కర్ణాటక రాజకీయం హస్తినకు చేరింది. 224 సీట్లకు గాను 136 సీట్లు సాధించింది కాంగ్రెస్ పార్టీ. బీజేపీ 66 సీట్లు గెలిచింది. 19 సీట్లకే పరిమితమైంది జేడీఎస్ . నలుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు విజయం సాధించారు. ఆ నలుగురు సైతం కాంగ్రెస్ పార్టీకి బేషరతుగా మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. అద్భుతమైన మెజారిటీ కట్టబెట్టినా ఇంకా సీఎం ఎవరనేది తేల్చలేక పోతోంది పార్టీ హైకమాండ్. చివరకు ఈ సీఎం పంచాయతీ హస్తినకు చేరుకుంది.
దీంతో అటు సీఎం పోస్టును ఆశిస్తున్న మాజీ సీఎం సిద్దరామయ్య, కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ ఇరువురు తమ తమ దారుల్లో ప్రయత్నాలు ప్రారంభించారు. ఇద్దరికీ హైకమాండ్ నుంచి సంపూర్ణ సహకారం ఉంది. కానీ ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై తలలు పట్టుకున్నారు. ఎవరిని ఎంపిక చేస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
ఇదిలా ఉండగా ఢిల్లీకి వెళ్లాలా వద్దా అనే అంశంపై డైలమాలో పడ్డారు కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్. ఆయన శనివారం తన ఇంట్లో గ్రాండ్ గా పుట్టిన రోజు జరుపుకున్నారు. ఈసారి ఎన్నికల్లో అన్నీ తానై వ్యవహరించాడు. పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించాడు. ఇదిలా ఉండగా సిద్దరామయ్య, డీకే శివకుమార్ ఇద్దరూ సీఎం పోస్టు రేసులో ఉన్నామని ప్రకటించారు. దీంతో పోటీ ఉత్కంఠ భరితంగా మారింది. ఢిల్లీకి వెళతారా అన్న ప్రశ్నకు డీకే సమాధానం ఇస్తూ తాను ఇంకా ఏమీ అనుకోలేదన్నారు.