‌లిగి ఉండ‌డం అని చాటి చెప్పారు ఈ పోలీసులు. ఖాకీలంటేనే వెగ‌టు పుట్టించే ప్ర‌స్తుత స‌మ‌యంలో వీరు చేసిన సాయానికి స‌లాం కొట్టాల్సిందే..ఎందుకంటే ఇంకా మాన‌వ‌త్వం మ‌ర‌ణించ లేద‌ని ఎక్క‌డో ఒక చోట బ‌తికే ఉంద‌ని ..ఉంటుంద‌ని చాటి చెప్పినందుకు..హ్యాట్సాఫ్ రాం నర్సింహారెడ్డి..ర‌మేష్..వీళ్ల నిబ‌ద్ద‌త‌, అంకిత‌భావం ప్ర‌తి ఒక్క‌రికి స్పూర్తి దాయ‌కంగా నిలుస్తుంద‌ని ఆశిద్దాం.

Also Read : K Annamalai : అవినీతికి కేరాఫ్ డీఎంకే స‌ర్కార్

Leave A Reply

Your Email Id will not be published!