Jairam Ramesh : రాహుల్ పాద‌యాత్ర‌లో ఉద్ద‌వ్..ప‌వార్

కాంగ్రెస్ మీడియా ఇన్ చార్జ్ జైరాం ర‌మేష్

Jairam Ramesh : కాంగ్రెస్ పార్టీ మీడియా ఇన్ ఛార్జ్ జై రాం ర‌మేష్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఈ మేర‌కు పార్టీ ప‌రంగా రాహుల్ గాంధీ చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్ర‌కు అనూహ్య స్పంద‌న ల‌భిస్తోంద‌న్నారు. బుధ‌వారం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాల‌యంలో జైరాం ర‌మేష్ మీడియాతో మాట్లాడారు. ఇప్ప‌టికే 48 రోజుల పాటు రాహుల్ గాంధీ చేప‌ట్టిన యాత్ర పూర్త‌యింద‌న్నారు.

త‌మిళ‌నాడులోని క‌న్యాకుమారి నుంచి ప్రారంభ‌మైన ఈ యాత్ర కేర‌ళ‌, క‌ర్ణాట‌క‌, ఏపీ రాష్ట్రాల‌లో పూర్తి చేసుకుంద‌న్నారు. ప్ర‌స్తుతం తెలంగాణ‌లోని నారాయ‌ణపేట జిల్లా మ‌క్త‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలోని కృష్ణాకు చేరుకుంద‌న్నారు. అక్క‌డి నుంచి గూడె బ‌ల్లూరు వ‌ర‌కు వ‌చ్చి ఆగి పోయింద‌న్నారు.

ఏఐసీసీ కొత్త బాస్ గా కొలువు తీరిన మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే ప్ర‌మాణ స్వీకారం ఉన్నందున రాహుల్ గాంధీ చేప‌ట్టిన పాద‌యాత్ర‌కు బ్రేక్ ప‌డింద‌న్నారు. తిరిగి అక్టోబ‌ర్ 27 గురువారం నుండి తెలంగాణ‌లోని ఉమ్మ‌డి పాలమూరు జిల్లా గూడెబ‌ల్లూరు నుంచి కొన‌సాగుతుంద‌ని స్ప‌ష్టం చేశారు.

ఇదిలా ఉండ‌గా తెలంగాణ‌లో రాహుల్ పాద‌యాత్ర పూర్త‌య్యాక వెంట‌నే మ‌హారాష్ట్ర‌లోకి ప్ర‌వేశిస్తుంద‌ని చెప్పారు జైరాం ర‌మేష్‌(Jairam Ramesh). ఇందులో భాగంగా శివ‌సేన పార్టీ చీఫ్, మాజీ సీఎం ఉద్ద‌వ్ ఠాక్రేతో పాటు కేంద్ర మాజీ మంత్రి, ఎన్సీపీ చీఫ్ శ‌ర‌ద్ ప‌వార్ కూడా రాహుల్ యాత్ర‌లో పాల్గొంటార‌ని వెల్ల‌డించారు.

ఈ పాద‌యాత్ర దెబ్బ‌కు బీజేపీ, దాని అనుబంధ సంఘాలు బెంబేలెత్తి పోతున్నాయ‌ని అన్నారు జైరాం ర‌మేష్.  ఇప్ప‌టి వ‌ర‌కు 50 ప్ర‌ధాన సంఘాలు త‌మ స‌మ‌స్య‌ల‌ను రాహుల్ గాంధీతో ప్ర‌స్తావించార‌ని తెలిపారు.

Also Read : మ‌రాఠా సీఎంపై కామెంట్స్..సీరియ‌స్

Leave A Reply

Your Email Id will not be published!