AICC : భారత దేశ చరిత్రలో 140 ఏళ్ల వయసు కలిగిన కాంగ్రెస్ పార్టీ గతంలో ఎన్నడూ లేని రీతిలో ఇబ్బందులు ఎదుర్కొంటోంది.
తాజాగా దేశంలోని ఐదు రాష్ట్రాలు ఉత్తర ప్రదేశ్ , గోవా, పంజాబ్ , మణిపూర్, ఉత్తరాఖండ్ లలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తిగా పట్టు కోల్పోయింది.
అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ మరోసారి తాను అధికారంలో ఉన్న నాలుగు రాష్ట్రాలలో తిరిగి పవర్ లోకి వచ్చింది.
అయితే యూపీలో గతంలో ఏడు సీట్లు కలిగిన కాంగ్రెస్ పార్టీ ఈసారి 2 సీట్లకే పరిమితమైంది.
ప్రియాంక గాంధీ అన్నీ తానై ప్రచారం చేసినా పట్టు తప్పింది. ఇదే సమయంలో ఇవాళ సాయంత్రం ఏఐసీసీ(AICC )కీలక సమావేశం జరగనుంది.
తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగుతున్న మేడమ్ సోనియా గాంధీ నేతృత్వంలో జరిగే ఈ మీటింగ్ పై దేశ వ్యాప్తంగా ఆ పార్టీలో ఉత్కంఠ నెలకొంది.
ప్రస్తుతం ఆ పార్టీ అంపశయ్యపై ఉందని చెప్పక తప్పదు.
గతంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్నడూ లేని రీతిలో అతి తక్కువ సీట్లకే పరిమితమై పోయింది పార్టీ.
తానే బాధ్యుడినంటూ రాహుల్ గాంధీ రాజీనామా చేశారు.
ఆ తర్వాత ఆయన అగ్ర నాయకుడిగా చెలామణి అవుతూ వస్తున్నారు. దేశ వ్యాప్తంగా బలమైన కేడర్ కలిగిన
కాంగ్రెస్ పార్టీ నాయకత్వ లేమితో కొట్టు మిట్టాడుతోంది. దిశా నిర్దేశం చేసే వారు లేక చతికిల పడింది.
పోల్ మేనేజ్ మెంట్ లో బీజేపీ దూసుకు పోతోంది. మతాన్ని, కులాన్ని, వర్గ , ప్రాంత వైషమ్యాలను రెచ్చ గొడుతూ పబ్బం గడుపుతోంది ఆ పార్టీ.
ప్రధానంగా ఆర్ఎస్ఎస్, వీహెచ్ పీ, భజరంగ్ దళ్, హిందూ వాహిని, ధార్మిక సంస్థలు గంప గుత్తగా భారతీయ జనతా పార్టీకి నమ్మకంగా పని చేస్తున్నాయి.
దీంతో దేశమంతటా చాప కింద నీరులా అల్లుకు పోయింది కాషాయం. దానిని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ ఎలాంటి వ్యూహాలు పన్నడం లేదన్న ఆరోపణలున్నాయి.
సీనియర్లు సైతం అసమ్మతి స్వరాన్ని వినిపిస్తున్నారు పార్టీ నాయకత్వంపై. ఇప్పటికే జీ23 పేరుతో సదరు నాయకులు
తమ వ్యతిరేక గళాన్ని ఎక్కు పెట్టారు సోనియాపై. ప్రస్తుత భేటీలో వీరంతా మరోసారి ఎదురు దాడికి దిగే ప్రమాదం లేక పోలేదు.
ఇక జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ప్రత్యామ్నాయం కాదనే స్థితికి పార్టీ దిగజారింది.
ఓ వైపు ప్రాంతీయ పార్టీలు (AICC )తమ హవా కొనసాగిస్తున్నాయి. ఉన్న పంజాబ్ ను పోగొట్టుకుంది.
ఇక కాంగ్రెస్ చేతిలో రెండు రాష్ట్రాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఒకటి రాజస్థాన్ కాగా మరొకటి ఛత్తీస్ గఢ్.
ఇదే సమయంలో ప్రాంతీయ పార్టీలు సైతం కాంగ్రెస్ తో కలిసి సాగేందుకు ముందుకు రావడం లేదు.
ఇప్పటికే మమతా బెనర్జీ, దేవెగౌడ లాంటి వాళ్లు ప్రాంతీయ పార్టీలతో కూటమిగా ఏర్పడడమే బెటర్ అన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా గాంధీ కుటుంబం రాజీనామా చేస్తారంటూ ప్రచారం జరిగింది. ఇవాళ కీలక భేటీ పూర్తయితే కానీ ఏం జరుగుతుందో తేలుతుంది.
Also Read : పాటే ప్రాణమై లోకానికి దూరమై