అమరావతి : ఎన్నికల్లో గెలవలేమని అర్థమై వైసీపీ అరాచకానికి పాల్పడుతోందని మండిపడ్డారు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్, మంత్రి నాదెండ్ల మనోహర్. వైసీపీపై, ఆ పార్టీ అధినేత మాజీ సీఎం జగన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లెలో ప్రజాస్వామ్య పద్ధతిలో, నిబంధనల మేరకు నామినేషన్లు దాఖలు చేయడానికి వెళుతున్న జనసేన పార్టీ నాయకులు, శ్రేణులను కవ్వించి వైసీపీ గూండాలు దాడులకు తెగబడటం అత్యంత హేయం అన్నారు. తంబళ్లపల్లె ఎంపీడీఓ కార్యాలయం సమీపంలోని జనసేన పార్టీ కార్యాలయాన్ని వైసీపీ వాళ్లు ధ్వంసం చేశారని ఆరోపించారు. అక్కడే కొన్ని వాహనాలను నాశనం చేసి, అడ్డు వచ్చిన వారిపై మారణాయుధాలతో దాడులకు తెగబడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల వేళ రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య సృష్టించాలని, దౌర్జన్యాలు, గొడవలు చేయాలనే దురుద్దేశంతో వైసీపీ ఈ దుశ్చర్యలకి పాల్పడుతోందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అశాంతి, అరాచకం, అలజడులు సృష్టించడం ద్వారా స్థానిక సంస్థల ఎన్నికలను నిలిపి వేయాలనే వైసీపీ పన్నాగం దీనిలో స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఎన్నికల్లో గెలవలేం అని తెలిసే వైసీపీ హింసకు దిగిందన్నారు నాదెండ్ల మనోహర్.
జనసేన పార్టీ ఇలాంటి గూండా చర్యలను చూస్తూ ఊరుకోదన్నారు . జనసేన పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేసిన వారి మీద, జనసేన శ్రేణులపై దాడులను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తీవ్రంగా పరిగణించాలని డిమాండ్ చేశారు. కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. పోలీసు యంత్రాగం కూడా ఈ దాడులకి పాల్పడ్డ వారిని, వెనుక ఉన్నవారిని గుర్తించి తక్షణమే అరెస్టు చేయాలన్నారు . జనసేన పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజాస్వామ్యాన్ని పరిపూర్ణంగా గౌరవించే నాయకులు అని పేర్కొన్నారు. . రాష్ట్ర అభివృద్ధిలో స్థానిక సంస్థల పాత్రను పెంచాలనే బృహత్ ఆశయంతో ఆయన పని చేస్తున్నారని చెప్పారు నాదెండ్ల మనోహర్. దీనిని కాలరాసేలా వైసీపీ చేస్తున్న దౌర్జన్యాలు, దాడులను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ప్రజాస్వామ్యవాదులు వైసీపీ చేస్తున్న ఈ అరాచక చర్యలను ఖండించాలని కోరారు .
