Hijab Row Comment : హిజాబ్ వివాదం ప్ర‌శ్నార్థకం

తుది తీర్పు కోసం ఉత్కంఠ

Hijab Row Comment : మ‌రోసారి హిజాబ్ వివాదం దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌కు దారి తీసేలా చేసింది. క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం హిజాబ్ ధ‌రించ‌డాన్ని నిషేధం విధించింది.

దీనిని స‌వాల్ చేస్తూ సుప్రీంకోర్టును(Supreme Court) ఆశ్ర‌యించ‌డంతో దాఖ‌లైన పిటిష‌న్ పై భార‌త దేశ స‌ర్వోన్న‌త న్యాయస్థానం విచార‌ణ చేప‌ట్టింది. హిజాబ్ వివాదంపై భిన్నాభిప్రాయం వ్య‌క్తం చేసింది ధ‌ర్మాస‌నం.

దీంతో క‌థ మ‌ళ్లీ మొద‌టికొచ్చింది. ఇది త‌మ సంప్రదాయ‌మ‌ని దానిని తాము ధ‌రించి తీరుతామ‌ని అంటున్నారు ముస్లిం యువ‌త‌. కానీ క‌ర్ణాట‌క స‌ర్కార్ మాత్రం స‌సేమిరా ఒప్పుకోవడం లేదు. ఎవ‌రైనా స‌రే విద్యా సంస్థ‌ల్లో చ‌దువుకునేందుకు వ‌చ్చిన వారంతా ఆయా సంస్థ‌ల నియామాల‌కు క‌ట్టుబ‌డి ఉండాల్సిందేనంటోంది.

ఇదే విష‌యాన్ని క‌ర్ణాట‌క విద్యా శాఖ మంత్రి బీసీ న‌గేష్ కూడా స్ప‌ష్టం చేశారు. తుది తీర్పు వ‌చ్చేంత వ‌ర‌కు క‌ర్నాట‌క‌లో హిజాబ్ పై నిషేధం కొన‌సాగుతుంద‌ని ప్ర‌క‌టించారు. దీంతో మ‌ళ్లీ వివాదం(Hijab Row) మొద‌టికొచ్చింది.

హిజాబ్ అనేది త‌మ ప్రాథ‌మిక హ‌క్కు అని. దానిని కాద‌న‌డానికి వీలు లేదంటోంది ముస్లిం వ‌ర్గం.

ఇదిలా ఉండ‌గా క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాన్ని స్వాగ‌తించింది క‌ర్ణాట‌క హైకోర్టు. ఈ మేర‌కు ఆదేశాలు కూడా ఇచ్చింది. దీనిని స‌వాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్ర‌యించ‌డం, తీరా తుది తీర్పు వెలువ‌డ‌కుండానే హిజాబ్ పై నిషేధం ఉండాలా వ‌ద్దా అన్న దానిపై సీజేఐకి బ‌దిలీ చేయ‌డంవిస్తు పోయేలా చేసింది.

ఇద్ద‌రు న్యాయ‌మూర్తుల‌తో కూడుకున్న ధ‌ర్మాస‌నం లో ఏకాభిప్రాయం కుద‌ర‌లేదు. భిన్నాభిప్రాయం వ్య‌క్తమైంది. ఒక జ‌డ్జి హిజాబ్ పై నిషేధం ఉండాల‌ని పేర్కొంటే ఇంకో న్యాయ‌మూర్తి హిజాబ్ ధ‌రించ‌డం వ‌ల్ల వ‌చ్చే న‌ష్టం ఏమిటి అంటూ ప్ర‌శ్నించారు. ఒక‌రు స‌పోర్ట్ చేస్తే మ‌రొక‌రు కొట్టి పారేయ‌డం మ‌రింత చ‌ర్చ‌కు దారితీసేలా చేసింది.

చివ‌ర‌కు తీర్పును రిజ‌ర్వ్ లో ఉంచింది. రెండు వారాల పాటు సాగింది విచార‌ణ‌. చివ‌ర‌కు ఇలా ముగిసింది. గ‌తంలో సుప్రీంకోర్టు ఆగస్టు 29న క‌ర్ణాట‌క ప్ర‌భుత్వానికి నోటీసు జారీ చేసింది. ఈ పిటిష‌న్ల‌పై ప్ర‌తిస్పంద‌న కోరింది. 

