#APElectionCommission : ఆడిందే ఆట..పాడిందే పాట..

AP Election Commission: 'అహం బ్రహ్మస్మి' అంటారు ఆర్యులు. అంతా నేనే, అన్నీ నావే అనే భ్రాంతిలో కొంతమంది బ్రతుకుతుంటారు. నేను చెప్పేదే వినాలి, అని మొండి పట్టుదల ధోరణిలో మరికొందరు ఉంటారు. సర్వసాధారణంగా ఈ ధోరణి వ్యక్తులకు ఉండడం సహజం.

AP Election Commission: ‘అహం బ్రహ్మస్మి’ అంటారు ఆర్యులు. అంతా నేనే, అన్నీ నావే అనే భ్రాంతిలో కొంతమంది బ్రతుకుతుంటారు. నేను చెప్పేదే వినాలి, అని మొండి పట్టుదల ధోరణిలో మరికొందరు ఉంటారు. సర్వసాధారణంగా ఈ ధోరణి వ్యక్తులకు ఉండడం సహజం. కానీ ఈ ధోరణి వ్యవస్థలకు అంటగట్టడం దారుణం. ఉత్కృష్టమైన అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థలో మనం ఉన్నాం. గత కొన్ని నెలలుగా చూస్తే రెండు రాజ్యాంగ వ్యవస్థల మధ్య ‘నేను’ అనే అహంభావం పొడజూపడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరియు ఏపీ ఎన్నికల కమిషన్ మధ్య పరిపాలనా వైరుధ్యాలు ఏర్పడడం విడ్డూరమే మరి. పవిత్రమైన ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్న రెండు అతి కీలక వ్యవస్థలు దేని పని అది చేసుకుపోవాలి. అంతేగాని ‘నేను చెప్పినట్లు మీరు వినాలి, మీరు చెప్పేది నేను వినను’ అనే మొండివైఖరితో ముందుకెళ్లడం భావ్యం కాదు. ఇది రాజ్యాంగ సంక్షోభానికి దారితీయదా? ప్రజలను అయోమయంలో పడేయడం కాదా? జన సమూహాల మధ్య అశాంతిని రేపడం కాదా? అని ఎవరైనా ప్రశ్నించక తప్పదు.

కొన్ని నెలలుగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషన్(AP Election Commission) మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పదేపదే స్థానిక సంస్థల ఎన్నికల విషయమై గౌరవ కోర్టులను ఆశ్రయించాయి. ఈ ఆశ్రయించే క్రమములో ఎన్నికల కమిషన్ ఆడిందే ఆట ఆడుతూ ఉంటే, దానికి సమాధానంగా ప్రభుత్వం మాత్రం పాడిందే పాట పాడటం గమనార్హం. జాతీయ ఎన్నికల కమిషన్ అనేది ఒక కీలకమైన వ్యవస్థ. దాని అనుబంధంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ పనిచేస్తుంది. ఒక రాష్ట్రానికి సంబంధించిన స్థానిక సంస్థల ఎన్నికలు సకాలంలో జరిపించే బాధ్యత రాష్ట్ర ఎన్నికల సంఘానిదే. కొన్ని సహేతుకమైన కారణాలవల్ల కాలపరిమితి ఒక్కోసారి దాటవచ్చును కూడా. ఏపీ ఎన్నికల కమిషన్ 1994 జూన్ లో ఆర్టికల్ 243 జెడ్.ఎ, 243 కె ప్రాప్తికి స్థాపించబడింది. కానీ రాష్ట్ర విభజన అనంతరం 2016 జనవరి 30న పునర్వ్యవస్థీకరణ బడింది. ఈ విశిష్టమైన వ్యవస్థకు ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగం స్వయంప్రతిపత్తి అధికారాన్ని కల్పించింది. ఇదిలా ఉంటే, ప్రజల విలువైన ఓట్ల ద్వారా ప్రత్యక్షంగా ఎంపిక కాబడిన ప్రజా ప్రతినిధుల వ్యవస్థను ప్రజాస్వామ్య ప్రభుత్వంగా పేర్కొంటాం. మెజారిటీ ప్రజా ప్రతినిధులను గెలిచిన రాజకీయ పార్టీ అధికారం చేపట్టడం సహజం. దీనికి రాజ్యాంగం విశేషమైన అధికారాలను కట్టబెట్టింది.

