విరాట్ కోహ్లీ గురించి ఎంత చెప్పినా తక్కువే. బయట చాలా కూల్ గా ఉండే ఈ మాజీ స్కిప్పర్ మైదానంలోకి వచ్చాడంటే పూర్తిగా మారిపోతాడు. ఎనర్జటిక్ తో దుమ్ము రేపుతాడు. సహచర ఆటగాళ్లను ప్రోత్సహిస్తాడు. ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు ఔట్ అయితే చాలు సంతోషంతో ఊగి పోతాడు. గ్రాండ్ సెలబ్రేషన్ చేసుకోవడంలో తన తర్వాతే ఎవరైనా.
తాజాగా ఐపీఎల్ 16వ సీజన్ లో భాగంగా రాజస్థాన్ లోని జైపూర్ సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో రాజస్తాన్ రాయల్స్ తో జరిగిన కీలక మ్యాచ్ లో అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 172 పరుగుల లక్ష్యాన్ని ముందుంచింది.
దీంతో మైదానంలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ 10.3 ఓవర్లలోనే 59 పరుగులకే చాప చుట్టేసింది. జట్టులో ఇద్దరు ఆటగాళ్లు మాత్రమే డబుల్ డిజిట్ దాటారు. జో రూట్ 10 రన్స్ చేస్తే షిమ్రోన్ హిట్మెయర్ 35 రన్స్ తో రాణించారు.
వేన్ పార్నెల్ తన అద్బుతమైన బౌలింగ్ తో ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లకు చుక్కలు చూపించాడు. కేవలం 3 ఓవర్లు వేసి 10 రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీశాడు. ఇదిలా ఉండగా ఆర్సీబీ బౌలర్ బంతిని సిక్స్ కొడదామని శాంసన్ యత్నించాడు. కానీ అది అమాంతం గాల్లోకి ఎగిరింది. వికెట్ కీపర్ అనూజ్ రావత్ అద్భుతంగా క్యాచ్ పట్టుకోవడంతో 4 పరుగులు చేసిన శాంసన్ వెనుదిరిగాడు. దీంతో మైదానంలో విరాట్ కోహ్లీ ఎంజాయ్ చేశాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారాయి.
