Pawan Kalyan : ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటం ఆగదని స్పష్టం చేశారు జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్. వారాహి ప్రచార యాత్ర సందర్భంగా రెండో రోజు గురువారం పిఠాపురం నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఇందులో భాగంగా గొల్లప్రోలులో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వివిధ వర్గాలకు, రంగాలకు చెందిన ప్రముఖులు, మేధావులు, జర్నలిస్టులు, అనుభవజ్ఞులు, ఆచార్యులు, కవులు, కళాకారులు, నిపుణులు, వృత్తి రంగంలో పేరు పొందిన వారు, ఐటీ ప్రొఫెషనల్స్ , లాయర్లు, వైద్యులు, వ్యాపారులతో భేటీ అయ్యారు. ఆయన ఒక్కొక్కరితో ప్రత్యేకంగా మాట్లాడారు.
వారు అందించిన సూచనలు, వెలిబుచ్చిన అభిప్రాయాలను నోట్ చేసుకున్నారు. ఈ సందర్బంగా రాష్ట్రానికి ఏం కావాలనే దానిపై ఎక్కువగా ఫోకస్ పెట్టారు. అంతే కాకుండా ఈ ప్రాంతానికి ఏం చేస్తే నిరుద్యోగం పోతుందనే దానిపై సూచనలు తీసుకున్నారు. పర్యావరణానికి భంగం వాటిల్లకుండా పరిశ్రమలను ఏర్పాటు చేయడం, ప్రతిభ కలిగిన విద్యార్థులకు శిక్షణ ఇప్పించడం, తద్వారా కంపెనీలలో జాబ్స్ వచ్చేలా చూడడంపై దృష్టి పెడతానని స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్(Pawan Kalyan).
ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేశారు. ప్రజా సమస్యలపై ఎక్కడా వెనక్కి తగ్గేది లేదన్నారు. రాష్ట్రానికి అమరావతి మాత్రమే రాజధాని అని మరోసారి స్పష్టం చేశారు. తాను ప్రజల మనిషినని వారికి ఏ ఆపద వచ్చినా తాను ముందు ఉంటానని అన్నారు జనసేనాని.
Also Read : MK Stalin : మా జోలికి వస్తే తాట తీస్తం – స్టాలిన్