నిన్న అనారోగ్యంతో మృతి చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు , నాలుగుసార్లు సీఎంగా పనిచేసిన ప్రకాశ్ సింగ్ బాదల్ పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు మాజీ ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్. బుధవారం ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ దేశంలో రైతులు బాగుండాలని కోరుకున్న నాయకుడు బాదల్ అని కొనియాడారు. ప్రకాశ్ సింగ్ బాదల్ లేని లోటు పూడ్చ లేనిదని పేర్కొన్నారు. రైతుల సంక్షేమం కోసం చివరి దాకా పాటు పడ్డారని కొనియాడారు మాజీ పీఎం.
శ్వాస సంబంధమైన ఇబ్బంది కారణంగా మొహాలీ లోని ఆస్పత్రిలో చేరారు. మంగళవారం తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 95 ఏళ్లు. అకాళీదళ్ నాయకుడిగా, పంజాబ్ అభివృద్దికి ఎన్నో రకాలుగా సేవలు అందించారని తెలిపారు మన్మోహన్ సింగ్. దేశ రాజకీయాల్లో ముఖ్యమైన పాత్ర పోషించిన ఘనత ప్రకాశ్ సింగ్ బాదల్ కే దక్కుతుందని స్పష్టం చేశారు.
బాదల్ కుమారుడు సుఖ్ బీర్ సింగ్ బాదల్ కు రాసిన సంతాప లేఖలో మన్మోహన్ సింగ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తాను అత్యంత ఆత్మీయుడిని కోల్పోయానని వాపోయారు. మన సమాజంలోని రైతులు, ఇతర బలహీన వర్గాల సంక్షేమం కోసం ఎంతగానో కృషి చేశారంటూ తెలిపారు మన్మోహన్ సింగ్.