కేంద్ర మాజీ రక్షణ శాఖ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఏకే ఆంటోనీ తనయుడు, టెక్కీగా ఎంట్రప్రెన్యూర్ గా పేరొందిన అనిల్ కె ఆంటోనీ కాంగ్రెస్ కు రిజైన్ చేశారు. భారతీయ జనతా పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్బంగా తండ్రి ఏకే ఆంటోనీ సీరియస్ గా స్పందించారు. తన కొడుకు తీసుకున్న నిర్ణయం పూర్తిగా తప్పు అని అభిప్రాయపడ్డారు.
ఇది మంచి పద్దతి కాదన్నారు. లౌకిక వాదంతో ముందుకు సాగుతున్న తన సిద్దాంతానికి తన కొడుకు తూట్లు పొడిచి కాషాయ జెండా నీడలోకి చేరడం తనను తీవ్రంగా బాధకు గురి చేసిందని ఆవేదన చెందారు ఏకే ఆంటోనీ.
ఈ సందర్భంగా తన తండ్రి తనపై చేసిన సీరియస్ కామెంట్స్ పై స్పందించారు తనయుడు అనిల్ కె ఆంటోనీ. ఇది ఏ విధమైన వ్యక్తిగతం కాదన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారంతా కుటుంబంగా భావిస్తారని కానీ తాను బీజేపీలో చేరడం దేశం కోసమేనని పేర్కొన్నారు.
ఇది ఆలోచనల మధ్య చోటు చేసుకున్న వ్యత్యాసం. దేశం ఎక్కడ ఉంది. మనం ఏం చేస్తున్నామనే దానిపై ఆలోచించు కోలేని స్థితిలో ఉన్నారంటూ ఎద్దేవా చేశారు. నేను యువ భారత దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నానని చెప్పారు. కాంగ్రెస్ ఈ దేశ భవిష్యత్తు కాదని కుండ బద్దలు కొట్టారు. ఆధునిక పోకడలను అర్థం చేసుకోకుండా దేశాన్ని పాలించాలని అనుకోవడం భ్రమ అని కొట్టి పారేశారు అనిల్ కె ఆంటోనీ.