తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కీలక ప్రకటన చేశారు. టీటీడీ ఆధ్వర్యంలో ప్రవాస భారతీయ భక్తుల కోసం అమెరికా, కెనడా నగరాలలో వచ్చే జూన్ , జూలై నెలల్లో 14 నగరాల్లో శ్రీ మలయప్ప స్వామి వారి కళ్యాణోత్సవాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు గురువారం కీలక ప్రకటన చేశారు.
శ్రీనివాస కళ్యోణోత్సవం పోస్టర్లను తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో టీటీడీ చైర్మన్, ఏపీ ఎన్ఆర్టీఎస్ చీఫ్ వెంకట్ ఎస్ మేడపాటి, టూరిజం శాఖ చీఫ్ వర ప్రసాద్ , కార్పొరేషన్ డైరెక్టర్లు ఆవిష్కరించారు.
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర, దేశ , విదేశాలలో శ్రీనివాస కళ్యాణోత్సవాలను నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇందులో భాగంగా జూన్ , జూలై, అక్టోబర్, నవంబర్ నెలల్లో గత ఏడాది యుఎస్ఏ, యుకె, యూరప్ లలోని 20 నగరాల్లో అత్యంత వైభవోపేతంగా శ్రీ మలయప్ప స్వామి వారి కళ్యోణోత్సవాలను తెలుగు అసోసియేషన్ , ధార్మిక సంస్థల సహకారంతో నిర్వహించడం జరిగిందని చెప్పారు.
బహ్రెయిన్ లో నిర్వహించిన కళ్యాణోత్సవానికి 15 వేల మందికి పైగా భక్తులు స్వామి, అమ్మ వార్లను దర్శనం చేసుకున్నట్లు చెప్పారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. ఇది పూర్తిగా టీటీడీ ఆధ్వర్యంలోనే జరుగుతుందని స్పష్టం చేశారు. లడ్డూ, ప్రసాదాలతో పాటు భక్తులకు అన్ని సౌకర్యాలు ఉంటాయని తెలిపారు.
