YS Sharmila : నిరుద్యోగుల కోసం కలిసి పోరాడుదాం
పిలుపునిచ్చిన వైఎస్ షర్మిల
YS Sharmila : వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్ వేదికగా సోమవారం ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కొలువు తీరిన ప్రభుత్వం సమస్యలను పరిష్కరించడంలో వైఫల్యం చెందిందని ఆవేదన చెందారు. రాష్ట్రంలో 2 లక్షల కొలువులు ఖాళీగా ఉన్నాయని బిశ్వాల్ కమిటీ చెప్పినా ఇప్పటి వరకు ఒక్క పోస్టు కూడా భర్తీ చేసిన పాపాన పోలేదన్నారు.
నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లారని, అత్యున్నతమైన నియామక సంస్థగా పేరు పొందిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇవాళ అవినీతికి, అక్రమాలకు, లీకేజీలకు కేరాఫ్ గా మారి పోవడం దారుణమన్నారు వైఎస్ షర్మిల(YS Sharmila) .
టీఎస్పీఎస్సీలో చోటు చేసుకున్న లీకేజీ వ్యవహారానికి సంబంధించి సిట్ కాకుండా కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ చేపట్టాలని కోరారు. లక్షలాది మంది నిరుద్యోగులు ఇవాళ జాబ్స్ కోసం వేచి చూస్తున్నారని వారికి అండగా నిలవాల్సిన బాధ్యత ప్రతిపక్షాలపై ఉందన్నారు వైఎస్ షర్మిల. ఆయా పార్టీలకు సంబంధించి జెండాలు వేరైనా ఒకే అజెండా కింద పని చేద్దామని ఆమె పిలుపునిచ్చారు.
పార్టీలకు అతీతంగా తెలంగాణను కాపాడుకుందాం అనే ఒకే ఒక్క నినాదంతో కదిలి రావాలంటూ కోరారు. ఈ మేరకు ఆమె అన్ని పార్టీల అధ్యక్షులకు విన్నవించారు. ఇవాళ తెలంగాణ ఒకే ఒక్క కుటుంబం చేతిలో బందీ అయి పోయిందని ఆరోపించారు. లక్షల కోట్ల అవినీతి చోటు చేసుకుందని దీనిపై వెంటనే విచారణ జరిపిస్తే అసలు వాస్తవాలు వెలుగు చూస్తాయన్నారు.
Also Read : గెలుపు ఖాయం మాదే రాజ్యం