ఇక విష‌యానికి వ‌స్తే ఈ ఏడాది 2022 ప్రారంభంలో క‌ర్ణాట‌క లోని ఉడిపిలోని పియు ప్ర‌భుత్వ బాలిక‌ల క‌ళాశాల‌లో ఆరుగురు బాలిక‌లు త‌మ యూనిఫాంలో భాగంగా హిజాబ్ ధ‌రించి త‌ర‌గ‌తుల‌కు హాజ‌రు కావ‌డానికి నిరాక‌రించారు.

ఇది నిర‌స‌న‌కు దారి తీసింది. హిజాబ్ పై నిషేధానికి వ్య‌తిరేకంగా నిర‌స‌న‌లు కొన‌సాగుతుండ‌గా మ‌రో వైపు ఉడిపి జిల్లా కుందాపూర్ లోని కొన్ని కాలేజీల్లో కొంత‌మంది అబ్బాయిలు కుంకు పువ్వు ధ‌రించారు.

ప్ర‌భుత్వ కాలేజీ ప్రిన్సిపాల్ హిజాబ్ ధ‌రించిన విద్యార్థులు రాకుండా గేట్లు మూసి వేసిన వీడియో వైర‌ల్ అయ్యింది. హిజాబ్ కు వ్య‌తిరేకంగా నిర‌స‌న‌లు మిన్నంటాయి. సీఎం బొమ్మై సంయ‌మ‌నం పాటించాల‌ని కోరారు.

క‌ర్ణాట‌క విద్యా హ‌క్కు చ‌ట్టం ప్ర‌కారం 1983 సెక్ష‌న్ 133(2) ప్ర‌కారం నిషేధం విధిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. 

విద్యార్థులు, సంస్థ‌లు ప్ర‌భుత్వ ఆదేశాలు పాటించాలని స్ప‌ష్టం చేసింది. డ్రెస్ కోడ్ ధ‌రించాల‌ని ఆదేశించింది. రాజ్యాంగం ప్ర‌కారం ముస్లింలు కండువా ధ‌రించ‌డం త‌ప్ప‌నిస‌రి ఆచారం కాద‌ని 2013లో ప్ర‌భుత్వం ఇచ్చిన ఆదేశాల‌ను ఇది ప్ర‌స్తావించంది. 

ఈ నిర్ణ‌యం త‌ర్వాత పుదుచ్చేరి, మ‌ధ్య ప్ర‌దేశ్ , త‌దిత‌ర రాష్ట్రాల‌లో నిర‌స‌న‌లు జ‌రిగాయి. అక్క‌డ నిషేధం తొల‌గించాలంటూ ముస్లిం బాలిక‌లు రోడ్ల‌పైకి వ‌చ్చారు.

హైకోర్టులో స‌వాల్ చేస్తే కోర్టు స‌ర్కార్ కు అనుకూలంగా తీర్పు చెప్పింది. మార్చి 15, 2022న క‌ర్ణాట‌క హైకోర్టు(Karnataka HC) ప్ర‌ధాన న్యాయ‌మూర్తి రీతురాజ్ అవ‌స్థీ, న్యాయ‌మూర్తులు కృష్ణ దీక్షిత్ , జేఎం ఖాజీల‌తో కూడిన త్రిస‌భ్య ధ‌ర్మాస‌నం ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని స‌మ‌ర్థించింది. 21 మంది న్యాయ‌వాదులు ముస్లింల త‌ర‌పున వాదించారు.

చ‌ట్ట బ‌ద్ద‌త‌, ప్రాతిప‌దిక‌ను స‌వాల్ చేశారు. తాజాగా హిజాబ్ పై దాఖ‌లైన 26 పిటిష‌న్ల‌పై న్యాయ‌మూర్తులు హేమంత్ గుప్తా, సుధాన్షు  ధులియాల‌తో కూడిన ధ‌ర్మాస‌నం తీర్పును రిజ‌ర్వ్ చేసింది. మొత్తంగా హిజాబ్ వివాదం ప్ర‌శ్నార్థంగా మారింది.

Also Read : జ‌ర్న‌లిస్ట్ రానా అయ్యూబ్ పై ఛార్జిషీట్

Leave A Reply

Your Email Id will not be published!