కర్ణాటకలో రాజకీయం వేడెక్కింది. మే 10న పోలింగ్ జరగనుంది. ఈ తరుణంలో కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు నటీ నటులు, టెక్నిషియన్లలో కొందరు అధికారంలో ఉన్న బీజేపీకి మద్దతు పలికితే మరికొందరు మౌనంగా ఉన్నారు. ఇదే సమయంలో ప్రముఖ నటుడు కిచ్చా ప్రదీప్ ఉన్నట్టుండి కాషాయ రాగం అందుకున్నారు.
ఆయన ఇటీవల సీఎం బొమ్మై సమక్షంలో కీలక వ్యాఖ్యలు చేశారు. తాను బీజేపీకి మద్దతు ఇస్తున్నానని కానీ అభ్యర్థులకు కాదన్నారు. ప్రచారం చేస్తానని కానీ తాను పోటీ చేయబోనంటూ ప్రకటించారు.
కిచ్చా ప్రదీప్ చేసిన వ్యాఖ్యలను ప్రముఖ విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ సీరియస్ గా స్పందించారు. కళాకారులు ప్రజల కోసం పని చేయాలి కానీ పాలకుల కోసం కాదని, మతం పేరుతో విద్వేషాలు రగులుస్తూ పవర్ లో కొనసాగుతున్న బీజేపీకి మద్దతు ఇవ్వడం దారుణమన్నారు. ఇదే సమయంలో శుక్రవారం కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ డీకే శివకుమార్ నిప్పులు చెరిగారు.
సినిమా స్టార్లు వస్తుంటారు పోతుంటారని వారి వల్ల ఓట్లు రావన్నారు. ప్రజల మధ్య ఉంటూ వారి కోసం పని చేసే వారికే పట్టం కడతారని , తళుకు బెళుకులు ఓట్లను రాల్చవంటూ ఎద్దేవా చేశారు. కిచ్చా ప్రదీప్ బీజేపీకి మద్దతు ఇవ్వడం వల్ల తమకు ఒరిగే నష్టం ఏమీ లేదన్నారు డీకే శివకుమార్.