ఒక ప్రజాస్వామ్య వ్యవస్థకు శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు మూలస్థంభాలు. ఈ మూడు వ్యవస్థలు తమ విశిష్టతను మరియు ఉదాత్తతను నిలబెట్టుకోవల్సిన అవసరముంది. కేవలం రాజ్యాంగ సూత్రాలకు ఏ వ్యవస్థ అయినా కట్టుబడని పరిస్థితుల్లోనే ఒకదాని పనిలో మరొకటి జోక్యం చేసుకోవాలి. ఒక్కోసారి ఈ మూడు వ్యవస్థలు మెజారిటీ ప్రజల అభిప్రాయాలను గౌరవించాలి కూడా. ఎందుకంటే ప్రజాస్వామ్య వ్యవస్థ అనేది, ప్రజల చేత పూర్తిగా నిర్మించబడింది కాబట్టి. ఏ రెండింటి మధ్య అయినా ఆధిపత్య పోరు సంభవిస్తే, అది ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టినట్లు. అంతేగాదు ప్రజలలో ప్రజాస్వామ్య వ్యవస్థల పట్ల అపనమ్మకం తలెత్తుతుంది. అందువల్ల రెండు ఉత్కృష్టమైన రాజ్యాంగ వ్యవస్థలు మధ్య సుహృద్భావ వాతావరణం నెలకొనవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న ప్రజాస్వామ్య మరియు రాజ్యాంగ వ్యవస్థల పాలనా పరిణామాల్ని ఒకసారి పరిశీలించి చూద్దాం.

ఎన్నికల(AP Election Commission) నిర్వహణ కన్నా ప్రజారోగ్యమే ముఖ్యమని భావించిన గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ను ఏకంగా రద్దు చేసింది. జనవరి 16 వ తేదీన దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం కరోనా వ్యాధికి సంబంధించిన వ్యాక్సినేషన్ పంపిణీ చేసేందుకు సిద్ధమవుతున్నది. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికలు నిర్వహించడం కొవిడ్ టీకా ప్రక్రియకు ప్రతిబంధకంగా నిలుస్తుందని భావించి, గౌరవ ఉన్నత న్యాయస్థానం తగు ఆదేశాలు జారీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అంతేకాకుండా ప్రభుత్వం అందజేసిన వివరాలను ఎన్నికల కమిషన్ పరిగణనలోకి తీసుకోలేదని సంబంధిత న్యాయమూర్తి ఈ.సిని ఆక్షేపించడం కూడా జరిగింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఈ.సి డివిజిన్ బెంచిలో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఇంకా అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో కూడా ఉంది. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను అంచనా వేసిన ప్రభుత్వం, ప్రజారోగ్యమే పరమావధిగా భావించి ఏపీ ఎన్నికల కమిషన్ ప్రకటించిన అత్యవసర ఎన్నికల షెడ్యూల్ ను గౌరవ న్యాయస్థానం రద్దు చేయాలని కోరుతూ కోర్టు మెట్లెక్కింది. ఈ నేపథ్యంలో గౌరవ కోర్టు ఇచ్చిన ఆదేశాల పట్ల ఎక్కువ శాతం మంది ప్రజలు, ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు ఆనందాన్ని వ్యక్తం చేయడం గమనార్హం.

