Godavari Express: గోదావరి ఎక్స్ ప్రెస్ కు 50 ఏళ్ళు !
గోదావరి ఎక్స్ ప్రెస్ కు 50 ఏళ్ళు !
Godavari Express: విశాఖపట్నం నుండి హైదరాబాద్ వెళ్లి, వచ్చేవారికి పరిచయం అక్కర్లేని ట్రైన్… గోదావరి ఎక్స్‌ప్రెస్. ట్రైన్ నెంబరు 12727/12728 విశాఖ/హైదరాబాద్ లో సాయంత్రం 5:15 కు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6 గంటలకల్లా గమ్యానికి చేరుస్తుంది. డిన్నర్ బాక్స్ పట్టుకుని సాయంత్ర బయలుదేరి గోదావరి ఎక్స్ ప్రెస్ ఎక్కితే… ఓ రెండు మూడు గంటలు ట్రైన్ లో కాలక్షేపం చేసి… హాయిగా భోజనం చేసి పడుకుంటే… ఉదయాన్నే విశాఖ/హైదరాబాద్ స్టేషన్ లో వేడి వేడి టీ తో చాయ్ వాలా గుడ్ మార్నింగ్ చెప్తాడు. కాబట్టి గోదావరి ఎక్స్‌ప్రెస్ కు చాలా డిమాండ్ ఉంటుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ నాయకులు, అధికారులు, ఉద్యోగులు, నిరుద్యోగులతో పాటు భవన నిర్మాణ కార్మికులకు కూడా చాలా అనువైన ట్రైన్ గోదావరి ఎక్స్‌ప్రెస్. గరీభ్ రథ్, దురంతో, వందే భారత్ వంటి ట్రైన్స్ వచ్చినప్పటికీ గోదావరి ఎక్స్ ప్రెస్ కు ఉన్న క్రేజ్ మరి ఏ ట్రైన్ కు లేదంటే అతిశయోక్తి కాదు.
Godavari Express Service
గోదావరి నదిపై వెళ్ళడంతో ఈ రైలుకు ఆ పేరు పెట్టారో లేదా మరే ఇతర కారణమో తెలీదు గాని గోదావరి ఎక్స్ ప్రెస్ కు అరుదైన గౌరవం దక్కింది. నేటితో ఆ రైలు 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. దీనితో గోదావరి ఎక్స్ ప్రెస్(Godavari Express) కు గోల్డెన్ జూబ్లీ వేడుకలను రైల్వే అధికారులు, సిబ్బందితో పాటు ప్రయాణీకులు కూడా చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. గోల్డెన్ జూబ్లీ సందర్భంగా గోదావరి ఎక్స్ ప్రెస్ ను ప్రత్యేకంగా అలంకరించడంతో పాటు విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. విశాఖపట్నం నుండి హైదరాబాద్ మధ్యలోని పలు స్టేషన్లలో కూడా ఆ సంబరాలను జరపడానికి రైల్వే అధికారులు ఏర్పాట్లు చేసారు.
విశాఖ – హైదరాబాద్ డెక్కన్ మధ్య గోదావరి ఎక్స్ ప్రెస్(Godavari Express) సేవలు సుదీర్ఘంగా కొనసాగుతున్నాయి. 1974 వ సంవత్సరంలో ఫిబ్రవరి ఒకటో తేదీన స్టీమ్ ఇంజన్‌తో మొట్టమొదటిసారి పట్టాలు ఎక్కిన గోదావరి ఎక్స్ ప్రెస్… నేటితో యాభై వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ రైలు మొదటి సారి వాల్తేరు-హైదరాబాద్ మధ్య నడిచింది. దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో అత్యంత ప్రతిష్టాత్మకమైన గోదావరి ఎక్స్ ప్రెస్ ప్రస్తుతం విశాఖపట్టణం నుంచి హైదరాబాద్‌ల మధ్యలో నడుస్తుంది.
Also Read : EX Minister Malla Reddy : ఒకప్పటి పీసీసీ చీఫ్ పై సవాల్ చేసి ఇప్పుడు మేమిద్దరం క్లోజ్ అన్న మల్లా రెడ్డి