TS 10th Paper Leak : నిన్న టీఎస్పీఎస్సీ నేడు టెన్త్ పేపర్
తెలంగాణ రాష్ట్రం లీకేజీల పర్వం
TS 10th Paper Leak : నిన్నటి దాకా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో చోటు చేసుకున్న ప్రశ్నా పత్రాల లీకేజీల వ్యవహారం పూర్తి కాక ముందే విద్యార్థుల భవిష్యత్తును నిర్దేశించే 10వ తరగతి పరీక్షా పత్రం లీకు కావడం కలకలం రేపుతోంది. ఇంతకూ రాష్ట్రంలో పాలన అన్నది ఉందా అన్న అనుమానం వ్యక్తం అవుతోంది. సోమవారం నుండి 10వ తరగతి పరీక్షలు రాష్ట్ర మంతటా ప్రారంభమయ్యాయి.
ఇదిలా ఉండగా ఉన్నట్టుండి టెన్త్ పేపర్ కూడా లీక్ కావడంతో అంతా విస్తు పోయారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా తాండూరులో చోటు చేసుకుందని సమాచారం. పరీక్ష ప్రారంభమైన తొలి రోజే ఇలా జరగడంతో విద్యార్థులతో పాటు పేరెంట్స్ కూడా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పరీక్ష మొదలైన 7 నిమిషాలకే ప్రశ్నా పత్రం లీకైనట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ప్రశ్నా పత్రం వాట్సాప్ గ్రూప్ లలో చక్కర్లు కొట్టడంతో అంతా అలర్ట్ అయ్యారు. తాండూరు మండల కేంద్రంలో ఈ పేపర్ లీకైనట్లు సమాచారం.
పేపర్ లీక్ అయినట్లు తెలుసుకున్న వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. తాండూరులోని ప్రభుత్వ నెంబర్ వన్ స్కూల్ లో లీక్ అయినట్లు గుర్తించారు. స్కూల్ కు చేరుకున్న పోలీసులు, ఉన్నతాధికారులతో కలిసి విచారణ చేపట్టారు.
ప్రభుత్వ టీచర్ బందెప్ప ఫోన్ నుంచి వాట్సాప్ లో షేర్ అయినట్లు వెల్లడైనట్లు సమాచారం. ప్రస్తుతం బందెప్ప పోలీసుల అదుపులో ఉన్నాడు. మొదట పేపర్ లీక్ కాలేదంటూ విద్యా శాఖ అధికారులు తెలిపారు. ఆ తర్వాత పేపర్ బయటకు పొక్కడంతో మేలుకున్నారు. కలెక్టర్ ఇంకా దీనిపై క్లారిటీ ఇవ్వలేదు.
Also Read : లక్ష మందితో ప్రగతి భవన్ ముట్టడిస్తాం