TS Assembly Comment : ప్రజల ఊసెత్తని అసెంబ్లీ ఎందుకు..?
విమర్శలు..ఆరోపణలు..బిల్లులు ఇదేనా
TS Assembly Comment : అర్ధవంతమైన చర్చలకు వేదిక శాసనసభ. ప్రజా సమస్యలకు పరిష్కార మార్గాలు చూపే దిక్సూచి కూడా. ఇక మేధావులకు కేరాఫ్ గా పేర్కొంటూ వచ్చిన శాసన మండలి ఇప్పుడు ఫక్తు రాజకీయ నాయకులకు పదవులు కట్టబెట్టే బాక్సుగా తయారైందన్న ఆరోపణలు ఉన్నాయి.
బలిదానాలు, త్యాగాలు, పోరాటాల సాక్షిగా ఏర్పాటైన తెలంగాణలో ఇప్పుడు మాట్లాడటమే నేరంగా మారింది. ప్రశ్నించడం కంటే విమర్శించడం,
ఆరోపణలు గుప్పించడం ఆపై నోరు జవదాటడం ఫ్యాషన్ గా తయారైంది.
ఒకప్పుడు అసెంబ్లీ అంటే పూర్తి సమాచారంతో వచ్చే వారు ఎమ్మెల్యేలు, మంత్రులు. ఇవాళ అలాంటిది ఏమీ లేకుండా పోయింది. చూద్దామన్నా కనిపించడం లేదు.
ఒకరిద్దరు మాట్లాడటం తప్పా విషయం కనిపించడం లేదు. పూర్తిగా పక్కదారి పడుతున్నాయి సమావేశాలు. విచిత్రం ఏమిటంటే ఎంతో మంది ఎమ్మెల్యేలు కలిగిన తెలంగాణ అసెంబ్లీని కేవలం మూడు రోజులకే పరిమితం చేశారు సీఎం సారు.
ఈ మూడు రోజుల్లో చర్చకు వచ్చిన విషయాలు, అంశాలు, సమస్యలు చాలా తక్కువ. అందులో తమ వారికి లబ్ది చేకూర్చేందుకు తయారు చేసిన బిల్లులను ఆమోదింప చేసేందుకే ఏర్పాటు చేశారన్న విమర్శలు ఉన్నాయి.
ఓ వైపు వీఆర్ఏలు, ఇంకో వైపు పంతుళ్లు రోడ్డెక్కారు. ఇంకో వైపు నిరుద్యోగులు లబోదిబోమంటున్నారు. అసెంబ్లీ(TS Assembly) సాక్షిగా 85 వేలకు పైగా
జాబ్స్ ప్రకటించినా ఈరోజు వరకు ఒక్క జాబ్ కు సంబంధించి నియామక ఉత్తర్వు ఇవ్వేలేక పోయింది ప్రభుత్వం.
మద్యం దుకాణాలకు లైసెన్సులు, టెండర్లు ఇచ్చేందుకు పెట్టిన శ్రద్ద యూనివర్శిటీలు, కాలేజీలు, బడుల మీద పెట్టి ఉంటే బాగుండేది.
కానీ ప్రభుత్వం అలా చేయడం లేదు. తాము చెప్పిందే వేదం తాము చేసిందే చట్టం అన్న రీతిలో అటు కేంద్రంలో పీఎం నరేంద్ర మోదీ
వ్యవహరిస్తుండగా ఆయనకు తానేమీ తీసిపోనంటూ సీఎం కేసీఆర్ అనుసరిస్తున్నారు.
ఈ దేశంలో ప్రజాస్యామ్యం అన్నది రాను రాను ఉందా అన్న అనుమానం తలెత్తుతోంది. భారత రాజ్యాంగం గనుక రాసుకోక పోయి ఉంటే బలవంతుల చేతుల్లోనే దేశం బందీ అయి పోయేది.
డాక్టర్ బాబా సాహెబ్ ముందు చూపుతో తయారు చేసిన ఈ రాజ్యాంగమే 85 శాతానికి పైగా ఉన్న బహుజనులను కాపాడుతోంది. ఓ వైపు మనువాదం ఇంకో వైపు రాచరికం కలగలిసి ప్రజాస్వామ్యమనే ముసుగు తగిలించుకొని కొత్త పోకడలు పోతోంది.
సవాలక్ష సమస్యలతో తెలంగాణ కునారిల్లి పోయింది. దాని గురించి చర్చించిన దాఖలాలు లేవు. ఇక ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన కాంగ్రెస్ పార్టీ
పొగిడేందుకే సమయాన్ని కేటాయిస్తోంది.
ఇక అధికార పార్టీ ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనే స్థితికి చేరి పోయింది. బీజేపీ ధిక్కార స్వరాన్ని ప్రకటించినా ఉన్నా లేనట్టుగా మారి పోయింది.
ఏది ఏమైనా అసెంబ్లీ అంటే ప్రజా సమస్యలను ప్రస్తావించేందుకు తగిన వేదిక. దానిని కూడా పక్కదారి పట్టిస్తే ఇక ఈ శాసనసభ ఎందుకు శాసన మండలి ఎందుకు.
ఏలిన వారు ఆలోచించాలి. ఆరోపణలు, విమర్శలు, సస్పెన్షన్లు..బూతులు, ఆపై తొడగొట్టడాలు..ఇవి కావు ప్రజలు కోరుతున్నది. అర్థవంతమైన చర్చలకు
ఆహ్వానం పలికితేనే ప్రజాస్వామ్యం ఉన్నట్టు లేకపోతే అది ముమ్మాటికీ రాచరికమే.
Also Read : తెలంగాణకు వాన గండం తప్పదు కష్టం