కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్ లో రాజస్థాన్ రాయల్స్ యంగ్ స్టార్ యశస్వి జైశ్వాల్ శివమెత్తాడు. కోల్ కతా బౌలర్ల భరతం పట్టాడు. ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కళ్లు చెదిరే షాట్స్ తో ఆకట్టుకున్నాడు. ఐపీఎల్ 16వ సీజన్ లో భాగంగా కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన కీలక మ్యాచ్ లో అటు బ్యాటింగ్ లో ఇటు బౌలింగ్ లో రాణించింది రాజస్థాన్ రాయల్స్ .
ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్ కతా నైట్ రైడర్స్ ను 20 ఓవర్లలో 149 పరుగులకే కట్టడి చేసింది. స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ మరోసారి మెరిశాడు. కోల్ కతా బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టాడు. 25 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీశాడు. కోల్ కతా పతనాన్ని శాసించాడు.
అనంతరం 150 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ ఇంకా 7 ఓవర్లు మిగిలి ఉండగానే పని పూర్తి చేసింది. స్టార్ క్రికెటర్ యశస్వి జైశ్వాల్ వచ్చీ రావడంతో శివాలెత్తి పోయాడు. సిక్సర్లు, ఫోర్లతో ఆరంభించాడు. కెప్టెన్ నితీశ్ రాణా ఊహించని రీతిలో తొలి ఓవర్ బౌలింగ్ చేశాడు. ఆ ఒక్క ఓవర్ లో 22 రన్స్ పిండుకున్నాడు. 2 సిక్సర్లు 2 ఫోర్లు 2 రన్స్ వచ్చాయి.
మొత్తం 47 బంతులు ఎదుర్కొని 15 ఫోర్లు 5 సిక్సర్లతో 98 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇక కెప్టెన్ సంజూ శాంసన్ 29 బంతులు ఎదుర్కొని 47 రన్స్ చేసి ఆట చివరి దాకా ఉన్నాడు. జోస్ బట్లర్ లేని రన్ కోసం తన వికెట్ పారేసుకున్నాడు. దీంతో రాజస్థాన్ రాయల్స్ 9 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించింది.
