TG CS Shanthi Kumar : ఈ దసరా నుంచి ప్రారంభం కానున్న స్కిల్ యూనివర్సిటీ కోర్సులు
నిర్మాణ పనులు ముగిసేంతవరకు తాత్కాలిక భవనంలో తరగతులు నిర్వహిస్తామని శాంతి కుమారి తెలిపారు...
TG CS Shanthi Kumar : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్ష మేరకు రూపుదిద్దుకున్న యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో దసరా పండగ నుంచి కోర్సులు ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు. స్కిల్ యూనివర్సిటీ ద్వారా దాదాపు 20కోర్సులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆమె వెల్లడించారు. ప్రాథమికంగా ఆరు కోర్సులను ముందుగా ప్రారంభించాలని నిర్ణయించినట్లు సీఎస్ వివరించారు. స్కిల్ యూనివర్సిటీ ప్రారంభం, విధివిధానాలు, కోర్సుల ప్రారంభం తదితర అంశాలపై ఇవాళ(శనివారం) ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించినట్లు సీఎస్ శాంతి కుమారి వెల్లడించారు.
ముచ్చర్ల వద్ద కేటాయించిన 57ఎకరాల స్థలంలో స్కిల్ యూనివర్సిటీ నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేసిన విషయాన్ని సీఎస్(TG CS Shanthi Kumari) గుర్తు చేశారు. నిర్మాణ పనులు ముగిసేంతవరకు తాత్కాలిక భవనంలో తరగతులు నిర్వహిస్తామని శాంతి కుమారి తెలిపారు. తరగతులను ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా, నాక్ లేదా నిథమ్ కళాశాలలో నిర్వహిస్తామని ఆమె చెప్పుకొచ్చారు. ఇప్పటికే విశ్వవిద్యాలయం ఛైర్మన్‌గా ఆనంద్ మహీంద్రాను, కో-ఛైర్మన్‌గా శ్రీనివాస సి.రాజును నియమించినట్లు పేర్కొన్నారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో దాదాపు 140కంపెనీలు భాగస్వామ్యం కావడానికి ఆసక్తి చూపుతున్నాయని, దాదాపు 20కోర్సులను ప్రారంభించేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు సీఎస్ శాంతి కుమారి వెల్లడించారు.
TG CS Shanthi Kumar Comment
తొలుత స్కూల్ ఆఫ్ ఈ-కామర్స్, లాజిస్టిక్స్ రిటైల్ విభాగంలో సర్టిఫికెట్, డిప్లొమా కోర్సులను ప్రారంభిస్తామని సీఎస్ శాంతి కుమారి(TG CS Shanthi Kumari) పేర్కొన్నారు. దేశంలో ప్రముఖ కార్పొరేట్ సంస్థలైన ఎస్బీఐ, ఎన్ఏసీ, డా.రెడ్డి, టీవీఏజీఏ, అదానీ, సీఐఐ కంపెనీలు భాగస్వాములుగా ఉండేందుకు అంగీకరించాయని ఆమె వెల్లడించారు. ఈ సంస్థలు తమ కంపెనీల్లోని వివిధ విభాగాల్లో విద్యార్థులకు శిక్షణ ఇస్తాయని ఆమె పేర్కొన్నారు. ఈ సమావేశంలో యూనివర్సిటీ లోగో, వైబ్ సైట్ ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలంటూ సంబంధిత అధికారులను ఆమె ఆదేశించారు. కోర్సు పూర్తి చేసిన వారికి ఆకర్షణీయమైన వేతనంతో ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సీఎస్ శాంతి కుమారి సూచించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక, పరిశ్రమల శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు రామకృష్ణారావు, జయేశ్ రంజన్, విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్య కార్యదర్శి శేషాద్రి, టీజీఐఐసీ ఎండీ విష్ణువర్ధన్ రెడ్డి, రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వైస్ ఛైర్మన్ ప్రొ.వెంకటరమణ, శ్రీనిరాజు, వీవీఎల్ఎస్ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
Also Read : Lucknow Airport : లక్నో ఎయిర్ పోర్ట్ లో రేడియో సంబంధిత పరికరాల కలకలం