TPCC Chief Maheshkumar : ఉపఎన్నికలపై మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు
కమిటీల్లో అన్ని సామాజికవర్గాలకు సముచిత ప్రాధాన్యత ఉంటుందన్నారు...
TPCC Chief : తెలంగాణలో ఉపఎన్నికలు రాబోతున్నాయంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్(TPCC Chief) స్పందించారు. రాష్ట్రంలో ఉప ఎన్నికలు వచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఒకవేళ వచ్చినా కాంగ్రెస్ ఖాతాలోనే చేరుతాయని టీపీసీసీ చీఫ్(TPCC Chief) తేల్చిచెప్పారు. గురువారం ఢిల్లీలో ఏఐసీసీ చీఫ్ ఖర్గేను మహేష్ కుమార్ కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… 60 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్న మహానాయకుడు ఏఐసీసీ అధ్యక్షుడిగా ఉన్నారని.. ఖర్గేను కలిసి ఆశీస్సులు తీసుకున్నానని అన్నారు. అన్ని వర్గాలను కలుపుకొని కాంగ్రెస్ బలోపేతానికి పనిచేయాలని ఖర్గే సూచన చేశారన్నారు.
TPCC Chief Comment
కాంగ్రెస్ కార్యకర్త మొదలుకొని సీనియర్ నాయకులను కలుపుకొని వచ్చే ఎన్నికల్లో ఇప్పుడు వచ్చిన స్థానాలకంటే ఎక్కువ సాధించి మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యంగా పనిచేయబోతున్నామన్నారు. మంత్రివర్గ విస్తరణ గురించి సీఎం, ఏఐసీసీ పెద్దలు మాట్లాడారని.. వారే నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. కొత్త కమిటీ ఏర్పాటు అయ్యేంత వరకు పాత కమిటీలు పనిచేస్తాయన్నారు. బాధ్యతలు చేపట్టాక కొత్త కార్యవర్గంపై అధిష్టానంతో చర్చలు జరుపుతానని చెప్పారు. ప్రజలు నమ్మకంతో కాంగ్రెస్‌కు అధికారాన్ని ఇచ్చారని.. సమన్వయంతో పనిచేస్తున్నామని తెలిపారు.
కమిటీల్లో అన్ని సామాజికవర్గాలకు సముచిత ప్రాధాన్యత ఉంటుందన్నారు. పార్టీ ఫిరాయింపులపై హైకోర్టు సమయం ఇచ్చిందని… మరికొంతమంది పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. కేటీఆర్ సవాళ్ళను పట్టించుకునే స్థితిలో లేరని… ప్రతిపక్ష పాత్ర ఇస్తే దాన్ని కూడా సమర్ధవంతంగా నిర్వహించే స్థితిలో లేరని విమర్శించారు. వర్షాలతో ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే కేసీఆర్, కేటీఆర్ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. అలాగే అరికపూడి గాంధీ సాంకేతికంగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అని.. సాంకేతికంగా ఆయనకు పీఏసీ చైర్మన్ ఇచ్చామని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు.
Also Read : YS Sharmila : ఏలేరులో పూడిక తీయకపోవడం వల్లనే ఇంతటి విపత్తు జరిగింది