YS Sharmila : దొర‌పై యుద్ధం బీఆర్ఎస్ అంతం

మ‌ళ్లీ పాద‌యాత్ర చేస్తాన‌న్న ష‌ర్మిల

YS Sharmila : వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇక దొర పాల‌న‌కు చ‌ర‌మ‌గీతం పాడేందుకు తాను పాద‌యాత్ర చేప‌ట్ట‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఎక్క‌డైతే త‌న‌ను పాద‌యాత్ర చేప‌ట్ట‌కుండా అడ్డుకున్నారో అక్క‌డి నుంచే తిరిగి మొద‌లు పెడ‌తాన‌ని వెల్ల‌డించారు.

మంగ‌ళ‌వారం వైఎస్ ష‌ర్మిల(YS Sharmila) మీడియాతో మాట్లాడారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఇంకెన్ని కుట్ర‌లు ప‌న్నినా త‌న పాద‌యాత్ర‌ను అడ్డుకోలేర‌న్నారు. తాను ఎన్ని అవాంత‌రాలు ఎదురైనా దాటుకుని ముందుకు సాగుతాన‌ని స్ప‌ష్టం చేశారు వైఎస్ ష‌ర్మిల‌.

తెలంగాణ‌లో రాచ‌రిక పాల‌న సాగుతోంద‌ని, అవినీతి, అక్ర‌మాల‌కు కేరాఫ్ గా రాష్ట్రం మారి పోయింద‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. తాను ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావించాన‌ని కానీ త‌నపై అకార‌ణంగా కేసులు న‌మోదు చేశార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

భార‌త రాష్ట్ర స‌మితి పార్టీకి చెందిన ప్రజా ప్ర‌తినిధులు రాష్ట్రాన్ని అందినంత మేర దోచుకున్నారంటూ ఆరోపించారు వైఎస్ ష‌ర్మిల‌.

బీఆర్ఎస్ పాల‌న‌కు మూడింద‌న్నారు. ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని కానీ ఇప్ప‌టి వ‌ర‌కు సీఎం ప‌రిష్క‌రించిన పాపాన పోలేద‌న్నారు. వ‌రంగ‌ల్ ఘ‌ట‌న‌తో త‌న పాద‌యాత్ర ఆగింద‌ని, కానీ అక్క‌డి నుంచే మ‌ళ్లీ యాత్ర ప్రారంభిస్తాన‌ని ప్ర‌క‌టించారు వైఎస్ ష‌ర్మిల‌(YS Sharmila). జ‌న‌వ‌రి 28 నుంచి తాను పాద‌యాత్ర‌కు శ్రీ‌కారం చుట్ట‌నున్న‌ట్లు చెప్పారు.

పోలీసులు అనుమ‌తి ఇవ్వ‌క పోయినా తాను ముందుకే వెళ‌తాన‌ని హెచ్చ‌రించారు. ప్ర‌జాస్వామ్యంలో ప్ర‌తి ఒక్క‌రికీ ప్ర‌శ్నించే, పాద‌యాత్ర చేసే హ‌క్కు ఉంద‌న్నారు వైఎస్ ష‌ర్మిల‌. కావాల‌ని త‌న‌పై దాడికి పాల్ప‌డ్డారంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

Also Read : నారా లోకేష్ యాత్ర‌కు లైన్ క్లియ‌ర్

Leave A Reply

Your Email Id will not be published!