Eatala Rajender : ప్రజాస్వామ్యానికి పాతర రాచరికానికి జాతర
కేసీఆర్ రాచరిక పాలనపై ఆగ్రహం
Eatala Rajender : ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన నీచమైన సంస్కృతి భారతీయ జనతా పార్టీది కాదన్నారు ఆ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి ఈటల రాజేందర్. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. అవినీతి, అక్రమాలు, మోసాలకు పెట్టింది పేరన్నారు.
ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన ఘనత కేసీఆర్ కు ఉందని ఆయన ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. నిండు సభలో తెలంగాణను ఇచ్చింది కాంగ్రెస పార్టీ అని పొగిడిన ఈ సీఎం ఆ పార్టీని నామ రూపాలు లేకుండా చేశారని సంచలన ఆరోపణలు చేశారు.
టీడీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకుని మంత్రి పదవులు ఇచ్చింది నువ్వు కాదా అని ప్రశ్నించారు. తలా తోకా లేకుండా మాట్లాడుతూ ప్రజలను సమస్యల నుంచి కప్పి పుచ్చేందుకే ఈ ఫామ్ హౌజ్ నాటకానికి తెర తీశాడని ఫైర్ అయ్యారు ఈటల రాజేందర్(Eatala Rajender). తాను చేర్చుకున్న ఎమ్మెల్యేలలో ఏ ఒక్కరైనా తమ పదవులకు రాజీనామాలు చేశారా అని నిలదీశారు.
తనకు వ్యతిరేకంగా ఎవరూ ఉండ కూడదని , ఏ ఒక్కరు ప్రశ్నించ వద్దని ఛానళ్లను, పేపర్లను కొనుగోలు చేయలేదా అది తెలంగాణ సమాజానికి తెలియదని అనుకుంటే ఎలా అని అన్నారు. పూర్తిగా పాలన పడకేసినా ఈరోజు వరకు సోయి లేకుండా ఉన్నారంటూ ధ్వజమెత్తారు.
చట్టాలను తుంగలో తొక్కి అధికారులను బానిసలుగా చేసి ప్రజా ప్రతినిధులను తాబేదారులుగా మార్చేసిన చరిత్ర కేసీఆర్ కే దక్కుతుందన్నారు.
గతంలో రేవంత్ రెడ్డిపై ఓటుకు నోటు కేసు పెట్టిన విధంగానే సీఎం కేసీఆర్ పై కూడా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
Also Read : మునుగోడు కౌంటింగ్ ఏర్పాట్లపై ఫోకస్