ప్రముఖ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ నిప్పులు చెరిగారు. ఆయన పరివర్తన్ పేరుతో బీహార్ లో పాదయాత్ర చేస్తున్నారు. ప్రజలతో మమేకం అవుతున్నారు. ఈ సందర్బంగా ప్రధానంగా గత కొంత కాలం నుంచీ జేడీయూ చీఫ్, బీహార్ సీఎం నితీశ్ కుమార్ ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదిలా ఉండగా దేశ వ్యాప్తంగా ప్రతిపక్షాలను ఏకం చేసే పనిలో బిజీగా గడుపుతున్నారు నితీశ్ కుమార్. ఆయన తన డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ తో కలిసి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని కలిశారు.
అంతుకు ముందు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, మాజీ చీఫ్ రాహుల్ గాంధీతో పాటు ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను కలిశారు. అన్ని పక్షాలను ఏకం చేయడం తన ముందున్న లక్ష్యమని స్పష్టం చేశారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఒకే ఒక్క పార్టీ ఉండాలని అన్ని పార్టీలు కలిసి ఒక నిర్ణయానికి రావాలని సూచించారు. ఇందుకోసం తాను కృషి చేస్తానని ప్రకటించారు. ఇదే సమయంలో సీఎం మమతా బెనర్జీ బీహార్ వేదికగా అన్ని పక్షాలు ఒక్కటేనన్న సందేశం వినిపించాలని, ప్రజలు దానిని విశ్వసించేలా చేయాలని కోరారు.
ఈ తరుణంలో ప్రశాంత్ కిషోర్ సీరియస్ గా స్పందించారు. బీహార్ లో ఎప్పుడు కూలి పోతుందో తెలియని పరిస్థితిలో ఉన్న సీఎం నితీశ్ కుమార్ ఎలా ప్రతిపక్షాలను ఒకే తాటిపైకి తీసుకు వస్తాడని ప్రశ్నించారు. గతంలో 2019లో టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు కూడా ఇలాగే చేశాడని కానీ బొక్క బోర్లా పడ్డాడని గుర్తు చేశారు. నితీశ్ కు అంత సీన్ లేదన్నారు. తన పార్టీ నుంచి ప్రాతినిధ్యం లేకుండా ఎలా మ్యానేజ్ చేస్తాడో చెప్పాలన్నాడు పీకే.