గత మార్చి నుండి ఎన్నికల కమిషన్ కు మరియు రాష్ట్ర ప్రభుత్వానికి పొడజూపిన విభేదాలు మరొకసారి పరిశీలిద్దాం. తొలుత పంచాయతీ ఎన్నికలను ఫిబ్రవరిలోనే జరపాలని గత నవంబర్ 17 వ తారీఖునే ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వెనువెంటనే రాష్ట్ర ప్రభుత్వము హైకోర్టును ఆశ్రయించింది. విచారణ జరిపిన గౌరవ న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వము మరియు ఎలక్షన్ కమిషన్ కూర్చొని సంప్రదింపులు జరుపుకొని ఒక నిర్ణయానికి రావాలని, ఆ నిర్ణయాన్ని తమ దృష్టికి తేవాలని డిసెంబర్ 29వ తేదీన గౌరవ హైకోర్టు రెండు రాజ్యాంగ వ్యవస్థలను ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకే రాష్ట్ర ప్రభుత్వం త్రిసభ్య కమిటీని ఎలక్షన్ కమిషన్ వద్దకు పంపింది. ఆ త్రిసభ్య కమిటీలో ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి మరియు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఉండడం విశేషం. ఈ కమిటీ డిసెంబర్ 8వ తారీఖున ఎన్నికల కమిషన్ తో భేటీ కావడం జరిగింది కూడా. కరోనా నేపథ్యంలో జాతీయ విపత్తు నిర్వహణ చట్టం కింద జారీ చేసిన నియంత్రణ చర్యలు ఇప్పటికే అమలులో ఉన్నాయనీ, మరోపక్క కరోనా కొత్త స్ట్రెయిన్ కేసుల ముప్పు పొంచి ఉందనీ, దీనికితోడు వెనువెంటనే కరోనా టీకా వేసే సన్నద్ధతలో రాష్ట్ర ప్రభుత్వం ఉందనీ, అందువల్ల ఎన్నికల ప్రక్రియను ఇప్పట్లో నిర్వహించలేమని ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఈ.సీకి తేల్చి చెప్పేసింది. దీనికి సమాధానంగా ఈ.సీ తాను కోర్టు ఆదేశానుసారం నడవాల్సి ఉందని, దాని ప్రకారమే ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుందని భావించి, ఇరుపక్షాల భేటీ ముగిసిన కొన్ని గంటలకే పంచాయతీ ఎన్నికల షెడ్యూలును  ప్రకటించడం అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. సంబంధిత ఎన్నికలను ఫిబ్రవరిలోనే జరిపేందుకు సిద్ధమైంది.

గత సంవత్సరం మార్చి నెలలో జిల్లా మరియు మండల ప్రాదేశిక సభ్యులు ఎన్నికలు జరగాల్సింది. కానీ కేంద్రం విధించిన లాక్ డౌన్ నేపథ్యంలో ఎన్నికలను కమిషన్ అర్థాంతరంగా వాయిదా వేసింది. ప్రజారోగ్యం దృష్టితో అలా చేసినట్లు కమిషన్ తన చర్యను అప్పట్లో సమర్ధించుకుంది. నేడు అదే ప్రజారోగ్యాన్ని కమిషన్ పట్టించుకోకపోవడం ఆశ్చర్యకరం కాదా! అని కొన్ని వర్గాల వారు ప్రశ్నిస్తున్నారు. ఆనాడు పది రోజులు వాయిదా వేయకుండా నిరీక్షిస్తే, మొత్తం ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేది. కానీ అలా చేయకుండా వాయిదాకే కమిషన్ మొగ్గుచూపడం విడ్డూరమే మరి. ఇప్పుడు మాత్రం ఎన్నికలకు అనుకూల వాతావరణం ఉందని, అందువల్ల నిర్వహించాల్సిన అవసరం ఉందని కమిషన్ ఒకపక్క నొక్కి వక్కాణిస్తున్నది. దానిలో భాగంగానే పలు దఫాలుగా కమిషన్ కోర్టు మరియు రాజ్ భవన్ గుమ్మాన్ని తడుతున్నది. అంతేకాకుండా కేంద్రం ఇచ్చే ఆర్థిక నిధులు పంచాయతీలకు రావాలంటే, రాష్ట్ర సంక్షేమం దృష్ట్యా ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉందనేది ఈ.సి వాదన. అయితే ప్రభుత్వం కూడా ఆనాడు ఇదే ఆర్థిక అంశాన్ని లేవనెత్తడం ప్రాధాన్యత సంతరించుకుంది. కానీ ఆనాడు ఎన్నికల కమిషన్ ప్రభుత్వ వాదనను పట్టించుకోకుండా ముందుకు వెళ్ళింది. అయితే ఆనాడు ఎన్నికల వాయిదాని వ్యతిరేకించిన ప్రభుత్వం నేడు ఎన్నికల ప్రక్రియను ఆపేందుకు శతవిధాలా ప్రయత్నించడం కూడా ఆశ్చర్యకరమే. దీనిలో భాగంగా ప్రభుత్వం కూడా పలుమార్లు కోర్టు, రాజ్ భవన్ మెట్లెక్కడం విశేషం. దీనిని బట్టి రెండు రాజ్యాంగ వ్యవస్థలను నడుపుతున్న పెద్దలు వ్యక్తిగత ప్రతిష్టకు పోతున్నారా! అని అనక తప్పదు. అంటే  ‘ఎడ్డెం అంటే తెడ్డెంలా’ ఒకరికొకరు వ్యవహరించడం పౌరులకు ఇబ్బందికర విషయమే కదా! సుమారు సంవత్సర కాలంగా రాష్ట్ర ప్రధాన పరిపాలనంతా ఈ స్థానిక ఎన్నికల చుట్టూరే తిరగడంతో ప్రజా సంక్షేమ పాలనంతా కుంటుపడుతున్నది. ఇదే కాక ఎన్నికల కమిషనర్, మంత్రులు, ఉన్నతాధికారులు ఈ అంశాన్నే పదే పదే ప్రస్తావించడంతో రాష్ట్ర ప్రజలను మరింత గందరగోళానికి గురి చేస్తున్నారు. ఇది ఏమంత క్షేమకరం కాదు. ఇలా ఈ.సీ మరియు ప్రభుత్వం మధ్యనున్న అగాధాన్ని పూడ్చేది ఎవరు? న్యాయ వ్యవస్థా! లేక గవర్నర్ వ్యవస్థా! గత పది నెల కాలంగా జరుగుతున్న రెండు కీలక వ్యవస్థల మధ్య అంతర్యుద్ధాన్ని నిలువరించాల్సిన బాధ్యత ఎవరిది? అనేది ప్రశ్నార్థకంగానే తయారయింది.

