Tirumala Nambi Utsavam : 24న తిరుమ‌ల‌నంబి మ‌హోత్స‌వం

ప్ర‌క‌టించిన తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం

Tirumala Nambi Utsavam : ప్రముఖ వైష్ణవాచార్యులు శ్రీ తిరుమలనంబి 1050వ అవతార మహోత్సవం ఆగ‌స్టు 24న తిరుమల లోని దక్షిణ మాడ వీధిలో గల శ్రీ తిరుమలనంబి ఆలయంలో ఘనంగా నిర్వ‌హించ‌నున్నారు. ఇందులో భాగంగా శ్రీ తిరుమలనంబి ఆలయంలో ఉద‌యం 9.30 గంటల నుండి 16 మందిపండితులు శ్రీ తిరుమ‌ల నంబి జీవిత చ‌రిత్ర‌పై ప్ర‌వ‌చిస్తారు.

Tirumala Nambi Utsavam Started

శ్రీవారి భక్తాగ్రేసరులలో ఒకరైన శ్రీ తిరుమలనంబి శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి తీర్థ కైంకర్యం ప్రారంభించారు. వీరు భగవద్రామానుజుల వారికి స్వయాన మేనమామ, గురుతుల్యులు. వీరు రామానుజుల వారికి రామాయణ పఠనం చేశారని పురాణాల ద్వారా తెలుస్తోంది.
ఆచార్య పురుషుడిగా ప్రసిద్ధిగాంచిన శ్రీ తిరుమలనంబికి(Tirumala Nambi Utsavam) సంబంధించిన ఒక కథ ప్రచారంలో ఉంది. తిరుమలనంబి శ్రీవేంకటేశ్వర స్వామి వారి అభిషేకానికి సంబంధించిన పవిత్ర జలాలను తిరుమల ఆలయానికి 8 కి.మీ దూరంలో ఉన్న పాపవినాశ‌నం తీర్థం నుండి తీసుకొచ్చే వారు.

ఒకరోజు ఆయన పాపవినాశనం నుండి నీటిని కుండలో తీసుకొస్తుండగా సాక్షాత్తు శ్రీ వేంకటేశ్వర స్వామి వారు తిరుమలనంబి భక్తిని పరీక్షించాలని భావించి ఒక వేటగాని రూపంలో వచ్చి దాహంగా ఉందని, తాగడానికి నీళ్లు కావాలని ఆడిగారు. ఈ పవిత్రజలాలు స్వామివారి ఆభిషేకం కోసమని చెప్పి ఇచ్చేందుకు తిరుమలనంబి తిరస్కరించారు. అంతట వేటగాని రూపంలో ఉన్న స్వామివారు రాయి విసిరి కుండకు చిల్లుచేసి నీరు తాగారు.

అందుకు తిరుమలనంబి బాధపడుతూ ”వయోభారం కారణంగా నేను తిరిగి అంతదూరం పాపవినాశనం వెళ్లి స్వామివారికి అభిషేకజలం తీసుకురావడం సాధ్యంకాదు, ఈ రోజు నేను స్వామివారికి అభిషేకం చేయలేక పోతున్నా అని దు:ఖించారు. అంతలో వేటగాని రూపంలో ఉన్న స్వామి వారు చింతించకు తాతా నేను నీ పూజకు తప్పకుండా సహాయం చేస్తా అని తెలిపి తన చేతిలోని విల్లును ఆకాశంలోనికి ఎక్కుపెట్టి బాణం వదిలారు. వెంటనే వినీలాకాశం నుండి ఉరుకుతూ నీటిధార భూమికి వచ్చింది. ”ఇకపై ఈ జలాన్నే నా అభిషేకానికి వినియోగించు” అని ఆ వేటగాని రూపంలో ఉన్న స్వామి వారు అదృశ్యమయ్యారు.

తిరుమలనంబి సాక్షాత్తు స్వామివారే బాలుని రూపంలో ప్రత్యక్షమయ్యారని గ్రహించారు. ఆనాటి నుండి నేటి వరకు ఈ తీర్థాన్నే స్వామివారి అభిషేకానికి వినియోగిస్తున్నారు. ఆకాశం నుండి వచ్చినందు వల్ల ఈ తీర్థానికి ఆకాశగంగ అని నామధేయం ఏర్పడింది.

Also Read : G Kishan Reddy : కిష‌న్ రెడ్డిని క‌లిసిన నాటా ప్ర‌తినిధులు

Leave A Reply

Your Email Id will not be published!