Wrestlers Comment : చ‌రిత్ర క్ష‌మించ‌దు దేశం మ‌న్నించ‌దు

మ‌హిళా రెజ్ల‌ర్ల పోరాటానికి హ్యాట్సాఫ్

Wrestlers Comment : స‌మున్న‌త భార‌తావ‌ని సిగ్గుతో త‌ల‌దించుకుంటోంది. మాన‌వ‌త్వం అన్న‌ది మ‌చ్చుకైనా క‌నిపించ‌కుండా పోతోంది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆడుతున్న నాట‌కంలో ఎంద‌రో స‌మిధ‌ల‌వుతున్నారు. కాన రాకుండా పోతున్నారు. రోజు రోజుకు వ్య‌వ‌స్థ మీద న‌మ్మ‌కం కోల్పోయేలా ఏలుతున్న పాల‌కులు ప్ర‌వ‌ర్తిస్తున్నారు. ఇవాళ న్యాయం గాలిలో దీపంలాగా మారింది. కొద్దో గొప్పో న‌మ్మ‌కాన్ని క‌లిగిన న్యాయ వ్య‌వ‌స్థ సైతం భ్ర‌ష్టు ప‌ట్టి పోయింది. నేర‌స్థులు ద‌ర్జాగా తిరుగుతున్నారు. ప‌వ‌ర్ ను అడ్డం పెట్టుకుని పేట్రేగి పోతున్నారు. ర‌క్షించాల్సిన వాళ్లు కాటేస్తుంటే ఇక స‌భ్య స‌మాజం ఎలా ఎదుర్కొంటుంది. ఎలా నిల‌దీస్తుంది. రాజ్యం బ‌లీయ‌మైన చోట , పాల‌క ప‌క్షం అధికార మ‌ధంతో చెల‌రేగుతుంటే మ‌హిళ‌లు ఎలా త‌ట్టుకోగ‌లర‌ని అనుకోగ‌లం. అయినా వాళ్లు త‌మ ఆత్మ గౌరవం కోసం నిన‌దించారు. న్యాయం కావాలంటూ ఆక్రోశించారు. గ‌త కొన్ని నెల‌లుగా ఒంట‌రి పోరాటం చేస్తున్నారు.

చివ‌ర‌కు వాళ్ల‌ను నేర‌స్థులుగా చేసింది కాషాయ భార‌తం. తాము దోపిడీదారులం కామ‌ని, తాము శాయ‌శ‌క్తులా కృషి చేసి జాతీయ ప‌తాకాన్ని ప్ర‌పంచపు ప‌టం మీద ఎగ‌రేలా చేశామ‌ని నెత్తీ నోరు బాదుకున్నా ప‌ట్టించుకున్న వారే లేరు. విప‌క్షాలు అప్పుడ‌ప్పుడు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించినా , అనున‌య‌పు మాట‌లు చెప్పినా అవేవీ కేంద్ర స‌ర్కార్ కు త‌ల‌కెక్క‌డం లేదు. ఇంత‌కీ ఇంత‌లా ఆవేద‌న చెందుతున్న వాళ్లు ఎవ‌రో కాదు భార‌త దేశానికి చెందిన మ‌హిళా రెజ్ల‌ర్లు(Wrestlers) (మ‌ల్ల యోధులు) . వాళ్లు చేసిన అతి పెద్ద నేరం ఒక్క‌టే. తాము లైంగికంగా , మాన‌సికంగా, శారీర‌కంగా వేధింపుల‌కు గుర‌వుతున్నామ‌ని. త‌మ మాన ప్రాణాల‌తో ఆటాడుకుంటున్న ఆ మ‌హానుభావుడు ఎవ‌రో కాదు సాక్షాత్తు మోదీ నేతృత్వం వ‌హిస్తున్న భార‌తీయ జ‌న‌తా పార్టీకి చెందిన పార్ల‌మెంట్ స‌భ్యుడు బ్రిజ్ భూష‌ణ్ శ‌ర‌ణ్ సింగ్.

క‌నీసం అత‌డిపై ఫిర్యాదు చేసేందుకు వెళితే ఢిల్లీ ఖాకీలు తీసుకోమంటూ క‌రాఖండిగా చెప్పేశారు. చివ‌ర‌కు భార‌త దేశ స‌ర్వోన్న‌త న్యాయ స్థానాన్ని ఆశ్ర‌యించారు. సీజేఐ జోక్యం చేసుకుంటేనే కానీ ఖాకీలు కేసు న‌మోదు చేయ‌లేదు. భార‌త రెజ్ల‌ర్ల స‌మాఖ్య‌కు చీఫ్ గా ఉన్న సింగ్ తాను కింగ్ అంటూ ప్ర‌క‌టించారు. క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ చెప్పినా డోంట్ కేర్ అన్నాడు. ఆపై మోదీ చెబితే వింటా, త‌ప్పు చేస్తే ఉరి వేసుకుంటానంటూ ప్ర‌క‌టించారు. కానీ తాను రాజీనామా చేసే ప్ర‌స‌క్తి లేద‌ని ప్ర‌క‌టించాడు. ఈ స‌మ‌యంలో రెజ్ల‌ర్లు(Wrestlers) మాత్రం ఎక్క‌డా త‌గ్గ‌లేదు. ఖాకీలు లాఠీలు ఝులిపించినా, సున్నిత భాగాల‌పై చేతులు వేసినా, అసభ్య‌క‌రంగా ప్ర‌వ‌ర్తించినా అడుగు ముందుకు వేశారు త‌ప్పా వెన‌క్కి వేయ‌లేదు.

వాళ్ల ధైర్యానికి హ్యాట్సాఫ్‌. జాతి యావ‌త్తు సిగ్గుతో త‌ల దించుకుంది. వారి ప‌ట్ల ఖాకీలు ప్ర‌వ‌ర్తించిన తీరు ప‌ట్ల‌. ఇక మీడియా మోదీని కీర్తించ‌డంలోనే బిజీగా మారి పోయింది. బాధిత మ‌హిళా మ‌ల్ల యోధుల గురించి ప్ర‌శ్నించే ఛాన్స్ ఎక్క‌డిది. ఒక్క సామాజిక మాధ్య‌మాలే వాళ్లను హీరోలుగా మార్చేశాయి. కొస మెరుపు ఏమిటంటే అన్నం పెట్టే రైత‌న్న‌లే ఇప్పుడు రెజ్ల‌ర్ల‌కు(Wrestlers) మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. కేంద్రంపై మ‌రో పోరాటానికి పిలుపునిచ్చారు. అర్ధ‌రాత్రి స్త్రీ ఒంట‌రిగా తిరిగిన‌ప్పుడే దేశానికి స్వేచ్ఛ ల‌భించిన‌ట్లు అని చెప్పిన మ‌హాత్ముడి మాట‌లు ఏమో కానీ ఇవాళ దేశం సాక్షిగా ఆడ‌బిడ్డ‌ల‌కు జ‌రిగిన అవ‌మానం క్ష‌మించ‌రాని నేరం.

Also Read : Smriti Irani

Leave A Reply

Your Email Id will not be published!