హైదరాబాద్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన కీలక లీగ్ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ ఎలెవన్ స్కిప్పర్ శిఖర్ ధావన్ మెరిశాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 143 పరుగులు చేసింది. ఓ వైపు టపా టపా వికెట్లు రాలుతున్నా ఎక్కడా తగ్గలేదు గబ్బర్. ఏకంగా 99 పరుగులు చేసి చివరి దాకా ఉన్నాడు. ఇప్పటి వరకు మూడు మ్యాచ్ లు ఆడింది పంజాబ్. రెండు గెలిచి ఒకటి కోల్పోయింది. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే ఆ జట్టుకు ఐపీఎల్ సీజన్ లో ఇదే తొలి విజయం కావడం విశేషం. టీమ్ మూడు మ్యాచ్ లు ఆడగా రెండింట్లో ఓటమి పాలైంది.
ఇక కెప్టెన్ శిఖర్ ధావన్ హైదరాబాద్ బౌలర్ల కు చుక్కలు చూపించాడు. ఏకంగా 12 ఫోర్లు 5 సిక్సర్లతో రెచ్చి పోయాడు. మైదానం నలు వైపులా కళ్లు చెదిరే షాట్స్ తో ఆకట్టుకున్నాడు. ఒక రకంగా క్రికెట్ ఫ్యాన్స్ మనసు దోచుకున్నాడు. ఇక 144 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయింది. ఆ జట్టులో రాహుల్ త్రిపాఠి మారథన్ ఇన్నింగ్స్ ఆడాడు. 74 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.
అతడితో పాటు కెప్టెన్ మార్క్రమ్ 37 పరుగులతో సత్తా చాటాడు. మొత్తంగా హైదరాబాద్ మొదటి విజయాన్ని దక్కించు కోవడంతో ఆ జట్టు సిఇఓ కావ్య మారన్ పెదవులపై నవ్వు మెరిసింది. ఫ్యాన్స్ పండుగ చేసుకున్నారు. ఇక త్రిపాఠి 48 బంతులు ఎదుర్కొని సిక్స్ లు, ఫోర్లతో రెచ్చి పోయాడు.