2029 లోగా 36 ఇరిగేషన్ ప్రాజెక్టుల ప‌నులు పూర్తి చేస్తాం

కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. రాష్ట్రంలో ప్ర‌స్తుతం కొన‌సాగుతున్న 36 ప్రాజెక్టుల ప‌నుల‌ను వ‌చ్చే 2029 సంవ‌త్స‌రం నాటికి పూర్తి చేస్తామ‌ని వెల్ల‌డించారు. సోమ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. గోదావరి, కృష్ణా పుష్కరాలకు ఏర్పాట్లు చేస్తున్నాం అన్నారు. విజయవాడ ఎయిర్ పోర్టు అభివృద్ధి పనులు జరుగుతున్నాయ‌ని, న్యూ టెర్మినల్ బిల్డింగ్ ప్రారంభిస్తాం అని తెలిపారు. విశాఖ, తిరుపతి, అమరావతి ఎకనమిక్ రీజియన్లగా అభివృద్ధి చేస్తున్నామ‌ని, నియోజకవర్గానికో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేసి తీరుతామ‌న్నారు సీఎం. స్వయం ఏపీ పేరుతో డ్వాక్రా ఉత్పత్తుల మార్కెటింగ్ చేపడుతున్నాం అని తెలిపారు.పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో రూ. 1.50 లక్షల కోట్లకు పైగా నిధులతో అభివృద్ధి పనులు చేప‌ట్టామ‌న్నారు. కేంద్రం, రాష్ట్రం, స్థానిక ప్రభుత్వాలు చాలా కీలకమ‌ని, ఇవన్నీ ఒక్కతాటి మీద ఉంటే రాష్ట్రాభివృద్ధి జరుగుతుంద‌న్నారు.

గత ప్రభుత్వం కేంద్ర నిధులను పక్కన పెట్టేసిందని ఆరోపించారు నారా చంద్ర‌బాబు నాయుడు. జేజేఏం పనులను చేపట్ట లేద‌ని పేర్కొన్నారు. ఆర్థిక సంఘం నిధులను స్థానిక సంస్థలకు ఇవ్వకుండా గత ప్రభుత్వం అడ్డుకుందని మండిప‌డ్డారు. గత ప్రభుత్వంలో పెద్ద ఎత్తున చెత్త పేరుకు పోయింద‌ని, దీని వల్ల భూగర్భ జలాలు కలుషితమయ్యాయని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. గత పాలనలో పేరుకు పోయిన చెత్తను క్లియర్ చేయడానికి రెండున్నరేళ్లు పట్టిందన్నారు. గ్రామాలను.. పట్టణాలను స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ద్వారా పరిశుభ్రమైన వాతావరణం కల్పిస్తున్నామ‌ని చెప్పారు సీఎం. ఇళ్ల పైనే సోలార్ ప్యానెళ్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తికి అవకాశం కల్పిస్తున్నామ‌ని తెలిపారు. విశాఖ, విజయవాడల్లో సంపూర్ణ హక్కులు కల్పిస్తూ ఇళ్ల పట్టాలు ఇచ్చామ‌ని, రాజముద్రతో పట్టాదార్ పాస్ పుస్తకాలు ఇస్తున్నాం అన్నారు. గత ప్రభుత్వంలో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌తో భూములను దోపిడీ చేయాలని అనుకున్నార‌ని, కానీ తాము వ‌చ్చాక అడ్డుకున్నామ‌న్నారు నారా చంద్ర‌బాబు నాయుడు.

Leave A Reply

Your Email Id will not be published!