అంద‌రి చూపు నాగార్జున‌సాగ‌ర్ వైపు

తెలంగాణ రాష్ట్రంలో అంద‌రి దృష్టి ఇపుడు నాగార్జున సాగ‌ర్ వైపే ఉంటోంది. ప్ర‌ధాన రాజ‌కీయ పార్టీల‌న్నీ చావో రేవో తేల్చుకునే ప‌నిలో ప‌డ్డాయి. నిన్న‌టి దాకా త‌మ‌కు ఎదురే లేదంటూ బీరాలు ప‌లికిన అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర స‌మితి పార్టీకి ఇపుడు సాగ‌ర్ లో జ‌ర‌గ‌బోయే ఉప ఎన్నిక అగ్ని ప‌రీక్ష‌కు గురి చేస్తోంది. కింది స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా కార్య‌క‌ర్త‌లు, నేత‌ల బ‌లంతో పాటు ఆర్థిక‌, అంగ బ‌లం క‌లిగి ఉన్న‌ది. గ‌తంలో కంటే ఇపుడు ప‌రిస్థితులు మారాయి. ప్ర‌జ‌లు మార్పును కోరుకుంటున్నార‌నే వాస్త‌వం తాజాగా దుబ్బాక‌లో జ‌రిగిన ఉప ఎన్నిక‌తో పాటు హైద‌రాబాద్ న‌గ‌ర పాలక ఎన్నిక‌ల్లో తేట తెల్ల‌మైంది. దీనిని ఎట్టి ప‌రిస్థితుల్లో అలుసుగా తీసుకుంటే మొద‌టికే మోసం వ‌చ్చే ప్ర‌మాదం ఉంద‌ని పార్టీ హైక‌మాండ్ గ్ర‌హించింది. ఆ మేర‌కు ముందు జాగ్ర‌త్తగా న‌ష్ట నివార‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఏ ఒక్క ఓటు విప‌క్షాల‌కు పోకూడ‌ద‌ని, ప్ర‌తి ఒక్క‌రు యుద్ధంలో సైనికుల్లాగా ప‌ని చేయాల‌ని పార్టీ అధ్య‌క్షుడు, రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ హిత బోధ చేశారు.
ట్ర‌బుల్ షూట‌ర్ గా పేరొందిన హ‌రీష్ రావుకు దుబ్బాక‌ను అప్ప‌గించినా ఫ‌లితం లేక పోయింది. జ‌నం టిఆర్ఎస్ స‌ర్కార్ కు కోలుకోలేని షాక్ ఇచ్చారు. స్ప‌ష్ట‌మైన తీర్పు చెప్పారు. దీనిని తేలిగ్గా తీసుకున్న అధికార పార్టీకి జిహెచ్ఎంసి ఎల‌క్ష‌న్లు సైతం దెబ్బ కొట్టాయి. స్ప‌ష్ట‌మైన మెజారిటీ తెచ్చుకోలేక పోయింది. మేయ‌ర్ పీఠం చేజిక్కించు కోవాలంటే మేజిక్ ఫిగ‌ర్ ద‌క్కాల్సిందే. కావాల్సిన బ‌లం లేక పోవ‌డంతో ఎంఐఎంతో దోస్తీ చేయాల్సిందే. దీనినే ఎక్కువ‌గా ప్ర‌తిప‌క్ష పార్టీ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఫోక‌స్ చేస్తున్నాయి. ఇదిలా ఉండ‌గా అనారోగ్యం కార‌ణంగా సాగ‌ర్ ఎమ్మెల్యే నోముల మృతి చెందారు. దీంతో అక్క‌డ ఉప ఎన్నిక అనివార్య‌మైంది. ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి మంచి ప‌ట్టుంది. కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ తో పాటు సీనియ‌ర్ నాయ‌కుడైన కందూరు జానా రెడ్డికి జ‌నంలో ఆద‌ర‌ణ ఉంది. ఆయ‌న గ‌తంలో టీడీపీలో, కాంగ్రెస్‌లో మంత్రి ప‌ద‌వులు నిర్వ‌హించారు. సౌమ్యుడిగా పేరుంది. తెలంగాణ ఉద్య‌మ కాలంలో జానారెడ్డి కీల‌క పాత్ర పోషించారు.
ఆయ‌న అన్ని పార్టీల‌కు చెందిన నాయ‌కులతో మంచి స‌త్సంబంధాలు ఉన్నాయి. ఆయ‌న బీజేపీలో చేరుతార‌న్న ప్ర‌చారం ఊపందుకుంది. ఆయ‌న‌తో క‌మ‌లం పెద్ద‌లు ట‌చ్ లో ఉన్నార‌నే వార్త గుప్పుమంది.
దీనిని జానారెడ్డి తేలిగ్గా కొట్టి పారేశారు. గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వి ఇస్తామ‌ని, త‌న కుమారుడికి బీజేపీ త‌ర‌పున ఎమ్మెల్యేగా పోటీ చేసే అవ‌కాశం ఇస్తామ‌ని ఆఫ‌ర్ ఇచ్చిన‌ట్లు వ‌చ్చిన వార్త‌ల‌ను ఆయ‌న ఖండించారు. తాను చ‌నిపోయేంత దాకా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాన‌ని స్ప‌ష్టం చేశారు. త‌మ పార్టీ నుంచే పోటీ చేయ‌డం ఖాయ‌మ‌ని వెల్ల‌డించారు. దీంతో జానారెడ్డిని ఢీకొనాలంటే ఆయ‌న‌కంటే జ‌నాద‌ర‌ణ క‌లిగిన వారిని ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఇక్క‌డ త‌మ పార్టీ అభ్య‌ర్థిని కోల్పోయిన టిఆర్ఎస్ కు గెలవ‌డం పెను సవాల్ గా మారింది. ప్ర‌స్తుతం మంత్రి ప‌ద‌విలో జ‌గ‌దీశ్ రెడ్డి హ‌వా కొన‌సాగుతున్న‌ది.
విజ‌యం సాధించాలంటే ఆషామాషీ కాదు. పార్టీ నిర్వ‌హించిన స‌ర్వేలో జానారెడ్డికే ఎక్కువ ఎడ్జ్ ఉన్న‌ట్లు వెల్ల‌డి కావ‌డంతో ఏం చేయాలోన‌ని పున‌రాలోచ‌న‌లో ప‌డింది. ఇంకో వైపు దుబ్బాక‌, హైద‌రాబాద్ న‌గ‌ర ఎన్నిక‌ల్లో ఊహించ‌ని విజ‌యాల‌తో ఊపు మీదున్న బీజేపీ నాగార్జున సాగ‌ర్ లో కూడా కంటిన్యూ చేయాల‌ని డిసైడ్ అయింది. కాగా గెల‌వ‌క పోతే టిఆర్ఎస్ కు వ్య‌తిరేక సంకేతాలు ఎదుర‌వుతాయ‌ని ఆ పార్టీ నేత‌లు లోలోప‌ట భ‌య ప‌డుతోంద‌ని స‌మాచారం. ఏది ఏమైనా రాష్ట్రంలో రాజ‌కీయ వేడి రాజుకుంది. సాగ‌ర్ లో ఎవరు గెలుస్తార‌నే దానిపై అంద‌రి చూపు నెల‌కొంది.

No comment allowed please