Kerala Governor : డ్రగ్స్..మద్యానికి కేరళ ప్రోత్సాహం – గవర్నర్
ఆరిఫ్ మహ్మద్ ఖాన్ షాకింగ్ కామెంట్స్
Kerala Governor : కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. మాదక ద్రవ్యాలు..మద్యానికి కేరళ ప్రభుత్వం అడ్డాగా మారిందని ఆరోపించారు. గతంలో డ్రగ్స్ కు పంజాబ్ కేరాఫ్ గా ఉండేదని ప్రస్తుతం దానిని కేరళ దాటేసిందంటూ మండిపడ్డారు. యూనివర్శిటీల నియామకం సహా పలు అంశాలపై గవర్నర్ కేరళ సర్కార్ తో విభేదిస్తున్నారు.
మద్యం వినియోగానికి వ్యతిరేకంగా అందరూ ప్రచారం చేస్తుంటే కేరళ మాత్రం దాని వినియోగాన్ని ప్రోత్సహిస్తోందని ధ్వజమెత్తారు గవర్నర్. కొచ్చిలో జరిగిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఈ కీలక వ్యాఖ్యలు చేశారు ఆరిఫ్ మహ్మద్ ఖాన్(Kerala Governor). ప్రజలకు మేలు చేయాల్సిన వామపక్ష ప్రభుత్వం లాటరీ, డ్రగ్స్, మద్యంను ప్రోత్సహిస్తూ రాష్ట్ర ఆదాయానికి వనరులుగా మార్చేసిందంటూ మండిపడ్డారు.
లాటరీ , మద్యం అభివృద్దికి సోపానంగా భావిస్తోంది ప్రభుత్వం. 100 శాతం అక్షరాస్యత ఉన్న రాష్ట్రానికి ఇది ఎంత అవమానకరమని ఆవేదన వ్యక్తం చేశారు గవర్నర్. రాష్ట్ర అధినేతగా తాను సిగ్గు పడుతున్నానని సంచలన వ్యాఖ్యలు చేశారు. లాటరీ అంటే ఏమిటి..ఇక్కడ కూర్చున్న మీలో ఎవరైనా ఇప్పుడున్న లాటరీ టికెట్లు కొనుగోలు చేశారా అని గవర్నర్ ఖాన్ ప్రశ్నించారు.
పేదలు మాత్రమే లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తారు.. మీరు ఒక రకంగా వాటిని దోచుకుంటున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల్ని మద్యానికి బానిసలు చేస్తున్నారంటూ సీరియస్ అయ్యారు.
దేశ వ్యాప్తంగా మద్యం వినియోగానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తుంటే కేరళ రాష్ట్రంలో ప్రభుత్వమే మద్యానికి మద్దతుగా ప్రచారం చేస్తుండడం దారుణమని పేర్కొన్నారు గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్.
Also Read : కర్నాటక డిప్యూటీ స్పీకర్ కన్నుమూత