V Srinivas Goud : బ్లాక్ మెయిల్ రాజకీయాలు మానుకో
రేవంత్ కామెంట్స్ గౌడ్ సీరియస్
V Srinivas Goud : రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి విరసనోళ్ల శ్రీనివాస్ గౌడ్ నిప్పులు చెరిగారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై వ్యక్తిగత కామెంట్స్ చేసిన ఆయనపై భగ్గుమన్నారు. నోటికి ఎలా వస్తే అలా మాట్లాడటం రేవంత్ రెడ్డికి అలవాటుగా మారిందన్నారు. గతం మరిచి పోతే ఎలా అని ప్రశ్నించారు.
స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి దేశంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ అన్న సంగతి కూడా రేవంత్ రెడ్డికి తెలియక పోవడం దారుణమన్నారు. ఆనాడే అభివృద్ది చేసి ఉంటే తెలంగాణ రాష్ట్రం ఎందుకు వచ్చి ఉండేదని ప్రశ్నించారు. అన్ని రంగాలను నిర్వీర్యం చేసి, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని ధ్వజమెత్తారు. ఎంతో మంది బలిదానాలు చేసుకున్నారని, ఎందరో అమరులయ్యారని దీనికి కారణం కాంగ్రెస్ పార్టీ కాదా అని ప్రశ్నించారు వి. శ్రీనివాస్ గౌడ్.
పాలమూరు జిల్లాను వలసల జిల్లాగా మార్చిందే కాంగ్రెస్ పార్టీ అని ధ్వజమెత్తారు. ఆనాటి దుస్థితికి మీరే కారణమన్నారు. తాము వచ్చాక అభివృద్ది అంటే ఏమిటో చూపించామని చెప్పారు. ఒకనాడు నీటికి ఇబ్బంది ఉండేది. ఇవాళ తాగు, సాగు నీటికి ఢోకా లేకుండా పోయిందన్నారు. ఏదైనా విమర్శలు చేస్తే దానికి ఆధారాలు ఉండాలన్నారు. నోరు పారేసుకుంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరించారు మంత్రి శ్రీనివాస్ గౌడ్(V Srinivas Goud).
Also Read : Bhupesh Bhaghel Kharge