Shashi Tharoor : చర్చించేందుకు ఛాన్స్ ఇవ్వకపోతే ఎలా
మోదీ బీజేపీ సర్కార్ పై శశి థరూర్ కామెంట్
Shashi Tharoor : భారత్, చైనా సరిహద్దు వివాదం పార్లమెంట్ లో తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ అంశంపై చర్చించేందుకు అవకాశం ఇవ్వాలని ప్రతిపక్షాలు పట్టుపట్టాయి. కానీ మోదీ ప్రభుత్వం ఒప్పుకోక పోవడంపై తీవ్రంగా స్పందించారు కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్(Shashi Tharoor). ఇది పూర్తిగా అప్రజాస్వామికమని పేర్కొన్నారు.
ప్రజాస్వామ్యం అంటేనే ప్రశ్నించడమని, ఆ మాత్రం నిలదీసేందుకు స్వేచ్ఛ లేక పోతే అది అరాచకం అవుతుందన్నారు. బుధవారం శశి థరూర్ మీడయాతో మాట్లాడారు. 1962లో భారత్ , చైనా మధ్య యుద్దం జరిగిన సమయంలో ఇదే పార్లమెంట్ లో ఆనాటి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ 162 మంది సభ్యులకు మాట్లాడేందుకు అవకాశం ఇచ్చారని ఈ సందర్బంగా గుర్తు చేశారు ఎంపీ.
కానీ నరేంద్ర మోదీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. దేశంలో, దేశానికి సంబంధించిన సరిహద్దులో ఏం జరుగుతుందనే దానిపై చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందన్నారు. లేకపోతే ఏదో దాస్తోందని అనుకోవాల్సి వస్తుందన్నారు శశి థరూర్(Shashi Tharoor). తాము సర్కార్ పనితీరును శంకించడం లేదన్నారు.
కానీ చర్చను మాత్రమే కోరుకుంటున్నామని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలి. అసలు ఏం చేయాలని అనుకుంటున్నారో ప్రధానమంత్రి మోదీ చెబితే వింటామని ఎద్దేవా చేశారు శశి థరూర్. దేశానికి పార్లమెంటరీ జవాబుదారీతనం అవసరమని అభిప్రాయపడ్డారు.
జాతీయ భద్రతకు సంబంధించి గోప్యత పాటించడంలో తప్పు లేదు. కానీ ఎలా జరిగిందనే దానిపై చర్చించ వచ్చన్నారు ఎంపీ. దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రక్షణ శాఖ మంత్రి కేవలం ప్రకటనతో విరమించడం భావ్యం కాదన్నారు
Also Read : సోనియా ఆధ్వర్యంలో సభ్యులు వాకౌట్