Sonia Gandhi : అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో ఓటేసిన సోనియా

మొద‌టి ఓటు వేసిన పి. చిదంబ‌రం

Sonia Gandhi : సుదీర్ఘ రాజ‌కీయ చ‌రిత్ర క‌లిగిన కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్ష ప‌ద‌వికి సోమ‌వారం ఉద‌యం 10 గంట‌ల‌కు పోలింగ్ మొద‌లైంది. ఈనెల 19న ఫ‌లితం వెల్ల‌డిస్తారు. మొత్తం పార్టీకి సంబంధించి 9,000 మంది స‌భ్యులు ఉన్నారు.

వారంద‌రికీ గుర్తింపు కార్డులు జారీ చేశారు. ఇక పోలింగ్ ప్రారంభ‌మైన వెంట‌నే కేంద్ర మాజీ మంత్రి, సీనియ‌ర్ నాయ‌కుడు పి. చిదంబ‌రం త‌న విలువైన ఓటు వేశారు.

అనంత‌రం పార్టీ తాత్కాలిక చీఫ్ సోనియా గాంధీతో(Sonia Gandhi)  పాటు ఆమె త‌న‌య పార్టీ ప్రధాన కార్య‌ద‌ర్శి ప్రియాంక గాంధీ త‌మ విలువైన ఓటు వేశారు. ఇక అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో ప్ర‌ధాన పోటీ ఇద్ద‌రి మ‌ధ్యే నెల‌కొంది.

ఒక‌రు గాంధీ ఫ్యామిలీకి విధేయుడిగా పేరొందిన క‌ర్ణాట‌క‌కు చెందిన రాజ్య‌స‌భ స‌భ్యుడు మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే కాగా మ‌రొక‌రు అస‌మ్మ‌తి జి23 వ‌ర్గానికి చెందిన తిరువ‌నంత‌పురం ఎంపీ శ‌శి థ‌రూర్.

ఇద్ద‌రూ విస్తృతంగా ప్ర‌చారం చేప‌ట్టారు. పోలింగ్ సాయంత్రం దాకా కొన‌సాగుతుంది. దేశ వ్యాప్తంగా 65 చోట్ల పోలింగ్ బూత్ లు ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాన కార్యాల‌యంలో ర‌హ‌స్య బ్యాలెట్ ప‌ద్ద‌తి ద్వారా ఓటు వేశారు.

25 ఏళ్ల త‌ర్వాత కాంగ్రెస్ పార్టీకి తొలిసారి ఎన్నిక జ‌ర‌గ‌డం. ఢిల్లీలోని పార్టీ ప్ర‌ధాన కార్యాల‌యంలో చిదంబ‌రం ఓటు వేయ‌డంతో పోలింగ్ ప్రారంభ‌మైంది.

ఇదిలా ఉండ‌గా చిదంబ‌రానికి పార్టీ అధ్యక్షునికి జ‌రిగిన అంత‌ర్గ‌త ఎన్నిక‌ల్లో ఇది మొట్ట‌మొద‌టి ఓటు. 1997, 2000 ఎన్నిక‌ల స‌మ‌యంలో ఆయ‌న పార్టీలో లేరు. 1997లో కాంగ్రెస్ పార్టీని విడిచి పెట్టారు. త‌మిళ మ‌నీలా కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2003లో మళ్లీ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. 137 ఏళ్ల చ‌రిత్ర క‌లిగిన పార్టీలో స్వాతంత్రం వ‌చ్చాక ఇది ఆరోసారి ఎన్నిక‌.

Also Read : భ‌గ‌వంత్ మాన్ ఓ బందూక్

Leave A Reply

Your Email Id will not be published!