YS Sharmila : వైఎస్సార్ టీఫ్ చీఫ్ వైఎస్ షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను చేసిన అలుపెరుగని పోరాటం వల్లే ఇవాళ తెలంగాణ సర్కార్ దిగి వచ్చిందన్నారు. తనపై దాడులకు దిగబడినా తాను వెనక్కి తగ్గలేదన్నారు.
నిరుద్యోగ నిరసన దీక్ష చేపట్టానని, నిరంతరం ప్రభుత్వాన్ని ప్రశ్నించానని, ఆత్మహత్యలకు పాల్పడిన వారి కుటుంబాలను పరామర్శించానని అన్నారు.
దీంతో ఒత్తిడికి తట్టుకోలేక కేసీఆర్ ఉద్యోగాల భర్తీకి ముందుకు వచ్చాడని ఎద్దేవా చేశారు. వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థాన యాత్ర భూదాన్ పోచంపల్లి మీదుగా బీబీనగర్ మండలానికి చేరింది.
ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి వైఎస్ షర్మిల ప్రసంగించారు. అంతకు ముందు మాట ముచ్చట కార్యక్రమం చేపట్టారు. ప్రైవేట్ రంగాలలో 11 లక్షల జాబ్స్ కల్పించిన ఘనత దివంగత సీఎం వైఎస్సార్ కే దక్కుతుందన్నారు.
తాను మహిళనని చూడకుండా కేసీఆర్ తనపై దాడి చేయించాడంటూ ఆరోపించారు. ఎక్కడా తాను తగ్గలేదన్నారు. మడమ తిప్పని వంశం తమదని ఒక్కసారి కమిట్ అయితే ఇక వెనక్కి చూడమన్నారు వైఎస్ షర్మిల(YS Sharmila ).
బంగారు తెలంగాణ అని ప్రగల్భాలు పలికిన కేసీఆర్ ఇప్పుడు ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. ఎలాంటి వివాదాలు చోటు చేసుకోకుండా వెంటనే నోటిఫికేషన్లు జారీ చేయాలని వైఎస్ షర్మిల(YS Sharmila )డిమాండ్ చేశారు.
లేక పోతే నిరుద్యోగుల నుంచి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కొలువు తీరి ఎనిమిదేళ్లు అయినా ఈ రోజు వరకు ఒక్క నోటిఫికేషన్ వేసిన దాఖలాలు లేవని ఆరోపించారు షర్మిల.
Also Read : పీకేకు అంతు చిక్కని పల్స్