Chandrababu Naidu : రైత‌న్న‌ల గోస ప‌ట్ట‌ని జ‌గ‌న్ – చంద్ర‌బాబు

ఏపీ సీఎంపై నిప్పులు చెరిగిన మాజీ సీఎం

తెలుగుదేశం పార్టీ జాతీయ క‌న్వీన‌ర్, మాజీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు నిప్పులు చెరిగారు. రైతుల‌ను ఆదుకోవ‌డంలో ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి విఫ‌ల‌మయ్యారంటూ మండిప‌డ్డారు. శుక్ర‌వారం ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా త‌ణుకు నియోజ‌క‌వ‌ర్గంలో ఇర‌గ‌వ‌రం నుంచి చంద్రాబు నాయుడు రైతు పోరు బాట పాద‌యాత్ర ప్రారంభంచారు. పాద‌యాత్ర సంద‌ర్భంగా మార్గ మ‌ధ్యంలో అకాల వ‌ర్షాల కార‌ణంగా దెబ్బ‌తిన్న పంట‌ల‌ను ప‌రిశీలించారు.

రైతులతో ముచ్చ‌టించారు. వారికి భ‌రోసా క‌ల్పించారు. ఈ సంద‌ర్భంగా కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు వెంట‌నే పంట‌లు కోల్పోయిన రైతుల‌ను ఆదుకోవాల‌ని డిమాండ్ చేశారు. ఈరోజు వ‌ర‌కు ఏపీ సీఎం ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌క పోవ‌డం దారుణ‌మ‌న్నారు.

పంట‌లు కోల్పోయిన అన్న‌దాత‌ల‌కు న్యాయం చేయాల్సిన బాధ్య‌త ఏపీ సీఎంపై ఉంద‌న్నారు. మాయ మాట‌లు చెప్ప‌డం, సంక్షేమ ప‌థ‌కాల పేరుతో ప్ర‌చారం చేసుకోవ‌డం త‌ప్ప రాష్ట్రానికి సీఎం చేసింది ఏమీ లేద‌ని మండిప‌డ్డారు. ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో అకాల వ‌ర్షాల కార‌ణంగా ఎన్ని పంట‌లు కోల్పోయార‌నే దానిపై వివ‌రాలు ప్ర‌భుత్వం వ‌ద్ద లేవ‌న్నారు.

వెంట‌నే చ‌ర్య‌లు తీసుకోవాల్సిన సీఎం స‌మీక్ష‌ల పేరుతో కాల‌యాప‌న చేస్తున్నారంటూ ధ్వ‌జ‌మెత్తారు నారా చంద్ర‌బాబు నాయుడు. ఇది పూర్తిగా బాధ్య‌తా రాహిత్యం త‌ప్ప మ‌రొక‌టి కాద‌న్నారు.

Leave A Reply

Your Email Id will not be published!