AP Rains : ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు
హెచ్చరించిన ఏపీ వాతావరణ శాఖ
AP Rains : ఏపీ వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. మూడు రోజుల పాటు భారీగా వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. వాయవ్య బంగాళా ఖాతంలో ఉత్తర ఒడిశా – పశ్చిమ బెంగాల్ తీరాలను ఆనుకుని ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది సముద్ర మట్టానికి 7.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించింది. నైరుతి వైపునకు వంగి ఉంది. దీని ప్రభావంతో ఆదివారం అదే ప్రాంతంలో అల్ప పీడనం ఏర్పడనుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది.
దీని ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు ఉత్తర , దక్షిణ కోస్తాంధ్రలో కొన్నిచోట్ల , రాయలసీమలో అక్కడక్కడా తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు(Rains) కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. అదే సమయంలో ఉరుములు, మెరుపులు కూడా సంభవిస్తాయని తెలిపింది. ఉత్తర కోస్తాంధ్రలో గంటకు 45 గరిష్టంగా 65 కిలో మీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని స్పష్టం చేసింది.
ఇదిలా ఉండగా అల్ప పీడనం నేపథ్యంలో సముద్రం అలజడిగా మారుతుందని, మత్స్య కారులు చేపల వేటకు వెళ్ల వద్దని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం సూచించింది. ఇందుకు సంబంధించి ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. సహాయక కేంద్రాలను అప్రమత్తం చేయాలని సూచించారు.
Also Read : Anil Kumar Yadav : ఆనం దమ్ముంటే నాపై పోటీకి దిగు