హైదరాబాద్ : విలక్షణ నటుడు రణబీర్ కపూర్, సాయి పల్లవి , యశ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘రామాయణం : రైజ్ ఆఫ్ ఏ లెజెండ్ . ఈ మూవీ అక్టోబర్ 27న లాస్ ఏంజిల్స్‌లో వరల్డ్ ప్రీమియర్‌కు సిద్ధమవుతోంది. నవంబర్ 5న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న నేపథ్యంలో అంతకు ముందుగా లాస్ ఏంజిల్స్‌లోని ‘అకాడమీ మ్యూజియం ఆఫ్ మోషన్ పిక్చర్స్’లో ఉన్న ‘డేవిడ్ గెఫెన్ థియేటర్’లో ఈ ప్రీమియర్ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి హాలీవుడ్ ప్రముఖులు, చిత్ర నిర్మాతలు, అంతర్జాతీయ మీడియా ప్రతినిధులు, సినీ పరిశ్రమకు చెందిన వారితో సహా సుమారు 945 మంది అతిథులు హాజరు కానున్నారు. ఈ చిత్రాన్ని 3Dలో ప్రదర్శించ నుండటంతో థియేటర్ విడుదలకు ముందే ప్రేక్షకులు ఈ సినిమా అద్భుత దృశ్యాలను భారీ స్థాయిలో అనుభవించే అవకాశం కలుగుతుంది.
ఈ కార్యక్రమం ప్రత్యేకత ఏమిటంటే దీనికి దీపావళి పండుగ నేపథ్యాన్ని జోడించారు. రెడ్ కార్పెట్ మీద నడిచే అతిథులు భారతీయ సాంప్రదాయ పండుగ దుస్తులను ధరించాలని కోరింది చిత్ర బృందం. ఈ డ్రెస్ కోడ్ ద్వారా భారతీయ సంస్కృతిని, దీపావళి స్ఫూర్తిని అంతర్జాతీయ ప్రేక్షకులకు పరిచయం చేయాలనేది దీని ఉద్దేశ్యం. నితీష్ తివారీ దర్శకత్వంలో నామిత్ మల్హోత్రా నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రం భారతీయ ఇతిహాసం ‘రామాయణం’ ఆధారంగా రెండు భాగాలుగా రానుంది. ఇందులో రణబీర్ కపూర్ శ్రీరాముడిగా సాయి పల్లవి సీతాదేవిగా, యశ్ రావణుడిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా నటిస్తున్నారు. లాస్ ఏంజిల్స్‌లో జరగనున్న ఈ ప్రీమియర్, సినిమా విడుదలకు ముందే అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించడమే కాకుండ, ప్రపంచవ్యాప్త ప్రేక్షకులకు , సినీ పరిశ్రమ ప్రతినిధులకు ఈ చిత్రాన్ని పరిచయం చేయనుంది.
‘అకాడమీ మ్యూజియం’లో ఈ చిత్రాన్ని ప్రదర్శించడం ద్వారా ఈ చిత్రానికి ఒక గొప్ప అంతర్జాతీయ వేదిక లభించినట్లయింది. మొదటి భాగం నవంబర్ 5, 2026న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుండగా, రెండో భాగం 2027 దీపావళికి విడుదలయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. భారీ తారాగణం , 3D ప్రదర్శనతో కూడిన ఈ చిత్రం, అత్యంత ప్రతిష్టాత్మకమైన భారతీయ చిత్రంగా రూపుదిద్దుకుంటోంది.
