Himachal Cloudburst: హిమాచల్ ప్రదేశ్ లో కుంభవృష్టి ! 30 మంది గల్లంతు !
హిమాచల్ ప్రదేశ్ లో కుంభవృష్టి ! 30 మంది గల్లంతు !
Himachal Cloudburst: వయనాడ్ విలయం నుండి దేశం తేరుకోకముందే… హిమాచల్ ప్రదేశ్(Himachal) లో కుంభ వృష్టి సంభవించింది. కుంభవృష్టి కారణంగా హిమాచల్ ప్రదేశ్ లోని శిమ్లా జిల్లాలో మెరుపు వరదలు పోటెత్తాయి. రాంపూర్ ప్రాంతంలోని సమేజ్ ఖాడ్ వద్ద గురువారం తెల్లవారుజామున మెరుపు వరదలు పోటెత్తాయి. ఈ వరదల్లో దాదాపు 30 మంది ఆచూకీ గల్లంతైంది. దీనితో ఎస్‌డీఆర్‌ఎఫ్, ఎన్‌డీఆర్‌ఎఫ్, ఇండో టిబెటన్ సరిహద్దు పోలీసులు, పోలీసులు, హోంగార్డులు సహా ఇతర సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. గల్లంతైన వారికోసం ముమ్మర గాలింపు చేపట్టినట్లు డిప్యూటీ కమిషనర్ అనుపమ్ కశ్యప్ వెల్లడించారు.వారి జాడను కనిపెట్టేందుకు డ్రోన్లను సైతం మోహరించినట్లు చెప్పారు. ఒక్కసారిగా పోటెత్తిన వరదల కారణంగా రోడ్లన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. ఓ జల విద్యుత్తు కేంద్ర సైతం తీవ్రంగా దెబ్బతింది. అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఇక కూలులో ఈ రోజు తెల్లవారుజామున ఓ భవనం కుప్పకూలి, పార్వతీ నదిలో కొట్టుకుపోయిందని తెలిపారు. తీవ్ర ఆస్తి నష్టం వాటిల్లింది,” అని తెలిపారు.
Himachal Cloudburst…
హిమాచల్‌ప్రదేశ్‌లో తాజా పరిస్థితులపై ఆ రాష్ట్ర సీఎం సుఖ్‌విందర్ సింగ్ సుక్కుకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఫోన్ చేసి ఆరా తీశారు. హిమాచల్‌ప్రదేశ్(Himachal)కు కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుందని ఈ సందర్భంగా సీఎంకు జేపీ నడ్డా భరోసా ఇచ్చారు. అలాగే రాష్ట్రంలో సహయక చర్యల్లో పాల్గొనాలని రాష్ట్ర బీజేపీ శ్రేణులకు జేపీ నడ్డా పిలుపు నిచ్చారు.
మరోవైపు హిమాచల్‌ప్రదేశ్(Himachal) లోని వివిధ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ప్రాంతీయ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ నేపథ్యంలో వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉరుములు మెరుపులతో పాటు పిడుగులు సైతం పడే అవకాశముందని తెలిపింది. కూలు, సోలన్, సిమ్లా తదితర ప్రాంతాలతోపాటు కిన్నూరు జిల్లాలో కొండ చరియలు విరిగి పడే అవకాశాలున్నాయని హెచ్చరించింది. అలాగే బలమైన గాలులు వీస్తాయని.. దీంతో పంటలు, ఉద్యానవనాలకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశాముందని చెప్పింది. భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అవుతాయని పేర్కొంది.
మరోవైపు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కేరళ, ఢిల్లీలో సైతం భారీ వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం సాయంత్రం ఢిల్లీలో భారీ వర్షం కురిసింది. దీంతో పలు ప్రాంతాలే కాదు… పలు ముఖ్యమైన రహదారులు సైతం నీటిలో చిక్కుకు పోయాయి. ఇక వరద నీటిలో మునిగి ఇద్దరు మరణించారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ మహానగరంలోని స్కూళ్లకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో దాదాపు 10 విమానాలను ఢిల్లీ నుంచి ఇతర ప్రాంతాలకు మళ్లించారు. గురువారం ఉదయం వరకు ఢిల్లీలో రెడ్ అలర్ట్‌ను వాతావరణ కేంద్రం జారీ చేసింది. అనంతరం మరో 24 గంటల పాటు అరెంజ్ అలర్ట్‌ను జారీ చేసింది. ఆగస్ట్ 5వ తేదీ వరకు న్యూఢిల్లీలో ఆడపాదడపా వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
ఇంకోవైపు కేరళలో భారీ వర్షాల కారణంగా వయనాడ్ జిల్లాలో కొండ చరియలు విరిగి పడ్డాయి. ఈ ఘటనలో మృతుల సంఖ్య 249 దాటింది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు తెలుపుతున్నారు. అలాగే ఈ ఘటనలో గాయపడిన వారు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కేరళలో మళ్లీ భారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటి వాతావరణ కేంద్రం వెల్లడించింది.
Also Read : Sonia Gandhi: ప్రజలు కాంగ్రెస్ పట్ల సానుకూలంగా ఉన్నారు: సోనియా గాంధీ