Tamilisai Soundararajan Sharmila : షర్మిల అరెస్ట్ తీరు బాధాకరం – తమిళి సై
మహిళల పట్ల ఇలాగేనా వ్యవహరించేది
Tamilisai Soundararajan Sharmila : తెలంగాణ రాష్ట్రానికి చెందిన పోలీసులు అనుసరిస్తున్న వైఖరిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారంటూ విపక్షాలు ఇప్పటికే మండి పడుతున్నాయి. తాజాగా వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల పట్ల అనుసరించిన విధానం, దాడి చేయడం తీవ్ర కలకలం రేపింది.
దేశ వ్యాప్తంగా చర్చకు దారితీసింది. జాతీయ స్థాయిలో ఒక్కసారిగా వైఎస్ షర్మిల అరెస్ట్ వ్యవహారం ప్రాధాన్యత అంశంగా మారింది. ఈ తరుణంలో షర్మిలను కారులో ఉండగానే లాక్కెళ్లడం, ఎస్ ఆర్ పోలీస్ స్టేషన్ లో ఉంచడం, ఆపై కేసు నమోదు చేయడం వంటి పరిణామాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి.
మరో వైపు ఆమె పట్ల ఖాకీలు అనుసరించిన తీరు పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు గవర్నర్ తమిళి సై సౌందర రాజన్. ఏం జరిగిందనే దానిపై ఆరా తీశారు. పార్టీలు ఏవైనా , భావజాలాలు, సిద్దాంతాలు వేరైనా మహిళల పట్ల ఇలాంటి దాడులకు దిగడం మంచి పద్దతి కాదని పేర్కొన్నారు.
బుధవారం గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. షర్మిలకు సంబంధించి సెక్యూరిటీ, ఆరోగ్య పరిస్థితిపై ఆవేదన చెందారు. షర్మిల కారు లోపట ఉండగా లాక్కెళ్లిన దృశ్యాలు తాను ప్రసార మాధ్యమాల ద్వారా చూశానని , కలవర పడ్డానని అన్నారు గవర్నర్ తమిళి సై సౌందర రాజన్(Tamilisai Soundararajan).
ప్రధానంగా మహిళలు, నాయకురాళ్ల పట్ల, కార్యకర్తల పట్ల కాస్తంత గౌరవంగా చూడాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
Also Read : దాడులకు భయపడం బరాబర్ ప్రశ్నిస్తం