TG Govt : దిలావల్పూర్ ఇథనాల్ కంపెనీ విచారణలో సంచలన అంశాలు

ఎన్‌వోసీ తీసుకోకుండానే పీఎంకే డిస్టిలేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ....

TG Govt : నిర్మల్ జిల్లా దిలావల్పూర్ ఇథనాల్ కంపనీ ఎపిసోడ్‌పై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఆ కంపెనీకి అనుమతులు నిబంధనల ఉల్లంఘన వ్యవహారాలపై సర్కార్ ఆగ్రహం వ్యక్తం చేసింది. గత ప్రభుత్వం అడ్డగోలుగా అనుమతి ఇచ్చిందని.. అప్పటి ప్రభుత్వ అండతో పీఎంకే డిస్టలరీ కంపనీ నిబంధనలు తుంగలో తొక్కిందని ఫైర్ అయ్యింది. ప్రభుత్వ విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈసీ తీసుకునే విషయంలో సదరు కంపనీ కేంద్రాన్ని, పర్యావరణ శాఖను మోసం చేసినట్లు గుర్తించింది. 2023, డిసెంబర్ 7కు ముందే టీఎస్-ఐపాస్ ద్వారా ఆ కంపెనీకి అనుమతులు జారీ అయినట్లు సర్కార్ చెబుతోంది. పీఎంకే డిస్టిలేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ఫ్యూయల్ ఇథనాల్‌కు మాత్రమే కేంద్రం అనుమతి ఇచ్చింది.. కానీ ఇథనాల్, ఎక్స్ ట్రా న్యూటల్ ఆల్కహాల్, ఇండస్ట్రియల్ స్పిరిట్స్, అబ్జల్యూట్ ఆల్కహాల్ లాంటి అన్ని ఉత్పత్తులకు అప్పటి మంత్రివర్గం అనుమతి ఇవ్వడం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్న పరిస్థితి.

TG Govt…

కేసీఆర్(KCR) ప్రభుత్వం పీఎంకే కంపెనీకి అనుకూలంగా మంత్రివర్గంలోనే అడ్డగోలు అనుమతులు జారీ చేసిందని రేవంత్ సర్కార్ చెబుతోంది. ఫ్యూయల్ ఇథనాల్ సాకు చూపించి ఏకంగా ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా మినహాయింపు పొందేందుకు ఇథనాల్ కంపనీ అడ్డదారులు తొక్కినట్లు గుర్తించింది. కేంద్రం ఇచ్చిన పర్యావరణ అనుమతి ప్రకారం అక్కడి స్థానిక సంస్థల నుంచి ఎన్‌వోసీ తీసుకోవడం తప్పనిసరి. ఎన్‌వోసీ తీసుకోకుండానే పీఎంకే డిస్టిలేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ.. అప్పట్లోనే ప్రహరి నిర్మించేసింది. బీఆర్ఎస్(BRS) ప్రభుత్వం అండదండలతోనే పర్యావరణ అనుమతుల నిబంధనలను యధేచ్ఛగా ఉల్లంఘించిందనేది సర్కార్ వారి మాట.

2022,అక్టోబర్ 22న 600 లక్షల లీటర్ల ఇథనాల్ / ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్/ ఇండస్ట్రియల్ స్పిరిట్స్ / అబ్సల్యూట్ ఆల్కహాల్ తయారీకి లెటర్ ఆఫ్ ఇండెంట్ కేసీఆర్(KCR) ప్రభుత్వం జారీ చేసింది. అప్పటి ప్రభుత్వం కేబినేట్ ఆమోదం లేకుండానే అత్యవసరం పేరిట ఆదేశాలు జారీ చేసినట్లు విచారణలో వెల్లడైంది. 2022 డిసెంబర్‌లో ఆ నిర్ణయాన్ని కేసీఆర్ కేబినెట్ ర్యాటిఫై చేసింది. ఇథనాల్ తయారీకి కేంద్ర ప్రభుత్వంతో పాటు పర్యావరణ అనుమతి తప్పనిసరి.

ఇథనాల్ / ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ / ఇండస్ట్రియల్ స్పిరిట్స్ / అబ్సల్యూట్ ఆల్కహాల్ తయారీకి పీఎంకే డిస్టిలెషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లెటర్ ఆఫ్ ఇండెంట్ తీసుకుంది.. కానీ కేంద్ర పర్యావరణ శాఖకు మాత్రం”ఫ్యూయల్ ఎథనాల్” కోసమే దరఖాస్తు చేసినట్లు విచారణలో బయటపడింది. అక్కడ ప్రతిపాదించిన 300 కేఎన్‌పీడీ సామర్థ్యం మొత్తం “ఫ్యూయల్ ఇథనాల్” తయారీకేనని కంపెనీ స్వీయ ధ్రువీకరణ పత్రం సమర్పించింది. కంపెనీ సమర్పించిన స్వీయ ధ్రువీకరణ ఆధారంగా ఈ ఫ్యాక్టరీ బీ2 కేటగిరీకి వస్తుందని.. ప్రజాభిప్రాయ సేకరణ నుంచి అప్పటి ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. 2023 ఫిబ్రవరి 24 కేంద్ర పర్యావరణ శాఖ కేవలం ఫ్యూయల్ ఇథనాల్ ఉత్పత్తికి మాత్రమే అనుమతి ఇచ్చింది. కానీ అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 2023 ఏప్రిల్ 1న ఆ ఫ్యాక్టరీకి ఇచ్చిన లెటర్ ఆఫ్ ఇండెంట్లో ఫ్యూయల్ ఇథనాల్‌‌కు పరిమితం కాలేదు. మిగతా ఉత్పత్తులన్నీ జోడించిన లెటర్ ఆఫ్ ఇండెంట్‌ను కేసీఆర్(KCR) ప్రభుత్వం జారీ చేసింది.

కొత్తలెటర్ ఆఫ్ ఇండెంట్‌ను చూపించి 2023 జూన్ 7న ఇథనాల్ / ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్/ ఇండస్ట్రియల్ స్పిరిట్స్ / అబ్సల్యూట్ ఆల్కహాల్ ఉత్పత్తుల తయారీ లైసెన్స్‌కు పీఎంకే కంపెనీ దరఖాస్తు చేసుకుంది. పర్యావరణ శాఖ అనుమతి ప్రకారం అక్కడి స్థానిక సంస్థల నుంచి నో ఆబ్జక్షన్ సర్టిఫికెట్ తీసుకోవటం తప్పనిసరి. కానీ పీఎంకే డిస్టిలేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్థానికంగా అనుమతి తీసుకోకుండానే కాంపౌండ్ వాల్ నిర్మించేసింది. దీంతో పర్యావరణ అనుమతుల నిబంధనలను ఉల్లంఘించింది సదరు కంపెనీ. కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన లెటర్ ఆఫ్ ఇండెంట్ ఆధారంగా 2023 జూన్ 15న ఇరిగేషన్ డిపార్టుమెంట్ ఆదిలాబాద్ చీఫ్ ఇంజనీర్ విభాగం నీటి కేటాయింపులకు అనుమతి ఇచ్చినట్లు విచారణలో అధికారులు గుర్తించారు.

Also Read : YS Bhaskar Reddy-SC : భాస్కర్ రెడ్డికి హైకోర్టు బెయిల్ రద్దు చేస్తూ నోటీసులు జారీచేసిన ధర్మాసనం

Leave A Reply

Your Email Id will not be published!