Rahul Gandhi : విద్వేషం..విధ్వంసం బీజేపీ నేపథ్యం
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రజా పాలన
Rahul Gandhi : ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. భారతీయ జనతా పార్టీపై భగ్గుమన్నారు. గురువారం ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్ణాటక లోని ఉడిపిలో జరిగిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు రాహుల్ గాంధీ. తాము ఎక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసినా బడుగు, బలహీన వర్గాల వారిని ఆదుకుంటుందని స్పష్టం చేశారు. విచిత్రం ఏమిటంటే న్యాయబద్దంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల్చిన ఘనత బీజేపీదేనని ఇది మీరంతా కళ్ల ముందు చూశారని చెప్పారు రాహుల్ గాంధీ(Rahul Gandhi).
ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేసి, ఎమ్మెల్యేలకు ఎర చూపి బీజేపీ అన్యాయంగా కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని ధ్వజమెత్తారు. ఇక ఈసారి అలాంటి అప్రజాస్వామిక చర్యలకు పాల్పడితే తగిన రీతిలో బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు రాహుల్ గాంధీ. మోదీ సర్కార్ చేస్తున్న ఆగడాలను , మోసాలను నిత్యం ఎండగడుతున్నందుకే తనను ఎంపీగా అనర్హత వేటు వేశారంటూ ఆరోపించారు. ఈ దేశంలో ప్రజాస్వామ్యం అన్నది లేకుండా పోయిందన్నారు.
తనను ఎంపీగా అనర్హుడిగా ప్రకటించినా ప్రజల మనస్సులోంచి చెరప లేరని స్పష్టం చేశారు రాహుల్ గాంధీ(Rahul Gandhi). కులం పేరుతో, మతం పేరుతో, ప్రాంతాల పేరుతో దేశంలో విద్వేషాలను రెచ్చగొట్టడం బీజేపీ పనిగా పెట్టుకుందని ఆరోపించారు. ప్రజలంతా ఒక్కటిగా ఉండాలని కోరుతూ తాను భారత్ జోడో యాత్ర చేపట్టానన్నారు. ఇకనైనా కర్ణాటక ప్రజలు వాస్తవాలు తెలుసుకుని కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని కోరారు రాహుల్ గాంధీ.
Also Read : అమిత్ షాపై కాంగ్రెస్ ఫిర్యాదు