Criminals Politics Comment : నేర‌మ‌యం రాజ‌కీయం

చ‌ట్టం ఉన్నా లేన‌ట్టేనా

Criminals Politics Comment : ఒక‌ప్పుడు విలువ‌లు ఉండేవి. ఇప్పుడు వాటిని వెతుక్కోవాల్సిన ప‌ని ఏర్ప‌డింది. భార‌త దేశంలో రోజు రోజుకు రాజ‌కీయం అనేది ఖ‌రీదైన వ్యాపారంగా మారి పోయింది. రాను రాను నేర‌స్థుల జోక్యం ఎక్కువ‌వుతోంది.

ఒక ర‌కంగా చెప్పాలంటే గ‌త 20 ఏళ్ల‌లో నేర చ‌రిత్ర క‌లిగిన వారే చ‌ట్ట స‌భ‌ల్లోకి ఎక్కువ‌గా రావ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. ప్ర‌స్తుతం రాజ‌కీయం, నేరం క‌లిసి కాపురం చేస్తున్నాయి. ప్ర‌స్తుతం ప్ర‌జా ప్ర‌తినిధుల‌ను ఎంపిక చేయాలంటే ఇబ్బంది ఏర్ప‌డుతోంది. దేశ వ్యాప్తంగా ఉన్న ప్రజా ప్ర‌తినిధుల‌లో నిజాయితీ క‌లిగి, ప్ర‌జా సేవ‌కు అంకితం అయిన వారిలో కేవ‌లం 10 శాతంకు మించి ఉండ‌క పోవ‌డం ప్ర‌మాదాన్ని సూచిస్తోంది.

ఆయా రాజ‌కీయ పార్టీలు త‌మ స్వ‌లాభం కోసం, వ్యాపారాల కోసం నేర‌స్థుల‌ను పెంచి పోషిస్తున్నారు. మ‌రికొంద‌రు తామే ఎందుకు వారికి స‌పోర్ట్ గా ఉండాల‌ని ఏకంగా పాలిటిక్స్ లోకి నేరుగా వ‌చ్చేస్తున్నారు. లాండ్, శాండ్ మాఫియాకు పాల్ప‌డుతున్నారు.

ఇక దారుణాల‌కు లెక్క లేదు. హ‌త్య‌ల‌కు, అత్యాచారాల‌కు కొద‌వ లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే నేర చ‌రిత్ర‌ల లిస్టు చాంతాడంత అవుతుంది. నేర‌స్థులు ప్ర‌జా ప్ర‌తినిధులుగా ఎన్నికైతే ఇక ప్ర‌జాస్వామ్యం ఎలా అవుతుంది.

తాజాగా యూపీలో కొన్నేళ్లుగా నేర సామ్రాజ్యాన్ని సృష్టిస్తూ వ‌చ్చిన మాజీ ఎంపీ అతిక్ అహ్మ‌ద్, సోద‌రుడు అశ్ర‌ఫ్ అహ్మ‌ద్ ల‌ను కాల్చి చంపారు. అత‌డిపై 110 కేసులు ఉన్నాయి. మొత్తం అత‌డు సంపాదించింది రూ. 11,000 కోట్ల ఆస్తులు. దీని వెనుక మాఫియా ఉంది. ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందాడు. ఒక‌సారి ఎంపీగా కూడా ఉన్నాడు. అత‌డిని పెంచి పోషించింది ఎస్పీ, బీఎస్పీ. ఇప్పుడు చిలుక ప‌లుకులు ప‌లుకుతున్నాయి.

అసాంఘిక కార్య‌క‌లాపాల‌కు, అవినీతి అక్ర‌మాల‌కు ప్ర‌జా ప్ర‌తినిధులు కేరాఫ్ గా మారి పోవ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. రాజ‌కీయ పార్టీల్లో త‌మ‌కున్న ప‌ద‌వుల పేరుతో నీతి మాలిన చ‌ర్య‌ల‌కు, దందాల‌కు పాల్ప‌డుతున్నారు.

కొన్ని చోట్ల వీరు పెత్త‌నం చెలాయిస్తే మ‌రికొంద‌రి కుటుంబీకులు దౌర్జ‌న్యాల‌కు పాల్ప‌డుతున్నారు. అందినంత మేర దోచుకుంటున్నారు. సంపాదించిన దానిని తిరిగి ఎన్నిక‌ల్లో ఖ‌ర్చు పెట్ట‌డం చివ‌ర‌కు గెల‌వ‌డం మ‌ళ్లీ అక్ర‌మాల‌కు పాల్ప‌డ‌డం ఓ ఆచారంగా మారి పోయింది. చ‌ట్టాల్లో ఉన్న లొసుగుల‌ను ఆసారాగా చేసుకుని నేర‌స్థులు అడ్డూ అదుపు లేకుండా విస్త‌రిస్తున్నారు.

ప్ర‌జా ప్ర‌తినిధుల రూపంలో ఊరేగుతున్నారు. ఒక ర‌కంగా దేశాన్ని, రాష్ట్రాల‌ను భ్ర‌ష్టు ప‌ట్టిస్తున్నారు. చ‌ట్టాలు చేసే స్థాయిలో వీరుంటే సామాన్యుల‌కు ఏం న్యాయం స‌మ‌కూరుతుంది. న్యాయ వ్య‌వ‌స్థ‌లో మార్పు రావాలి. అదే స‌మ‌యంలో నేర చ‌రిత్ర క‌లిగిన వారిని రాజ‌కీయాల‌కు దూరంగా ఉండేలా చ‌ట్టం తీసుకు వస్తే కొంత మేర‌కైనా ఫ‌లితం ద‌క్కుతుంది.

ఇక పాలిటిక్స్ లో కుల‌, ధ‌న ప్ర‌భావం త‌గ్గితే బావుంటుంద‌న్న అభిప్రాయం వ్య‌క్తం అవుతోంది. మొత్తంగా స‌మాజంలో మార్పు రానంత వ‌ర‌కు ఈ అరాచ‌కాలు కొన‌సాగుతూనే ఉంటాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

Also Read : మోడీని ఢీకొనే మ‌గాడు లేడు

Leave A Reply

Your Email Id will not be published!