Womens Bill Comment : మహిళా బిల్లుతో మార్పు రానుందా
బిల్లు సరే మహిళల మాటేంటి
Womens Bill Comment : చర్చలు, వాదోప వాదనల మధ్య ప్రజా దేవాలయంగా భావించే నూతన పార్లమెంట్ సాక్షిగా మహిళా బిల్లును ప్రవేశ పెట్టారు. దేశానికి స్వతంత్రం లభించి 75 ఏళ్లవుతున్నా ఇంకా మహిళలకు సంబంధించి రిజర్వేషన్ కల్పించాలా వద్దా అనే అంశంపై మల్లగుల్లాలు పడ్డారు. ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి. కానీ పాలక వర్గాలలో ఉన్న ఆధిపత్య భావజాలం, పురుషాధిక్య సమాజం ఈ బిల్లుకు అడ్డు పడుతూ వచ్చాయి. నేటికీ కుల, మతం, ప్రాంతం పరంగా స్త్రీలు, యువతులు, బాలికల పట్ల నేరాలు, ఘోరాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికీ ఇది రాజకీయ ప్రయోజనం కోసం ప్రవేశ పెడుతున్నారే తప్పా అది ఆచరణలో అమలు కావాలంటే ఇంకా కొన్నేళ్లు ఆగాల్సిందే. ఆకాశంలో సగం అన్నారు, అన్నింటా మీరే ముఖ్యమని చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చేసరికి, నిర్ణయం తీసుకునే సమయంలో మహిళలను వెనక్కి నెట్టివేస్తూ వచ్చారు. భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి వ్యక్తికి అన్ని రంగాలలో సమాన హక్కు ఉంటుంది.
Womens Bill Comment Viral
కానీ చట్టాల వరకే ఇవి వర్తిస్తున్నాయి. కానీ వాస్తవంలోకి వచ్చే సరికి ఆడబిడ్డలను ఆమడ దూరంలో ఉంచుతున్నారు. గతంలో కాంగ్రెస్(Congress) ప్రభుత్వ హయాంలోనే మహిళా బిల్లుకు రూపకల్పన జరిగింది. కానీ దానిని కొన్ని పార్టీలకు చెందిన సభ్యులు అడ్డుకున్నారు. ఎందుకంటే తమ పవర్ కు భంగం వాటిల్లుతుందని భయపడ్డారు. ఇప్పటికీ అమలు చేస్తున్న రిజర్వేషన్ల ప్రకారం కొలువు తీరిన ప్రజా ప్రతినిధులలో ఏ ఒక్కరికీ సముచిత స్థానం దక్కడం లేదు. వారికి ప్రాధాన్యత లభించడం లేదన్నది జగమెరిగిన సత్యం. ఇతర దేశాలలో మహిళలకు అత్యధిక ప్రాధాన్యత దక్కుతోంది. భారత దేశానికి వచ్చే సరికి కులం నిచ్చెన మెట్ల మీద రాజకీయం కొనసాగుతోంది. నేటికీ అన్ని పార్టీలదీ దీనినే అనుసరిస్తున్నాయి. తాజాగా మరోసారి మహిళా బిల్లు చర్చకు వచ్చింది.
ఎప్పటి లాగే వాదోపవాదాలు కొనసాగాయి. చివరకు అత్యధిక మెజారిటీ సభ్యులు కలిగి ఎన్న ఎన్డీఏ దానికి పూర్తి మద్దతు పలికింది. ప్రతిపక్షాలు కూడా ఓకే చెప్పాయి. ఇదంతా పక్కన పెడితే 2010లో కాంగ్రెస్(Congress) పార్టీ రాజ్యసభలో మహిళా బిల్లును ప్రవేశ పెట్టింది. అప్పటి నుంచి నేటి దాకా బిల్లు చట్టంగా రూపు దిద్దుకోలేదు. కర్ణుడి చావుకు ఎన్ని కారణాలు ఉన్నాయో ఈ బిల్లు ఆమోదం పొందక పోవడానికి అంతకంటే ఎక్కువ కారణాలు ఉన్నాయి. తాజాగా తీసుకు వచ్చిన మహిళా బిల్లులో 33 శాతం రిజర్వేషన్ సౌకర్యం పార్లమెంట్, రాష్ట్ర అసెంబ్లీలలో కల్పించాలని ఇందులో పొందు పర్చారు. దీని వల్ల సీట్ల సంఖ్య పెరుగుతుంది. మహిళల ప్రాతినిధ్యానికి ఎక్కువ ఆస్కారం లభిస్తుంది. మొత్తం సీట్లలో మూడింట ఒక వంతు వీరికి కేటాయిస్తారు.
ఎస్సీ, ఎస్టీ తెగలకు ప్రయారిటీ ఉంటుంది. బిల్లు ఆమోదం పొందిన తర్వాత 15 ఏళ్లకు ఈ సౌకర్యం ముగుస్తుంది. అంతకు ముందు 1935లో ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం రిజర్వేషన్ అమలుపై కీలక నిర్ణయం తీసుకుంది. కొన్ని సీట్లను మహిళలకు ఇచ్చింది. 1988లో మహిళల హక్కుల కోసం ఓ నివేదికను రూపొందించారు. ఇందులో ఒకే చట్టం, ఆస్తులు, సీట్లు, లింగ నిర్దారణ పరీక్షలు, వరకట్న వేధింపులు, తదితర ప్రాధాన్యత కలిగిన అంశాలు పొందు పరిచారు. 73, 74వ సవరణల ద్వారా పంచాయతీరాజ్ సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించాలని ఆమోదించారు. ఆ తర్వాత 1996లో లోక్ సభలో తొలిసారిగా మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశ పెట్టారు. 2010లో రాజ్యసభలో ఆమోదం పొందింది..కానీ చట్టంగా మార్పు చెందలేదు. మొత్తం మీద ఈ బిల్లు ఆమోదం పొందినా దేశంలో సగానికి పైగా ఉన్న మహిళల బతుకుల్లో మార్పు రానంత వరకు ఇది ఉన్నా లేనట్టేనన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
Also Read : Jennifer Larson : వ్యాపారానికి హైదరాబాద్ స్వర్గధామం