YS Sharmila Sensational Comments: జగన్ ప్రభుత్వం బీజేపీకు అమ్ముడు పోయింది- ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల
జగన్ ప్రభుత్వం బీజేపీకు అమ్ముడు పోయింది- ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల
YS Sharmila: ఏపీలో వైసీపీ ప్రభుత్వం, ఎంపీలు కేంద్రంలో ఉన్న బీజేపీకు అమ్ముడుపోయారని… బీజేపీ కార్యాలయంలో వైసీపీ ఎంపీలు కూర్చుంటున్నారని ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) సంచలన ఆరోపణలు చేసారు. బీజేపీకు ఏపీలో పార్టీలు తొత్తులుగా మారారు, బీజేపీకు రాష్ట్రంలో ఒక్క ఎమ్మెల్యే లేకపోయినప్పటికీ… వైసీపీ ప్రభుత్వం, నాయకులు వారి చేతులో కీలు బొమ్మలుగా మారి, ఊడిగం చేస్తున్నారని ఎద్దేవా చేసారు. శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా ఇచ్ఛాపురంలో ‘ప్రజా ప్రస్థానం’ విజయస్తూపాన్ని ఆమె సందర్శించి నివాళులర్పించారు. అనంతరం స్థానిక నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె పలాస నుండి ఇచ్చాపురం వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసారు. ఆర్టీసి బస్సులో ప్రయాణించిన స్థానికులతో ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ… ‘‘వైఎస్‌ఆర్(YSR) పాదయాత్ర ఇచ్ఛాపురంలోనే ముగిసింది. ప్రజల కష్టాలను చూసి ఆయన ఒక్క అవకాశం అడిగారు. సీఎం అయ్యాక 46 లక్షల మందికి పక్కా ఇళ్లు కట్టించారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల మేలు కోసం వైఎస్‌ఆర్ పోరాటానికి కొనసాగింపుగా పేదల పక్షాన నిలబడేందుకే ఇదే ఇచ్ఛాపురం నుంచి నా ప్రస్థానం మొదలైంది. ప్రజలు నన్ను, కాంగ్రెస్ పార్టీను ఆశీర్వదించాలి. కాంగ్రెస్ పార్టీ తరఫున పథకాలన్నీ వైఎస్‌ఆర్ అమలు చేశారు. వైఎస్‌ఆర్‌కి కాంగ్రెస్ ఎంత బలమో.. ఆయనకీ కాంగ్రెస్ అంతే బలం. రాజశేఖర్‌రెడ్డిని అవమానించిన పార్టీ అని కొందరు విమర్శలు చేస్తున్నారు. ఆ విమర్శల్లో నిజాలు లేవు. వైఎస్‌ఆర్ అంటే ఇప్పటికీ పార్టీ అధిష్ఠానానికి అభిమానం ఉంది. ఆ విషయాన్ని స్వయంగా సోనియా గాంధీయే నాకు చెప్పారు. రాజీవ్ గాంధీ చనిపోయాక కూడా ఎఫ్‌ఐఆర్‌లో ఆయన పేరు పెట్టారు. అది తెలియక చేసిన తప్పు కానీ.. తెలిసి చేసింది కాదు అని ఆమె స్పష్టం చేసారు.
YS Sharmila – ‘ప్రత్యేక హోదా’ తెస్తా అన్న జగన్ మాటలు ఇప్పుడు ఎక్కడికి పోయాయి ?
బీజేపీ ఒక మతతత్వ పార్టీ అని… కాబట్టి అది ఎవరికీ శ్రేయష్కరం కాదని అన్నారు. తన తండ్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా బీజేపీను వ్యతిరేకించారు అని అన్నారు. ఇవాళ రాష్ట్రంలో పరిస్థితులు చూస్తుంటే బాధగా ఉంది. బీజేపీకు ఇక్కడి పార్టీలు తొత్తులుగా మారాయి. ఒక్క ఎమ్మెల్యే లేకపోయినా ప్రభుత్వం వాళ్ల చేతుల్లో ఉంది. భాజపాకు కీలుబొమ్మలా జగన్ ప్రభుత్వం మారింది. ఒక్క రోజు కూడా జగన్ ప్రత్యేక హోదా గురించి అడగలేదు. 25 మంది ఎంపీలను ఇస్తే ‘హోదా’ తెస్తా అనే మాటలు ఇప్పుడు ఎక్కడికి పోయాయి ? రాహుల్‌గాంధీ మొదటి సంతకం ప్రత్యేకహోదాపైనే పెడతానని చెప్పారు. రాష్ట్రం గురించి ఆలోచించే పార్టీ కాంగ్రెస్. వైఎస్‌ఆర్ ఆశయాలను అందరం బతికిద్దాం’’ అని షర్మిల అన్నారు.
వైవీ సుబ్బారెడ్డి సవాల్ ను స్వీకరించిన షర్మిల !
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి చేసిన సవాల్ ను వైఎస్ షర్మిల(YS Sharmila) స్వీకరించారు. జగన్ రెడ్డి అంటే నాకు నచ్చలేదని వైవీ సుబ్బా రెడ్డి గారు అంటున్నారు. ఇప్పటినుంచి జగన్ ఆన్న గారు అనే అంటా. నాకేం అభ్యంతరం లేదు. ఆంధ్రప్రదేశ్ లో చేసిన అభివృద్ధిని నాకు చూపిస్తా అని సుబ్బారెడ్డి గారు సవాల్ విసిరారు. నేను సుబ్బారెడ్డిగారి సవాల్ ను స్వీకరిస్తున్నారు. సరే సార్…మీరు చేసిన అభివృద్ధి చూపించండి. మీరు చేసిన అభివృద్ధి చూడటానికి నేను సిద్ధం. డేట్,టైం మీరు చెప్పినా సరే… నన్ను చెప్పమన్నా సరే… నాతో పాటు మేధావులు, ప్రతిపక్షాలు , మీడియా కూడా వస్తుంది మీరు చేసిన అభివృద్ధి ఏంటో చూపించడం అని ఆమె అన్నారు. మీరు అభివృద్ధి చేసింది ఎక్కడ ? మీరు చెప్పిన రాజధాని ఎక్కడ ? పోలవరం ప్రాజెక్ట్ ఎక్కడ ? మీ అభివృద్ధి ఆంధ్ర రాష్ట్రం అంతా చూడాలని అనుకుంటుంది… కాబట్టి చూపించండి అంటూ ప్రశ్నించారు.
Also Read : Telangana Govt : మరో రెండు పథకాలకు శ్రీకారం చుట్టనున్న కాంగ్రెస్ ప్రభుత్వం