TTD Comment : కోట్లాది మంది భక్తుల కొంగు బంగారం తిరుమల పుణ్య క్షేత్రం. ఎవరి నమ్మకాలు వారివి. లెక్కకు మించిన ఆస్తులు, ప్రతి రోజూ వచ్చే కానుకలు, విరాళాలకు కొదవే లేదు. ప్రతి రోజూ వేలాది మంది శ్రీ వేంకటేశ్వర స్వామిని, శ్రీ అలివేలు మంగమ్మను దర్శించుకుంటారు భక్త బాంధవులు. తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఆధ్వర్యంలో తిరుమల ఆలయం వర్దిల్లుతోంది. దీనికి పాలక మండలి కూడా ఉంది. ఇదంతా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంటుంది. గతంలో హిందూ ధర్మానికి చెందిన వారు, భక్తి, సామాజిక సేవా కార్యక్రమాలలో నిమగ్నమైన వారిని పరిగణలోకి తీసుకుని సభ్యులను, చైర్మన్ ను నియమించే వారు. కానీ రాను రాను ఈ ఎంపిక ప్రక్రియ ఫక్తు రాజకీయాలకు నెలవుగా మారిందన్న ఆరోపణలు లేక పోలేదు. నిత్యం ధూప దీప నైవేద్యాలతో అలరారుతోంది తిరుమల.
TTD Comment on Hindu Dharma
టీడీపీ హయాంలో కొంత మందితోనే పాలక మండలి ఉండేది. కానీ జగన్ రెడ్డి సీఎం అయ్యాక సభ్యుల సంఖ్య గణనీయంగా పెరిగింది. చివరకు 50 మందితో ప్రస్తుతం కొలువు తీరి ఉంది. ఇక నిత్య పూజలు, నిత్య అన్నదానం, విద్య, వైద్యం, మీడియా, ప్రచురణలన్నీ టీటీడీ ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. ఇక ప్రత్యేకించి టీటీడీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీవాణి ట్రస్టుకు రూ. 880 కోట్లు సమకూరాయి. ఇక స్వామి పేరు మీద ఆభరణాలు, కానుకలు ఉండనే ఉన్నాయి. దేశ వ్యాప్తంగా స్థలాలు కూడా కొలువు తీరాయి. టీటీడీ కళ్యాణ మండపాలు భక్తుల సేవల తరిస్తున్నాయి. ఆలయాలు కూడా ఏర్పాటు చేసింది టీటీడీ. ఇదంతా ఒక ఎత్తు స్వామి వారి దర్శనం మరో ఎత్తు. ఇందులో వీఐపీలు, వీవీఐపీలు, పాలక వర్గాలకు చెందిన వారు, వ్యాపారవేత్తలు, కంపెనీలకు చెందిన వాళ్లు, సినీ సెలబ్రిటీలు, బడా బాబులు, ఆటగాళ్లు ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో. వారందరికీ టీటీడీ సాదర స్వాగతం పలుకుతోంది.
విచిత్రం ఏమిటంటే సెలబ్రిటీల వల్ల స్వామి వారికి ఏం మేలు జరుగుతుందనేది భక్తులు ప్రశ్నిస్తున్నారు. సిఫారసు లెటర్లు, సీఎంలు, గవర్నర్లు, జడ్జీలకు సత్కారాలు, స్వామి వారి మెమొంటోలు, ప్రసాదం దగ్గరుండి సమర్పిస్తున్నారు. ఇక సామాన్య భక్తుల కష్టాలు చెప్పలేనంతగా ఉన్నాయి. ఒక్క అన్నదానం తప్ప మిగతా ప్రతి చోటా ఇబ్బందులే తలెత్తుతున్నాయి. రూ. 10 వేలు చెల్లించండి త్వరగా దర్శనం చేసుకోండి అంటూ ప్రచారం చేస్తోంది టీటీడీ(TTD). దేశాన్ని మోసం చేసిన వాళ్లు, వ్యాపారంతో మాయలు చేస్తున్న వాళ్లకు ఆహ్వానం పలకడం చూస్తే ఎటు పోతోంది ధర్మం అన్న అనుమానం రాక పోదు. ఎన్ని డబ్బులు ఎక్కువ చెల్లిస్తే అంత గౌరవం, మర్యాద దక్కుతోందంటూ సామాన్య భక్తులు వాపోతున్నారు. దేవుడు ఒక్కడే సామాన్యుడికి, ధనవంతుడికి అన్న అన్నమయ్య పాడిన కీర్తన ఇక్కడ పని చేయడం లేదు. ఇది పక్కన పెడితే బ్రేక్ దర్శనం, సర్వ దర్శనం ఇలా దర్శనాలలో పలు రకాలు. దేవుడు ఒక్కడే కానీ దర్శనాలు వేర్వేరు.
గతంలో స్వామి వారి ప్రసాదం అమృతం లాగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ రుచి కనిపించడం లేదని భక్తులు వాపోతున్నారు. ఇక తాజాగా టీటీడీ చైర్మన్ ను మార్చారు సీఎం. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిని(Bhumana Karunakar Reddy) నియమించారు. వైవీఎస్ నాలుగేళ్లు చేశారు. దీనిపై బీజేపీ చీఫ్ పురందేశ్వరి తప్పు పట్టారు. హిందూ దర్మంపై నమ్మకం లేని వాళ్లను పదవుల్లో నియమిస్తే ఎలా అని ప్రశ్నించారు. ఏది ఏమైనా నాస్తికుడైనా ఆస్తికుడైనా దేశ రాష్ట్రపతి, ప్రధాని, సీఎం, సీజేఐ అయినా సామాన్యుడైనా ఒకే దారిలో వెళితేనే దేవుడు ఉన్నట్టు లేక పోతే వివక్ష చూపుతున్నట్టే. స్వామి సర్వాంతర్యామి. ఇకనైనా భూమన ఆ దిశగా ఆలోచిస్తారని , టీటీడీని సామాన్యుల వద్దకు తీసుకు వచ్చేలా చేస్తారని ఆశిద్దాం.
Also Read : Perni Nani Chiranjeevi : చిరంజీవిపై పేర్ని నాని ఫైర్