PURE Nirman RISE : ప్యూర్..నిర్మాణ్ ‘రైజ్’ ప్రాజెక్టుకు శ్రీకారం
13 వేల పాఠశాలల్లో పీరియడ్ పై అవగాహన
PURE Nirman RISE : శైలా తాళ్లూరి సారథ్యంలోని ప్యూర్ సంస్థ సామాజిక సేవా కార్యక్రమాలలో భాగం పంచుకుంటోంది. ఇందులో భాగంగా నిర్మాణ్ సంస్థతో కలిసి కొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. అటు ఆంధ్ర ప్రదేశ్ ఇటు తెలంగాణ రాష్ట్రాలలోని 13,000 ప్రభుత్వ బడుల్లో చదువుకుంటున్న బాలికలు, యువతులు, విద్యార్థినులకు నెల నెలా వచ్చే రుతు సమస్యపై అవగాహన కల్పించాలని ఒప్పందం చేసుకున్నాయి.
ఇందుకు సంబంధించి రైజ్ పేరుతో కొత్త ప్రాజెక్టును ప్రారంభించారు. ఇందులో భాగంగా రుతుక్రమంపై అవగాహన తో పాటు కెరీర్ గైడెన్స్ అందజేశారు. నెలసరి అనేది స్త్రీలలో ఒక భాగం. పీరియడ్స్ కు సంబంధించి అక్షరాస్యత తప్పనిసరి. అందుకే వారికి అవగాహన కల్పించాలని నిర్ణయించినట్లు ప్యూర్ సంస్థ సిఇఓ, ఐటీ లీడర్ , ప్రవాస భారతీయురాలైన శైలా తాళ్లూరి స్పష్టం చేశారు.
ప్యూర్ పీరియడ్స్ పై అవగాహన కల్పిస్తే నిర్మాణ్ సంస్థ కెరీర్ పై ఫోకస్ పెడుతుంది. కెరీర్ పరంగా ఎలాంటి అవకాశాలు ఉన్నాయో విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంది. బిట్స్ పిలానీకి చెందిన పూర్వ విద్యార్థి మయూర్ పట్నాల నిర్మాణ్ కు సిఇఓగా ఉన్నారు. ప్యూర్ , నిర్మాణ్(PURE Nirman RISE) కలిసి ఈ బృహత్ కార్యక్రమాన్ని ప్లాన్ చేశాయి.
రెండు సంస్థలు కలిసి పీరియడ్స్ పై, కెరీర్ పై విద్యార్థినులకు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు పట్నాల. ఇందుకు సంబంధించి వర్క్ షాప్ లు నిర్వహిస్తామన్నారు. 13 వేల పాఠశాలల్లో 26 లక్షల మంది పిల్లలకు అవగాహన కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు శైలా తాళ్లూరి వెల్లడించారు.
వచ్చే ఏడాది 2023 చివరి నాటికి తెలంగాణలో 6,000 బడులు, ఏపీలో 7,000 స్కూళ్లకు చేరువ అవుతామన్నారు. దీనిని దేశ వ్యాప్తంగా ఓ ఉద్యమంగా తీసుకు రావాలని అనుకుంటున్నట్లు తెలిపారు. నెలసరి అనేది ఆడపిల్లల చదువుకు ఆటంకం కాకూడదన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని పిల్లలకు దీనిపై అవగాహన ఉండదన్నారు.
ఆడపిల్లలతో పాటు అబ్బాయిలకు కూడా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు శైలా తాళ్లూరి.
Also Read : బిల్కిస్ కు షాక్ రివ్యూ పిటిషన్ కొట్టివేత