గత కొన్ని నెలల కాలంగా కరోనా వ్యాధితో పోరాడుతున్న జనానికి ఇప్పట్లో ఎన్నికలలో పాల్గొనాలనే కోరికయితే లేనేలేదు. అలాగే ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు, ఉపాధ్యాయులు కూడా అనాసక్తితో ఉన్నారు. ఈ స్థానిక సంస్థల ఎన్నికలు (AP Election Commission)ఇప్పట్లో జరగనంత మాత్రాన పరిపాలనేమీ స్తంభించి పోదు. ముందుగా ‘బతికుంటే బలుసాకు తినైనా బతుకుదాం’ అనే నిర్లిప్తతతో ప్రజలు ఉన్నారు. ఈ.సీ, ప్రభుత్వం మధ్య పొడజూపిన విభేదాలను పెద్దల తరహాలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని నివారించాలని ప్రజలు ఆశించడంలో అర్థం ఉంది. ఏది ఏమైనప్పటికీ, ఎవరైనా! ఏ వ్యవస్థ అయినా, ప్రజల శ్రేయస్సే పరమావధిగా భావించి పరిపాలన సాగించాలి. రాజ్యాంగబద్ధంగా చేపట్టిన ఒక వ్యవస్థ నిర్ణయాలను మరొక వ్యవస్థ గౌరవించుకుంటూ ముందుకు పోవాలి. ఒకరికొకరు భీష్మించుకున్న యెడల, నేడు ఏపీలో సంభవిస్తున్న పరిస్థితులే ఏ రాష్ట్రంలో నైనా ఖచ్చితంగా దొర్లుతాయి. వీటికి మూల్యం చెల్లించేదెవరో! అర్థం కావట్లేదు. దేశంలో ఎక్కడైనా పరిపాలనా నిర్వహణా సమస్యలు ఉత్పన్నము కాకుండా ఉండాలంటే, ఉదాత్తమైన రెండు రాజ్యాంగ వ్యవస్థల మధ్య సమన్వయ సహకారాలు ఉండాల్సిందే. ఒక ఎన్నికల కమిషన్ సంబంధిత రాష్ట్రంలో గల స్థానిక సంస్థల ఎన్నికలను సక్రమంగా నిర్వహించే బాధ్యతను పూర్తి చేయాలంటే, ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వ సహకారంతోనే సాధ్యమనే విషయం యదార్థం. అలానే ఒక ప్రజా ప్రభుత్వం ఒక స్వయం ప్రతిపత్తి అధికారం గల ఎన్నికల కమిషన్ కు అదేస్థాయిలో సహకారము అందించాల్సిన బాధ్యత కూడా ఉండనే ఉంది. ఈ రెండూ ఒకదానికొకటి పరస్పరమూ గౌరవించుకుంటూ పోతే ‘ప్రజాస్వామ్యం’ తప్పకుండా పరిఢవిల్లుతుంది. అలా కాని యెడల సంబంధిత వ్యవస్థల ఔన్నత్యం, పవిత్రత తగ్గినట్టుగానే ఎవరైనా భావించాల్సి వస్తుంది.

 

పిల్లా తిరుపతిరావు..

No comment allowed please